ETV Bharat / business

లోన్​ తీసుకున్న వ్యక్తి చనిపోతే రికవరీ ఎలా? వారసులు కట్టాల్సిందేనా?

author img

By

Published : Oct 19, 2022, 4:56 PM IST

Updated : Oct 19, 2022, 5:33 PM IST

bank debt dues
బ్యాంక్​ రుణం

ఎవరైనా రుణం తీసుకున్న తర్వాత అదే తీర్చేలోగా మరణిస్తే లోన్‌ రికవరీ సంస్థలకు కష్టతరంగా మారుతుంది. ఇది రుణ రకం, బీమా కవరేజీపై ఆధారపడి ఉంటుంది. రుణసంస్థలు వసూలుకు చట్టపరంగా ముందుకు వెళ్లక తప్పదు. అలాంటప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయో చూద్దాం..

ఎవరైనా బ్యాంకులో రుణం తీసుకున్న తరువాత అది కట్టకుండానే మరణిస్తే.. బ్యాంక్​లు, రుణసంస్థలు రుణ వసూలుకు చట్టపరంగా ముందుకు వెళ్లక తప్పదు. దానికి బ్యాంకులు కింది విధంగా చేస్తాయి.

గృహ రుణం:
రుణగ్రహీత మరణిస్తే, బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించగల సహ రుణగ్రహీత కోసం బ్యాంకు మొదట అన్వేషిస్తుంది. సహ-రుణగ్రహీత కూడా లేనప్పుడు బ్యాంకు రుణానికి ఉన్న హామీదారుని లేదా చట్టపరమైన వారసుడిని సంప్రదిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మరణించిన రుణగ్రహీత గృహ రుణ బీమా కవర్‌ తీసుకుంటే.. బీమా క్లెయిమ్‌ మొత్తం నేరుగా బ్యాంకు తీసుకుని బాకీ ఉన్న రుణాన్ని వసూలు చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందజేస్తుంది.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే ఉంటే:
గృహ రుణ బకాయిదారుడు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే తీసుకుంటే.. ఆ క్లెయిమ్‌ మొత్తం నామినీ ఖాతాలో జమ అవుతుంది. న్యాయపరమైన ప్రక్రియ తర్వాత చట్టపరమైన వారసుడికి ఈ క్లెయిమ్‌ మొత్తం అందుతుంది. అయితే, బ్యాంకు రుణ బకాయి వసూలుకు ఇక్కడ ఒక సమస్య ఉంది. టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని బ్యాంకు రుణ బకాయి కింద తీసుకోలేదు. ఈ టర్మ్‌ బీమా క్లెయిమ్‌ మొత్తాన్ని ఉపయోగించుకునే హక్కు చట్టబద్ధమైన వారసుడికి మాత్రమే ఉంటుంది. గృహ రుణ బీమా లేనప్పుడు.. సహ-రుణగ్రహీత, చట్టపరమైన వారసుడు లేదా హామీదారు నుంచి బ్యాంకు బకాయి మొత్తాన్ని తిరిగి పొందలేకపోతే.. ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని రుణ బకాయికి సర్దుబాటు చేసుకుంటుంది.

కారు రుణం:
ఈ రుణం తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు ఆ వ్యక్తి కుటుంబాన్ని సంప్రదిస్తుంది. చట్టబద్ధమైన వారసుడు ఉన్నట్లయితే.. బకాయి మొత్తాన్ని చెల్లించమని అడుగుతుంది. వారు నిరాకరిస్తే.. కారును స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంది.

వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాలు:
ఈ రుణాలకు హామీ ఉండదు. రుణ వ్యవధిలో బకాయిదారుడు మరణిస్తే.. కుటుంబ సభ్యులు, చట్టపరమైన వారసుల నుంచి బ్యాంకు ఆ మొత్తాన్ని తిరిగి పొందలేదు. రుణానికి సహ-రుణగ్రహీత ఉన్నట్లయితే బ్యాంకు వారిని కూడా సంప్రదించి వసూలు చేస్తుంది. సహ-రుణగ్రహీత లేనప్పుడు, బకాయి వసూలుకు ఏ ఇతర అవకాశాలు లేనప్పుడు.. అటువంటి రుణాన్ని నిరర్ధక ఆస్తి(NPA)గా ప్రకటిస్తుంది.

చట్టపరమైన వారసుడు ఏం చేయాలి?
రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకు చట్టపరమైన వారసుణ్ని సంప్రదించినప్పుడు.. ఆస్తి విలువ ఎక్కువ ఉండి, రుణ మొత్తం తక్కువ ఉన్నట్లయితే.. బకాయి తీర్చేయడమే మంచిది. లేకుంటే వారసులు ఆస్తిని బ్యాంకుకు అప్పగించొచ్చు.

రుణ బీమా ఉంటే:
తగినంత రుణ బీమా ఉంటే.. అటు బ్యాంకుకు, ఇటు రుణగ్రహీతకు మంచిదే. బ్యాంకు బీమా కంపెనీ నుంచి బకాయి ఉన్న రుణాన్ని వసూలు చేస్తుంది. కాబట్టి, చట్టపరమైన వారసుడు ఆస్తిపై పూర్తి హక్కును పొందొచ్చు.

Last Updated :Oct 19, 2022, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.