ETV Bharat / city

కలిసి సేవలందించనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్​ శాఖలు!

author img

By

Published : Sep 11, 2020, 7:16 AM IST

రాష్ట్రంలో రెవెన్యూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒకేసారి సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెండు శాఖల్లో ఒకేసారి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకు గానూ... తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ల నిర్వహణపై మరోసారి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు తహశీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లతోపాటు రెండు శాఖల అనుసంధాన ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

Revenue And Registration Departments Will Work With Together In Telangana
కలిసి సేవలందించనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్​ శాఖలు!

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ తహశీల్దార్‌ కార్యాలయాల్లోనే నిర్వహించాలని రెండేళ్ల కిందటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సిబ్బందికి రిజిస్ట్రేషన్ల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమని ప్రభుత్వం భావించింది. 2018లో రాష్ట్రంలోని 443 మంది తహశీల్దార్లకు పది రోజులు శిక్షణ కూడా ఇచ్చారు. భారత స్టాంపుల చట్టం-1899, రిజిస్ట్రేషన్ల చట్టం -1908లపై మూడు రోజులపాటు హైదరాబాద్‌ ఎంసీహెచ్‌ ఆర్డీలో అవగాహన కల్పించారు. ఆ తరువాత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏడు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. అప్పట్లో రాష్ట్రంలో 594 తహశీల్దార్‌ కార్యాలయాలు ఉండగా పట్టణ ప్రాంత రెవెన్యూ కార్యాలయ అధికారులను ఈ శిక్షణలో మినహాయించింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 21 మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

తెలంగాణలో రెవెన్యూ చట్టం తీసుకురావడం, తహశీల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పట్టణ తహశీల్దార్‌ కార్యాలయాలు, ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరుగుతున్న 21 ఎమ్మార్వో కార్యాలయాలను మినహాయించి, ఎన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన అధికార యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖ రెండింటినీ అనుసంధానం చేయాల్సి ఉండగా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ భూములతో సంబంధం లేని మండల రెవెన్యూ కార్యాలయాలను మినహాయించి మిగిలిన అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు.

రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో... మండల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కంప్యూటర్లు, నెట్‌వర్క్‌ అనుసంధానం, రిజిస్ట్రేషన్ల నిర్వహణకు కీలకమైన కార్డ్‌ సాప్ట్‌వేర్‌ అనుసంధానం లాంటి ప్రక్రియ మొదలుపెట్టేశారు. ధరణితో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉండగా రిజిస్ట్రేషన్‌ నిర్వహణకు ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ సౌకర్యం పాక్షికంగా అమలవుతోంది. ముందే స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడం ద్వారా... సమయం వృధా కాకుండా నిర్దేశించిన సమయానికి వస్తే... వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్​ పూర్తి చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతోంది.

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఫీజుల వసూలు, రికార్డుల నిర్వహణ ఇలా పలు అంశాలపై తహశీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రెండు శాఖలకు ఒకదానికొకటి అనుబంధం ఉండడం వల్ల... ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్లను మొదలు పెట్టరాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో.... అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్‌ శాఖల్లో అవసరమైన అనుసంధానం చేయడం, ఇతర ఏర్పాట్లు పూర్తయిన తర్వాతనే ఒకేసారి రెండు శాఖలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యేందుకు సర్కారు నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండిః 'తక్కువ సమయం.. ఎక్కువ ప్రశ్నల ఛాయిస్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.