ETV Bharat / business

'ఆ దేశాల దారిలో వెళితే మనుగడ సాధించలేం.. భిన్నమైన వ్యూహం అవసరం'

author img

By

Published : Dec 23, 2022, 7:36 AM IST

ఔషధ రంగంలో ప్రపంచ దేశాలు అవలంభిస్తున్న ధోరణిలో పోతే పోటీలో ఉండలేమన్నారు ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్. మనదేశం నుంచి ఔషధ ఎగుమతులను స్థిరంగా పెంచుకోవాలంటే భిన్నమైన వ్యూహం అవసరమని ఇంటర్వ్యూలో తెలిపారు.

udayabhaskar
ఆర్‌.ఉదయ భాస్కర్‌

'ఎంతో కాలంగా వినియోగంలో ఉన్న మందులను వియత్నాం, బంగ్లాదేశ్‌, ఇండోనేషియా వంటి దేశాలూ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ మందులనే మనం కూడా ఉత్పత్తి చేస్తూ పోతే, అంతర్జాతీయ విపణిలో మనుగడ సాధించలేం. సంక్లిష్ట జనరిక్‌ మందులు, బయోలాజికల్‌ ఔషధాలు, టీకాలు, ఇంజెక్టబుల్స్‌ ఉత్పత్తి చేసి అందిస్తేనే పురోగతి ఉంటుంద'ని ఫార్మాగ్జిల్‌ (ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ అభిప్రాయపడ్డారు. మనదేశం నుంచి ఔషధ ఎగుమతులను స్థిరంగా పెంచుకోవాలంటే భిన్నమైన వ్యూహం అవసరమని ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యాంశాలివీ..

2022- 23లో ఔషధ ఎగుమతులు ఎలా ఉన్నాయి
క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే దాదాపు 10 శాతం వృద్ధి నమోదు కావచ్చు. 2021-22లో 24.62 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు సాధించాం. ఈసారి 27 బి.డా.మేర ఎగుమతి చేయగలుగుతామని అంచనా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలకు మనం మందులు అందిస్తున్నాం. కానీ ఎంతో కాలం నాటి సాధారణ మందులతో అంతర్జాతీయ మార్కెట్లో భవిష్యత్తులో నెగ్గుకు రాలేం. వాటిని చిన్న చిన్న దేశాలు కూడా ఉత్పత్తి చేసి, ఎంతో తక్కువ ధరకు అందిస్తున్నాయి. అంటే పోటీ పెరుగుతోంది. అందువల్ల మన దేశం భిన్నమైన వ్యూహాలను అనుసరించాలి.

ఎక్కడి నుంచి పోటీ వస్తోంది
మందుల తయారీ వ్యయాలే కీలకం. బంగ్లాదేశ్‌, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు మనకంటే తక్కువ ఖర్చులో ఎన్నో రకాల మందులు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ దేశాలతో మనం పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇటీవల చైనా కూడా తక్కువ విలువ గల సాధారణ మందుల ఉత్పత్తిని నిలిపివే, అధిక ధర లభించే సంక్లిష్ట ఔషధాలపై దృష్టి సారిస్తోంది. సాధారణ మందుల ఉత్పత్తిని వియత్నాం, బంగ్లాదేశ్‌లకు ‘అవుట్‌సోర్స్‌’ చేస్తోంది. అంతర్జాతీయ ఔషధ విపణిలో మనదేశం క్రియాశీలక పాత్ర పోషించాలంటే, మనం కొత్త ఔషధాల వైపు మొగ్గుచూపాల్సిందే.

మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి
టీకాలు ఉత్పత్తి చేయడంలో మనదేశానికి ఎంతో నైపుణ్యం ఉంది. కొవిడ్‌-19 టీకాల్లో ఈ విషయం రుజువైంది. అదే విధంగా సంక్లిష్ట జనరిక్‌ ఔషధాలు ఉత్పత్తి చేయగలం. బయోలాజికల్స్‌లో ఎన్నో కొత్త అవకాశాలున్నాయి. ఇటీవల పలు దేశాలు బయోలాజికల్‌ ఔషధాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నూతన ఔషధాలు ఆవిష్కరించాలి. ఇతర దేశాలు సులువుగా ఉత్పత్తి చేయలేని, ఎంతో శాస్త్ర- సాంకేతిక నైపుణ్యం అవసరమైన మందులపై దృష్టి సారించాలి. తద్వారా మనదేశం నుంచి ఔషధాలు కొనుగోలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని కల్పించాలి. అప్పుడే స్థిరంగా ఎగుమతులను పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇటువంటి మందుల ధర కూడా అధికం. తద్వారా మన ఎగుమతుల విలువా పెరుగుతుంది. ఇందుకోసం పరిశోధన- అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ముడిపదార్థాల కోసం చైనానే ఆధారమా ఎన్నో రకాల ఇంటర్మీడియెట్స్‌, కేఎస్‌ఎం (కీ స్టార్టింగ్‌ మెటీరియల్స్‌) కోసం మనకు చైనానే ఆధారం. మన ఫార్మా కంపెనీలు దిగుమతి చేసుకునే బల్క్‌ డ్రగ్స్‌, ఇంటర్మీడియెట్స్‌లో చైనా వాటా 65% ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎల్‌ఐ పథకంతో ఈ పరిస్థితి కొంత మారొచ్చు.

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం కనిపిస్తోందా
పెద్దగా లేదు. కాకపోతే రష్యాతో పాటు సీఐఎస్‌ (కామన్‌వెల్త్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ స్టేట్స్‌) దేశాలకు ఎగుమతులు స్వల్పంగా తగ్గొచ్చు. దీనికి తగిన పరిష్కారాలను అన్వేషించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. రూపాయి- రూబుల్‌ వర్తకం ఖరారయితే మళ్లీ ఎగుమతులు పెరుగుతాయి.

చైనా ఏపీఐలకు 25% వరకు అధిక చెల్లింపులు
యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐలు), ఇంటర్‌మీడియెట్‌లు, బల్క్‌ డ్రగ్స్‌ను మన కంపెనీలు చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. చైనాలో కొవిడ్‌-19 విజృంభణతో వీటి సరఫరాలపై ప్రతికూల ప్రభావం పడింది. సరఫరా అవాంతరాల నేపథ్యంలో గత కొన్ని రోజుల్లోనే కీలక ఏపీఐలు 12-25% ప్రియమయ్యాయి. దీర్ఘకాలం ఇదే పరిస్థితి ఉంటే కంపెనీల మార్జిన్‌లు తగ్గడంతో పాటు ఔషధ ధరలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఔషధాలకు కృత్రిమ కొరతా ఎదురవ్వొచ్చు. అజిత్రోమైసిన్‌, పారాసెటమాల్‌, నోటితో, ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే యాంటీబయాటిక్స్‌ ధరలు ఇటీవలే పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.