ETV Bharat / business

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

author img

By

Published : Oct 23, 2022, 1:40 PM IST

credit card limit
క్రెడిట్ కార్డు

క్రెడిట్ కార్డు.. ప్రస్తుతం కాలంలో లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేటప్పుడు రాయితీలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు ఉపయోగించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

విపణిలో ఎక్కడ చూసినా.. రాయితీలు, ఆకర్షణీయమైన ఆఫర్లే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసినప్పుడు అదనంగా 5-10 శాతం వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈ నేపథ్యంలో కార్డుతో లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేమిటో చూద్దామా...

మీ కార్డు గురించి తెలుసుకోండి: మీ కార్డు పరిమితి ఎంత ఉంది? ఇప్పటికే ఎంత వాడారు? బిల్లు బాకీ ఎంత ఉంది? ఇలాంటి వివరాలు ముందుగా చూసుకోండి. రివార్డు పాయింట్లు ఎన్ని ఉన్నాయి, కార్డు బిల్లింగ్‌ తేదీలేమిటి అన్నది చూశాకే కొత్త కొనుగోలుకు సిద్ధమవ్వండి. ఇలా పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడే ఏ కార్డును, ఎంత మేరకు ఉపయోగించాలనే స్పష్టత వస్తుంది.

ప్రారంభంలోనే: సాధారణంగా కార్డుతో ఏదైనా కొన్నప్పుడు 30-40 రోజుల వ్యవధి లభిస్తుంది. కార్డు బిల్లింగ్‌ ప్రారంభంలో వాడినప్పుడే ఈ ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు మీ బిల్లింగ్‌ తేదీ 8 నుంచి ప్రారంభం అవుతుందనుకుందాం. అప్పుడు 9 -15 తేదీల మధ్య కొనడం వల్ల తగినంత వ్యవధి దొరుకుతుంది.

రాయితీలు వదులుకోవద్దు: కొన్ని బ్రాండ్లు క్రెడిట్‌ కార్డు సంస్థలతో ఒప్పందం చేసుకొని, సాధారణ డిస్కౌంట్లకు మించి, ప్రత్యేక తగింపులను అందిస్తాయి. పండగల వేళ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రెండు మూడు కార్డులు ఉన్నవారు.. ఏ కార్డుతో ఎక్కువ తగ్గింపు లభిస్తుందో చూసుకోవాలి. దీనివల్ల మీకు డబ్బు ఆదా అవుతుంది.

రివార్డు పాయింట్లతో: క్రెడిట్‌ కార్డులు అందించే రివార్డు పాయింట్లను గమనిస్తూ ఉండాలి. ఈ సమయంలో ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఈ రివార్డు పాయింట్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటే వదులుకోవద్దు. ఈ పాయింట్ల ద్వారా నగదు వెనక్కి వస్తుందా? చూసుకోండి. మీకు అర్థం కాకపోతే, కార్డు వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించి, వివరాలు తెలుసుకోండి. కొనుగోళ్లపై అధిక రివార్డు పాయింట్లు ఇస్తున్న కార్డునే ఎక్కువగా వినియోగించండి.

ఈఎంఐల విషయంలో: చాలా క్రెడిట్‌ కార్డులు నో-కాస్ట్‌ ఈఎంఐలను అందిస్తున్నాయి. మీ దగ్గర సరిపోయేంత మొత్తం లేకపోతే దీన్ని ఆశ్రయించవచ్చు. వడ్డీ లేకుండా లభించే ఈ వెసులుబాటు కోసం కొన్నిసార్లు రాయితీలు వదులుకోవాల్సి వస్తుంది. కొన్ని కార్డులు రాయితీతోపాటు, ఉచిత ఈఎంఐని అందించవచ్చు. పూర్తిగా అర్థం చేసుకున్నాకే కొనుగోలు నిర్ణయం తీసుకోండి.
ఎట్టిపరిస్థితుల్లోనూ మీ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వినియోగించకుండా చూసుకోండి. బిల్లులు వ్యవధిలోపే చెల్లించండి. బాకీపడితే క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. పండగల వేళ క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా వినియోగిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి.

ఇవీ చదవండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. లాభాల చిచ్చుబుడ్లు ఇవే!

పండగ వేళ.. సిరులు నిండుగా.. దీపావళి ఆర్థిక పాఠాలు నేర్చుకుందామా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.