ETV Bharat / city

ఏపీలో ఇంటర్​ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

author img

By

Published : Jun 12, 2020, 5:37 PM IST

ap INTER RESULTS RELEASE
ఏపీలో ఇంటర్​ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

ఏపీ ఇంటర్​ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ​ విడుదల చేశారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది.

ఏపీ ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది.

చారిత్రాత్మకం

దేశంలో అందరికన్నా ముందుగా ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశామని.. ఏపీ చరిత్రలో ఇదొక చరిత్రాత్మకమైన రోజుగా మంత్రి సురేశ్‌ అభివర్ణించారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మార్గదర్శకాల మేరకు సమష్టిగా కృషి చేసి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల అన్నీ ఆలస్యం అవుతున్నా.. అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని ఫలితాలను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. bie.ap.gov.in, www.eenadu.net, www.eenaduprathiba.net లో ఫలితాలు చూడవచ్చు. విద్యార్థుల ఫొటోలు, మార్కులు, గ్రేడులు ప్రదర్శించకూడదని మంత్రి సురేశ్​​ స్పష్టం చేశారు.

బాలికలదే హవా

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను 5.07 లక్షల మంది విద్యార్థులు రాయగా.. 59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. ఇంటర్‌ ఫలితాల్లో బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

తొలిస్థానంలో కృష్ణా..

ఇంటర్ ఫలితాల్లో మొదటి స్థానాన్ని కృష్ణా జిల్లా కైవసం చేసుకుంది. తొలి ఏడాదిలో 65 శాతంతో పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు రెండో స్థానంలో ఉండగా.. విశాఖ మూడో స్థానంలో ఉంది. రెండో ఏడాదిలో పశ్చిమగోదావరి జిల్లా రెండో స్థానంలో ఉండగా.. నెల్లూరు, విశాఖ జిల్లాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఇంటర్‌ తొలిఏడాది ఫలితాల్లో చివరిస్థానంలో కడప, అనంతపురం జిల్లాలు ఉండగా.. రెండో ఏడాది ఫలితాల్లో చివరి స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది. మార్కుల మెమోలు వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి చెప్పారు.

ఇవీచూడండి: 'ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఇంటర్​ ఫలితాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.