ETV Bharat / business

అంబానీ చెఫ్​ల జీతం ఎంతో తెలుసా?.. ఇష్టంగా తినే వంటకాలు అవేనట!

author img

By

Published : Apr 2, 2023, 6:33 PM IST

mukesh ambani chef salary
mukesh ambani chef salary

సెలబ్రిటీలు ఏం తింటారు? వారి ఇంట్లో పనిచేసే వారికి ఎంత జీతాలిస్తారు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ ఇంట్లో ఏం తింటారు? ఆయన ఇంట్లో పనిచేసే చెఫ్​లకు జీతం ఎంత అనే విషయాలు బయటకు వచ్చాయి. వారి వేతనం మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్​వేర్ ఉద్యోగులు, సీఏ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉంటుందట. మరి అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్​ల జీతమెంతో తెలుసా?

రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ దేశంలోనే కాదు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి సుమారు రూ.7 లక్షల కోట్లపైనే ఉంటుంది. ప్రస్తుతం ముకేశ్​ అంబానీ కుటుంబం ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో నిర్మించిన 'యాంటిలియా'లో నివాసముంటోంది. 27 అంతస్తుల ఈ భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల కోసం పార్కింగ్‌, 50 మంది కూర్చుని చూసే సినిమా థియేటర్‌, 9 ఎలివేటర్లు ఇతర అధునాతన సదుపాయాలున్నాయి. అయితే అంబానీ ఇంట్లో పనిచేసే వంటమనిషి (చెఫ్​) సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చర్చనీయాంశమవుతోంది. అంబానీల ఇంట్లో పనిచేసే చెఫ్​ల జీతం ఎంత? అనే చర్చ సాగుతోంది.

టాప్​ మల్టీనేషనల్​ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్​వేర్ ఉద్యోగుల కన్నా, సీఏ, ఎంబీఏ చదివి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల కన్నా అంబానీ ఇంట్లో పనిచేసే వంట మనుషులకే జీతం ఎక్కువని టాక్​. ఓ నివేదిక ప్రకారం అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్​లకు ఒక్కొక్కరికి నెలకు రూ.2 లక్షల జీతం అని తెలుస్తోంది. అంటే వారికి ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజ్ అన్నమాట. అయితే వ్యాపారవేత్త ముఖేశ్​ అంబానీ ఎక్కువగా శాఖాహారాన్ని ఇష్టపడతారట. ఆయన ఎక్కువగా పప్పు, అన్నం, చపాతీలు తింటారట. ఉదయం అల్పాహారంలో ఒక గ్లాసు బొప్పాయి జ్యూస్, ఇడ్లీ-సాంబార్ కాంబినేషన్​ ఇష్టపడతారట. దాదాపుగా 600 మంది సిబ్బంది ముకేశ్ అంబానీ ఇంట్లో పనిచేస్తున్నారని తెలుస్తోంది.

ముకేశ్ అంబానీ నివాసం ఉంటున్న యాంటిలియా భవనం.. లండన్​లో ఉన్న బకింగ్​హామ్​ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదని ఇండియా టైమ్స్ నివేదికలో తెలిపింది. ఈ భవనం దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటుందని.. ఈ భవనం విలువ దాదాపు రూ.12 వేల కోట్లని ఓ నివేదికలో పేర్కొంది. ముకేశ్​ అంబానీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా అంబానీకి ప్రైవేటు జెట్లు, విలాసవంతమైన నౌకలు ఉన్నాయి.

గతేడాది ముకేశ్ అంబానీ భద్రతను కేంద్ర హోంశాఖ పెంచింది. నిఘా సంస్థలు ఇచ్చిన అంచనా నివేదిక మేరకు ఆయన భద్రతను జడ్‌ కేటగిరీ నుంచి జడ్‌ ప్లస్‌ కేటగిరీకి పెంచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముకేశ్‌కు 55 మంది సిబ్బంది భద్రత కల్పించనున్నారు. ఇందులో 10 మందికి పైగా ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఇతర పోలీసు అధికారులు ఉంటారు.
అంతకుముందు ఒకసారి అంబానీ కార్ల డ్రైవర్ల గురించి ఓ వార్త హల్​చల్ చేసింది. అంబానీ కార్ల డ్రైవర్లకు నెలకు ఎంత జీతం ఇస్తున్నారనే విషయాన్ని ఓ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.