ETV Bharat / business

ఈడీ ముందుకు అనిల్​ అంబానీ భార్య టీనా అంబానీ

author img

By

Published : Jul 4, 2023, 1:50 PM IST

anil-ambani-ed-case-anil-wife-tina-appears-before-ed-in-fema-case
టీనా అంబానీ ఫెమా కేసు

Tina ambani Fema Case : అనిల్‌ అంబానీ సతీమణి టీనా అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఫెమా చట్టం ఉల్లంఘనల కేసులో అధికారులు ఆమెను ముంబయిలో విచారించారు.

Tina Ambani Ed Case : వ్యాపారవేత్త, రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ భార్య టీనా అంబానీ ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ ఎదుట హాజరయ్యారు. విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా FEMA) ఉల్లంఘనల కేసులో మంగళవారం ఈడీ అధికారులు ఆమెను విచారించారు. మంగళవారం దక్షిణ ముంబయిలోని ఈడీ కార్యాలయంలో టీనాను ప్రశ్నించారు అధికారులు.

ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారంటూ.. వివిధ సెక్షన్ల కింద టీనా అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. అనిల్‌ అంబానీని సోమవారం ఈ కేసులో విచారించారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించి.. ఆ సమాధానాలన్నింటినీ రికార్డు చేసినట్లు తెలిపారు. ఈ వారంలోనే మరోసారి అనిల్‌ అంబానీని ప్రశ్నించేందుకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

కొన్ని వెల్లడించని ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని, అక్రమంగా నిధులు మళ్లింపు చేశారనే ఆరోపణలతో అనిల్​, టీనా అంబానీని ఈడీ విచారిస్తోంది. రెండు స్విస్‌ బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న 814 కోట్ల రూపాయలను వెల్లడించకుండా.. 420 కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలు వీరిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నల్లధన నియంత్రణ చట్టం కింద 2022 ఆగస్టులో అనిల్‌ అంబానీకి నోటీసులు జారీ చేశారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. అనంతరం ఆ నోటీసులు, జరిమానాపై సెప్టెంబరులో.. బాంబే హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది.

మనీలాండరింగ్ కేసులో..
Anil Ambani Yes Bank : 2020లో ఎస్​ ​బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్​కు సంబంధించి మనీలాండరింగ్​ కేసులో వ్యాపారవేత్త అనిల్​ అంబానీని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. బల్లార్డ్​ ఎస్టేట్‌లోని ఈడీ కార్యాలయంలో అంబానీని ఈడీ అధికారులు ప్రశ్నించి.. స్టేట్​మెంట్​ను రికార్డు చేసుకున్నారు. మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్​ఏ) కింద అంబానీ వద్ద వాంగ్మూలం తీసుకున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు.

ఎస్​ బ్యాంకు నుంచి రిలయన్స్ గ్రూపు సంస్థలు సుమారు రూ.12,800 కోట్ల రుణాలను పొందాయి. సకాలంలో చెల్లించని కారణంగా అవి నిరర్ధక ఆస్తుల జాబితాలోకి చేరాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారించారు. అప్పట్లో రాణా కపూర్‌కు చెందిన రూ.127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీజ్​ చేసింది. లండన్‌లోని 77 సౌత్‌ ఆడ్లీ స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌ 1ను మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు ఆ సమయంలో వెల్లడించింది. 2017లో డూయిట్‌ క్రియేషన్స్‌ జర్సీ లిమిటెడ్‌ పేరిట రూ.93 కోట్లకు రాణా కపూర్‌కు ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.