ETV Bharat / city

Ap high court : తితిదే ప్రత్యేక ఆహ్వానితుల జీవోలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే

author img

By

Published : Sep 23, 2021, 7:46 AM IST

తితిదే ప్రత్యేక ఆహ్వానితుల జీవోల నిలిపివేత

తితిదే పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్ చేస్తూ ఈనెల 15న ఏపీ ప్రభుత్వం రెండు జీవోలు జారీ చేసింది ఈ జీవోలపై తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు ఆ రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఆ రెండు జీవోల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తితిదే పాలకమండలిలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నామినేట్‌ చేస్తూ ఈనెల 15న ఏపీ ప్రభుత్వం జారీచేసిన రెండు జీవోల అమలును ఆ రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేసింది. ఏపీ దేవాదాయ చట్టం సెక్షన్‌ 96లోని నిబంధనలను ఉల్లంఘించేవిగా జీవోలు ఉన్నాయని అభిప్రాయపడింది. వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ(దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే ఈవో, దేవాదాయశాఖ కమిషనర్‌కు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీనిపై లోతైన విచారణ జరపాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం.. రెండు ప్రజాహిత వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

తితిదే ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నియమిస్తూ రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్యకార్యదర్శి జి.వాణీమోహన్‌ ఈ నెల 15న జారీచేసిన జీవో 568, జీవో 569లను సవాలు చేస్తూ తెదేపా నాయకుడు ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశంపై హిందూ జనశక్తి సంక్షేమసంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్‌ మరో పిల్‌ వేశారు. బుధవారం రోజు జరిపిన విచారణలో ఉమామహేశ్వరనాయుడు తరఫున న్యాయవాది వై.బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. ‘దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 96 ప్రకారం తితిదే బోర్డు సభ్యులుగా 29 మందిని మించి నియమించకూడదు. ప్రస్తుతం 29 మంది సభ్యులను, ప్రత్యేక ఆహ్వానితులుగా 52 మందిని నామినేట్‌ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడింది. ప్రత్యేక ఆహ్వానితులకు అధికారాలు కట్టబెట్టడం సరికాదు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం తితిదే స్వతంత్రతను దెబ్బతీస్తుంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని జీవోల అమలును నిలుపుదల చేయండి’ అని కోరారు.

చట్టంలో నిషేధం లేదు: ఏజీ

ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రత్యేక ఆహ్వానితులను నియమించకూడదని చట్టంలో నిషేధం లేదు. తితిదే బోర్డు విధుల్లో, నిర్ణయాల్లో వారి పాత్ర ఉండదు. కేవలం ఆహ్వానితులు మాత్రమే. దర్శనం విషయంలోనే బోర్డు సభ్యులతో సమానంగా మర్యాదలుంటాయి. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వండి’ అని కోరారు. తితిదే తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. నియామకాలపై అభ్యంతరం ఉంటే వినతి ఇవ్వాలి. అలాంటిదేమీ లేకుండా పిటిషనర్‌ నేరుగా పిల్‌ దాఖలుచేశారు. వ్యాజ్యాన్ని కొట్టేయండి’ అని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం.. దేవాదాయ చట్టానికి విరుద్ధంగా ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలు ఉన్నాయంటూ వాటిని సస్పెండ్‌ చేసింది.

హిందూ జనశక్తి సంక్షేమసంఘం వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్‌కుమార్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. జీవోలు 568, 569లను సస్పెండ్‌ చేసింది.

ఇదే అంశంపై భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రత్యేక ఆహ్వానితులతో పాటు బోర్డు సభ్యుల నియామక జీవో 245ని సవాలు చేశామన్నారు. సభ్యుల్లో కొందరిపై క్రిమినల్‌ కేసులున్నాయన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సభ్యులపై ఆరోపణ చేస్తున్నప్పుడు వారిని ప్రతివాదులుగా చేర్చకుండా పిల్‌ దాఖలు చేయడం సరికాదంది. ఆ కారణంతో పిల్‌ను కొట్టేస్తామంది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సవరణతో అఫిడవిట్‌ వేయడానికి రెండు వారాల సమయం కోరగా, అంగీకరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.