ETV Bharat / business

బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్

author img

By

Published : Aug 14, 2022, 6:21 AM IST

gold-price-decider
gold-price-decider

Who decides gold rates అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను నిర్ణయించే శక్తిగా భారత్ ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గుజరాత్​లోని గిఫ్ట్ సిటీలో ఇటీవల ప్రారంభించిన ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజీ ద్వారా ఇది సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

gold rates decided by which country ప్రపంచంలో లోహం రూపంలో బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా తర్వాత స్థానం మనదే. దేశీయంగా గనులు లేనందున, ఏటా దాదాపు 800-1,000 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అయినా బంగారం ధర నిర్ణయించే పరిస్థితుల్లో మనదేశం లేదు. లండన్‌లోని బులియన్‌ ఎక్స్ఛేంజీ ధరలనే అనుసరించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో ఇటీవల ప్రారంభించిన ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజీ (ఐఐబీఎక్స్‌) వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను నిర్ణయించే శక్తిగా మనదేశం ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలోని షాంఘై గోల్డ్‌ ఎక్స్ఛేంజీ, టర్కీలోని బొర్సా ఇస్తంబుల్‌, లండన్‌లోని ఎల్‌బీఎంఏ కోవలోకి ఈ ఎక్స్ఛేంజీ వస్తుంది.

ప్రస్తుతం బంగారం చేరుతోంది ఇలా
రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతించిన బ్యాంకులు, కొన్ని ఇతర సంస్థలు బిస్కెట్లు, కడ్డీల రూపంలో మేలిమి (999 స్వచ్ఛత-24 క్యారెట్ల) బంగారాన్ని దిగుమతి చేసుకుని, బులియన్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నాయి. వీరి నుంచి పసిడి ఆభరణాల తయారీ/విక్రయదార్లు కొనుగోలు చేస్తారు. తదుపరి వినియోగదార్లకు చేరుతుంది. ఈ క్రమంలో అధిక ఛార్జీలు, రవాణా ఖర్చులు పడుతున్నాయి. అంతిమంగా ఈ భారాన్ని మోసేది వినియోగదార్లే. ఇక బంగారం క్రయవిక్రయాల్లో పారదర్శకత లేకపోవడం సరేసరి. కస్టమ్స్‌ క్లియరెన్సులకు అధిక సమయమూ పడుతోంది. ఈనెల 2 నుంచి బంగారం క్రయవిక్రయాలు జరుగుతున్న ఐఐబీఎక్స్‌ వల్ల కస్టమ్స్‌ ఆటంకాలు తగ్గడంతో పాటు, వ్యాపారులకూ వ్యయాలు తగ్గుతాయని చెబుతున్నారు.

అంతా ఎక్స్ఛేంజీ ద్వారానే
మనదేశం దిగుమతి చేసుకునే బంగారం మొత్తాన్ని ఈ ఎక్స్ఛేంజీ ద్వారానే పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ.25 కోట్ల నికర విలువ గల జువెలరీ వర్తకులు, 5 లక్షల డాలర్ల నికర విలువ గల ప్రవాస భారతీయులు ఈ ఎక్స్ఛేంజీలో ఖాతా తెరిచి బంగారం కొనుగోళ్లు చేయవచ్చు. కొనుగోలు చేసిన బంగారాన్ని తప్పనిసరిగా డెలివరీ తీసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు క్రయవిక్రయాలు జరుగుతాయి.

