ETV Bharat / business

ట్విట్టర్​లో మస్క్ మార్పులు.. భారతీయుడికి కీలక బాధ్యతలు.. ఆయన సలహాలతోనే..

author img

By

Published : Nov 1, 2022, 3:43 PM IST

ఎలాన్ మస్క్ అధీనంలోని ట్విట్టర్​లో అనేక మార్పులు రాబోతున్నాయి. ట్విట్టర్​లో మార్పులు చేపట్టేందుకు మస్క్​కు ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. మస్క్​కు సలహాలిచ్చేవారి జాబితాలో ప్రముఖ టెక్ నిపుణుడు ఉన్నారు. ఆయన ఎవరో చూద్దామా?

Twitter Elon Musk
Twitter Elon Musk

సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మార్పులకు శ్రీకారం చుట్టారు. భారత సంతతికి చెందిన సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ సహా లీగల్‌ హెడ్‌ విజయ గద్దె, మరికొందరు ప్రముఖుల తొలగింపుతో ఆయన తన కార్యాచరణను మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది కీలక వ్యక్తులు ట్విటర్‌లో మార్పులపై మస్క్‌కు సాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలోనూ భారత సంతతికి చెందిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

సిలికాన్‌ వ్యాలీలో ప్రముఖ టెక్‌ నిపుణుడిగా పేరొందిన శ్రీరామ్‌ కృష్ణన్‌ మస్క్‌కు సలహాలిస్తున్న వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని శ్రీరామ్ స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. "మరికొంత మంది గొప్ప వ్యక్తులతో కలిసి ట్విటర్‌లో ఎలాన్‌ మస్క్‌కు తాత్కాలికంగా సాయం చేస్తున్నాను. ఇది ఒక ముఖ్యమైన సంస్థగా నేను భావిస్తున్నాను. ప్రపంచంపై చాలా ప్రభావం చూపుతుందని విశ్వసిస్తున్నాను. ఎలాన్‌ మస్కే దీనికి సరైన వ్యక్తి" అని కృష్ణన్‌ అన్నారు.

చెన్నై కుర్రాడే..
కృష్ణన్‌ ఆయన సతీమణి ఆర్తీ రామమూర్తి చెన్నైలోనే పుట్టి పెరిగారు. గత ఏడాది జులైలో న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. వీరిది ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం. వీరివురు 2003లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్‌ కాలేజీలో కలిశారు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. 2010లో వీరు అమెరికాకు వెళ్లారు.

టెక్‌ దిగ్గజాలతో..
ప్రస్తుతం కృష్ణన్‌ సిలికాన్‌ వ్యాలీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ఆండ్రిసెన్ హోరోవిట్జ్‌ (a16z)లో భాగస్వామిగా ఉన్నారు. ప్రాథమిక దశలో ఉన్న అంకుర సంస్థల్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అదే సమయంలో బిట్‌స్కీ, హోపిన్‌, పాలీవర్క్‌ కంపెనీ బోర్డుల్లో కృష్ణన్‌ సభ్యుడిగానూ ఉన్నారు. ఏ16జెడ్‌లో చేరడానికి ముందు ఆయన పలు టెక్ కంపెనీల్లో కీలక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఇటీవలి వరకు ట్విటర్‌లో హోం టైమ్‌లైన్‌, న్యూ యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌, సెర్చ్‌, డిస్కవరీ, ఆడియెన్స్‌ గ్రోత్‌ వంటి ప్రొడక్ట్‌లకు సంబంధించిన బృందాలకు నేతృత్వం వహించారు. అంతకుముందు స్నాప్‌, ఫేస్‌బుక్‌కు సంబంధించిన పలు మొబైల్‌ యాడ్‌ ప్రొడక్ట్స్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

మైక్రోసాఫ్ట్‌తో కృష్ణన్‌ తన టెక్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. విండోస్‌ అజూర్‌కు సంబంధించిన పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. 'ప్రోగ్రామింగ్‌ విండోస్‌ అజూర్‌' అనే పుస్తకాన్ని రాశారు. ప్రముఖ ఆడియో యాప్‌ క్లబ్‌హౌస్‌లో సతీమణి ఆర్తీ రామమూర్తితో కలిసి 'ది గుడ్‌ టైమ్స్‌ షో' అనే షోను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాన్‌ మస్క్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌, స్టీవ్‌ బామర్‌ వంటి ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశారు.

ట్విట్టర్ బ్యాడ్జ్ సబ్​స్క్రిప్షన్​పై బేరాలు!
ట్విట్టర్​లో వెరిఫైడ్ ఖాతాలకు ఇచ్చే బ్లూ బ్యాడ్జ్ కోసం వినియోగదారులు డబ్బులు చెల్లించాలన్న వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. నెలకు 20 డాలర్లు చెల్లించాలన్న కథనాలపై ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్​కు రిప్లై ఇచ్చారు మస్క్. ఎలాగోలా సంస్థ ఖర్చులు తీర్చాలి కాబట్టి.. ఆదాయం అవసరమని మస్క్ పేర్కొన్నారు. అయితే, ఇందుకోసం పూర్తిగా యాడ్స్​పై ఆధారపడటం కుదరదని అన్నారు. బాట్స్, ట్రోల్ ఖాతాలను నిరోధించాలంటే సబ్​స్క్రిప్షన్ అమలు చేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా.. సబ్​స్క్రిప్షన్ 8 డాలర్లు అయితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ట్విట్టర్ బ్లూ టిక్ కోసం యూజర్స్ నుంచి నెలకు 5 డాలర్ల నుంచి గరిష్ఠంగా 20 డాలర్ల వరకు వసూలు చేసేందుకు సంస్థ సిద్ధమవుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. 20 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపుగా 1650 రూపాయలు. ఒకవేళ సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోతే 90 రోజుల తర్వాత ఖాతాకు బ్లూ టిక్ తొలగిపోతుంది. ఈ కొత్త రూల్‌ను నవంబర్ 7 నాటికి అమలులోకి తీసుకువచ్చే దిశగా మస్క్​ యోచిస్తున్నట్లు సమాచారం.

భారత్​లోని ఖాతాలపై నిషేధం
మరోవైపు, దేశంలోని 50 వేలకు పైగా ఖాతాలపై నిషేధం విధించింది ట్విట్టర్. లైంగిక సంబంధిత కంటెంట్​ను పోస్ట్ చేస్తున్న 52,141 ఖాతాలు సహా.. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న 1982 ఖాతాలను నిషేధించింది. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా నెలవారీ నివేదిక సమర్పించిన ట్విట్టర్.. ఖాతాదారుల నుంచి 157 ఫిర్యాదులు అందాయని, వాటిపై పరిశీలన చేపట్టి 129 'యూఆర్ఎల్​'లపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ట్విట్టర్ ఖాతాలపై సస్పెన్షన్ విధించాలని తమకు అందిన 43 ఫిర్యాదులను పరిష్కరించినట్లు స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.