ETV Bharat / city

'బిల్లు కట్టలేదు కరెంట్​ కట్​ చేస్తా'మని ఫోన్​ వచ్చిందా? తస్మాత్​ జాగ్రత్త!!

author img

By

Published : Jul 19, 2022, 7:36 PM IST

Be careful with Power bills fraud doing Cyber criminals in telangana
Be careful with Power bills fraud doing Cyber criminals in telangana

Power bills fraud: "మీరు విద్యుత్​ బిల్లు ఇంకా కట్టలేదు. ఇప్పుడు కట్టకపోతే.. కనెక్షన్​ కట్​ అయిపోతుంది. ఈ రాత్రి మీ ఇంట్లో కరెంటు ఉండాలంటే వెంటనే బిల్లు కట్టేయండి. అందుకు మీరు ఆఫీస్​కు రావాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్​ వివరాలు ఇవ్వండి.. లేకపోతే మేము ఓ లింకు పంపిస్తాం అందులో కట్టేయండి.. వెంటనే అప్​డేట్​ చేస్తాం." అంటూ.. సైబర్​ నేరగాళ్లు కరెంట్​ రాగం అందుకున్నారు. "వినియోగదారులారా తస్మాత్​ జాగ్రత్త" అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Power bills fraud: విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరుతో కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్​లు, ఫోన్​ల ద్వారా సంప్రదించి మోసం చేస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అవి వెంటనే కట్టకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని వినియోగదారులను బెదిరించి వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకుని అందికాడికి దండుకుంటున్నారు. వేర్వేరు పోలీస్​స్టేష‌న్ల ప‌రిధిలో క‌రెంట్ బిల్లుల మోసాల‌పై 29 వ‌ర‌కు ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11 ల‌క్ష‌ల వ‌ర‌కు సొమ్మును సైబర్​ నేరగాళ్లు దండుకున్నారు. ఇటువంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నట్టు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ దృష్టికి వచ్చింది.

కరెంటు బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్​ మోసాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి సూచించారు. బిల్లుల చెల్లింపుల కోసం సంస్థ వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలను విద్యుత్​ సిబ్బంది అడగరని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థ బిల్లుల చెల్లింపు కోసం ఎటువంటి వెబ్​సైట్ లింకులు మెసేజ్ ద్వారా పంపదని కూడా వివరించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల పేరుతో ఎవరైనా బ్యాంకు అకౌంట్ వివరాలు గానీ.. లింకులు గానీ మెసేజ్​ల ద్వారా పంపిస్తే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని రఘుమా రెడ్డి పేర్కొన్నారు.

"విద్యుత్తు బిల్లులు బ‌కాయిలు ఉన్నాయంటే రాత్రి వేళ‌ల్లో ఫోన్లు చేస్తూ.. వెంట‌నే క‌ట్ట‌క‌పోతే క‌నెన్ష‌న్ క‌ట్ చేస్తామ‌ని వ‌స్తున్న మోస‌పూరిత ఫోన్‌కాల్స్‌ను న‌మ్మ‌ొద్దు. వినియోగదారులు చెల్లించాల్సిన బిల్లు లేదా బకాయిల వివరాలు సంస్థ నెలనెలా జారీచేసే బిల్లులో క్లుప్తంగా పేర్కొంటుంది. వినియోగదారులు బిల్లు చెల్లించిన తర్వాత కూడా.. ఒక వేళ ఎవరైనా వ్యక్తులు ఫోన్ గానీ.. మెసేజ్ ద్వారా గానీ బకాయి ఉందని చెప్తే.. నమ్మి మోసపోవద్దు. తాము చెల్లించిన వివరాలను సంస్థ వెబ్​సైట్ www.tssouthernpower.com లేదా ఎస్పీడీసీఎల్(TSSPDCL) మొబైల్ ఆప్​లో సరి చూసుకోవాలి. ఒక వేళ ఏమైనా తేడాలు ఉంటే సంస్థకు ఆన్​లైన్ ద్వారా గానీ.. సంబంధిత సెక్షన్ ఆఫీసర్​(AE)ని గాని సంప్రదించాలి. రాత్రిపూట పూట విద్యుత్ సరఫరా నిలిపివేయడమన్నది సంస్థ చేయదు. ఇలాంటి మోసాలపై.. ఎవరూ ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలి." - జి. రఘుమారెడ్డి, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.