అదే రోజు సాయంత్రం 6 - 8 గంటల మధ్య 'డెలివరీ'లు ఉంటాయి. గిఫ్ట్‌ సిటీ లోనే వాల్ట్‌ (బంగారాన్ని నిల్వ చేసే) సేవల సంస్థలు ఏర్పాటయ్యాయి. బంగారాన్ని దిగుమతి చేసుకునే సంస్థలు, వాల్ట్‌లలో బంగారాన్ని నిల్వ చేసి, ఆమేరకు 'గోల్డ్‌ రిసీట్‌'ను ఎక్స్ఛేంజీ ద్వారా విక్రయిస్తాయి. కొనుగోలు చేసిన వారికి అక్కడికక్కడే బంగారాన్ని డెలివరీ ఇస్తాయి. ఇదంతా పారదర్శకంగా జరిగిపోతుంది. కాబట్టి ప్రైస్‌ డిస్కవరీ (సరైన ధర నిర్ణయం)కి అవకాశం ఉంటుంది. గిఫ్ట్‌ సిటీలో వర్తకులపై ఎటువంటి స్థానిక పన్నుల భారం ఉండదు. అహ్మదాబాద్‌లో కస్టమ్స్‌ క్లియరెన్స్‌ లభించాక, 4 గంటల వ్యవధిలోనే బంగారాన్ని కొనుగోలుదార్లకు అందజేయొచ్చు. దేశంలోని ఇతర నగరాల్లోని కొనుగోలుదార్లకు 24 గంటల వ్యవధిలో డెలివరీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇప్పుడెలా జరుగుతోంది ?

ప్రస్తుతం బులియన్‌ వ్యాపారులు నెల రోజుల ముందే బ్యాంకులో బంగారాన్ని 'బుక్‌' చేసుకోవాలి. దేశీయ బ్యాంకులు లండన్‌లోని కోమెక్స్‌, లేదా న్యూయార్క్‌లో ఉన్న బంగారం ధరలను డాలర్‌ మారకపు విలువ ప్రకారం లెక్కించి, ఇక్కడి వర్తకుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నాయి. డెలివరీ వచ్చే సమయానికి గిరాకీ తగ్గినా, బుక్‌ చేసిన మొత్తాన్ని తీసుకోవలసిందే. బంగారం క్రయవిక్రయాలు ఒక చోట కాకుండా ఎక్కడెక్కడో జరుగుతూ ఉండటం, మధ్యవర్తుల ప్రమేయం అధికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా బంగారానికి ఒకే ధర ఉండటం లేదు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండదు. తాము ఎంత ధరకు బంగారాన్ని కొనుగోలు చేయదలిచారనేది నిర్ణయించుకుని, అదే ధరను బంగారం కొనుగోలుదార్లు ఐఐబీఎక్స్‌లో ‘కోట్‌’ చేయొచ్చు. తద్వారా ఇక్కడి గిరాకీకి అనుగుణంగా బంగారం ధరను మనదేశమూ ప్రభావితం చేసే వీలు కలుగుతుంది.

7 లక్షల కోట్ల డాలర్ల ఆభరణాల పరిశ్రమ

దేశీయంగా ఆభరణాల పరిశ్రమ ఏటా 7 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నమోదు చేస్తోంది. ఇందులో 80- 90 శాతం మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులే. ఐఐబీఎక్స్‌ వల్ల ఏటా బంగారం రవాణా ఛార్జీలు, ఇతర ఖర్చుల రూపంలో రూ.700- 800 కోట్ల వరకు మిగులుతుందని అంచనా వేస్తున్నారు. ఐఐబీఎక్స్‌లో ఇప్పటికే దాదాపు 70- 75 మంది బంగారం వర్తకులు ఖాతాలు తెరిచారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ నెల 2న ఎక్స్ఛేంజీలో 20 లాట్ల (1 లాట్‌= 1 కిలో) బంగారం విక్రయాలు నమోదయ్యాయి. ఈ నెల 10న 4 లాట్లు, ఈ నెల 12న 2 లాట్ల అమ్మకాలు జరిగాయి. సమీప భవిష్యత్తులో క్రయవిక్రయాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. మున్ముందు దక్షిణాసియా దేశాలు, మరికొన్ని ఇతర దేశాలు ఈ ఎక్స్ఛేంజీ ధరలను అనుసరించే అవకాశాలు లేకపోలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.