ETV Bharat / city

పారదర్శక సేవల కోసం సమూల మార్పులు..

author img

By

Published : Sep 23, 2020, 7:10 AM IST

government plan to reforms in registrations deportment
పారదర్శక సేవల కోసం సమూల మార్పులు..

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ముమ్మరమయ్యాయి. గడిచిన మూడేళ్ల వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం... కసరత్తు వేగవంతం చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్లు, ఉద్యోగులతోపాటు డాక్యుమెంట్‌ రైటర్ల వివరాలు తెప్పించుకున్నందున... పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీ మార్పులు జరిగేట్లు తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు నాలుగున్నర లక్షలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖ పరిధిలోకి వెళ్తుండడం వల్ల... రిజిస్ట్రేషన్ల శాఖ పునర్​వ్యవస్థీకరణ తప్పనిసరి అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా... 23 కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వాటిని పూర్తిగా ఎత్తివేసి... ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల్లో వాటిని తిరిగి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే... ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ల శాఖ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి, వరంగల్‌ తదితర జిల్లాల్లో 21 ప్రాంతాలల్లో కొత్తగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఎంతమంది ఉన్నారు..

రిజిస్ట్రేషన్ల శాఖలోనూ పారదర్శకత తీసుకురావాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం... ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో... సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా జరిగిన వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు, కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో... శాశ్వత, ఒప్పంద, తాత్కాలిక ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లలో ఎంతమందికి లైసెన్స్​ ఉంది, లేకుండా ఎంతమంతి కొనసాగుతున్నారు... వారి విద్యార్హతలేంటి తదితర వివరాలు తెప్పించుకుంది.

ఎన్ని చేయొచ్చు..

డాక్యుమెంట్లు అన్నీ సమగ్రంగా పరిశీలించి... రిజిస్ట్రేషన్లు చేయాలంటే రోజుకు 30కి మించి చేయడం సాధ్యం కాదని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతుండగా... కొన్ని చోట్ల వంద అంతకు మించి కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు అక్కడ ఏవిధంగా పెద్ద సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయగలుగుతున్నారు... అక్కడున్న ఉద్యోగులు ఎంతమంది వంటి వాటిని కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్ల వద్ద నుంచి మూడేళ్లకు చెందిన వివరాలను తెప్పించుకున్న రాష్ట్ర ప్రభుత్వం... వాటి ఆధారంగా ఏయే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరుగుతున్నాయి... తక్కువ జరుగుతున్న కార్యాలయాలేవి అన్నది అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

ప్రత్యేక నమూనాతో..

పునర్​వ్యవస్థీకరణలో భాగంగా పలు చర్యలు చేపట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థతో ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఎంత వరకు అవకాశం ఉందన్న కోణంలోనూ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక నమూన అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. భూములు, భవనాలు, వ్యాపార సముదాయాలు ఇలా క్యాటగిరీల వారీగా రిజిస్ట్రేషన్లకు అనువుగా అవసరమైన ఫార్మాట్లు తెచ్చినట్లయితే... సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉద్యోగులుగా తీసుకుంటే..

ఇదే విధానం అందుబాటులోకి తెస్తే... ఇప్పటి వరకు వేల సంఖ్యలో సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న డాక్యుమెంట్‌ రైటర్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని... అర్హులైన వారందరిని తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగులుగా తీసుకుంటే... వారికి ఉపాధి కల్పించట్టే కాకుండా పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా చేయడానికి ఏ మేరకు అవకాశాలు ఉన్నాయన్న కోణంలో... న్యాయపరంగా పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తోంది. తగిన విద్యార్హతలు ఉండి... లైసెన్స్‌ కలిగిన డాక్యుమెంట్‌ రైటర్లకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తే... ఏలాంటి న్యాయపరమైన చిక్కులు రావని కూడా అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: కలిసి సేవలందించనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్​ శాఖలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.