ETV Bharat / city

కరోనాతో సహజీవనం చేయక తప్పదు: కేసీఆర్​

author img

By

Published : Jul 17, 2020, 12:30 PM IST

Updated : Jul 17, 2020, 10:50 PM IST

కరోనాతో సహజీవనం చేయక తప్పదు: కేసీఆర్​
కరోనాతో సహజీవనం చేయక తప్పదు: కేసీఆర్​

12:29 July 17

కరోనాతో సహజీవనం చేయక తప్పదు: కేసీఆర్​

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండరాదని సీఎం అన్నారు. వైరస్ సోకిన వారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని సూచించారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు.

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కరోనా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేవలం తెలంగాణలోనే లేదు. తెలంగాణలో పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణలో మరణాల రేటు తక్కువ. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు. వారిలో 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు.  లక్షణాలు లేనప్పటికీ కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ తో చికిత్స అందిస్తున్నాం. - కేసీఆర్​, ముఖ్యమంత్రి

దేశంలో అన్​లాక్ ప్రక్రియ నడుస్తోందని సీఎం కేసీఆర్​ తెలిపారు. కరోనాతో సహజీవనం చేయక తప్పని స్థితి వచ్చిందన్న సీఎం.. వైరస్​ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో ప్రజలు నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ... మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని,వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం సంసిద్ధం..

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం  సంసిద్ధంగా ఉంది. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్​లోని గాంధీ, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి.  ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. - కేసీఆర్​, ముఖ్యమంత్రి

పీహెచ్​సీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో...

ప్రజలు హైరానా పడిపోయి అధిక వ్యయం చేస్తూ.. ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మంచి చికిత్స అందుతుందన్నారు. ఎవరికి లక్షణాలు కనిపించినా వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లి, వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు.  రాష్ట్రంలో పీహెచ్​సీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా విషయంలో కావాల్సిన వైద్యం అందించడానికి ఏర్పాట్లున్నాయని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు.

Last Updated :Jul 17, 2020, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.