ETV Bharat / business

5జీ స్పెక్ట్రమ్​ వేలం.. తొలిరోజే సూపర్ రెస్పాన్స్.. టెల్కోలతో పాటు అదానీ కూడా!

author img

By

Published : Jul 26, 2022, 9:46 PM IST

Updated : Jul 27, 2022, 4:07 AM IST

5g spectrum auction
5g spectrum auction

5g spectrum auction: 5జీ స్పెక్ట్రమ్​ కేటాయింపులు ఆగస్టు 14లోపు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్​. ఈ ఏడాది చివరికల్లా అనేక నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు తొలిరోజు స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి వివరాలు వెల్లడించారు. మరోవైపు, బుధవారం కూడా వేలం కొనసాగనుంది.

5g spectrum auction: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. తొలి రోజున ముకేశ్‌ అంబానీ, సునీల్‌ మిత్తల్‌, గౌతమ్‌ అదానీ గ్రూప్‌లు రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేశాయి. టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలతో పాటు సొంత నెట్‌వర్క్‌ కోసం అదానీ గ్రూప్‌ సైతం ఇందులో పాల్గొంది. 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగాన్ని, అంతరాయం లేని అనుసంధానత సేవలను అందించడమే 5జీ స్పెక్ట్రమ్‌ ప్రత్యేకత. ఖరీదైన 700 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కోసమూ బిడ్లు దాఖలయ్యాయని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకర్లతో చెప్పారు. అన్ని అంచనాలను మించి, తొలి రోజు బిడ్డింగ్‌లో రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లను ప్రభుత్వం అందుకున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా 2015 రికార్డులను అధిగమించినట్లు అయ్యింది. వేలం ప్రక్రియ ముగిసే వరకు, ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ కోసం దరఖాస్తు చేసిందో వెల్లడి కావు. తొలి రోజున నాలుగు దశల్లో బిడ్డింగ్‌ జరగ్గా.. 3300 మెగాహెర్ట్జ్‌, 26 గిగా హెర్ట్జ్‌కు అధికంగా బిడ్లు వచ్చాయి. నలుగురు బిడ్డర్లూ 'బలం'గానే ఈ వేలంలో పాల్గొన్నారని వైష్ణవ్‌ తెలిపారు. పరిశ్రమ స్పందన చూస్తుంటే.. సంక్లిష్ట సమయాల నుంచి బయట పడ్డట్లు అర్థమవుతోందన్నారు.

ఆగస్టు 14 కల్లా స్పెక్ట్రమ్‌ కేటాయింపు
వేలం పూర్తయ్యాక, స్పెక్ట్రమ్‌ను ఆగస్టు 14 కల్లా కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని ఆయన అంచనా వేశారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. పూర్తి నిడివి గల అత్యంత నాణ్యమైన వీడియో లేదా సినిమాను సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇ-హెల్త్‌, కనెక్టెడ్‌ వెహికల్స్‌, మెరుగైన ఆగుమెంటెడ్‌ రియాల్టీ, మెటావర్స్‌ అనుభవాలు, అధునాతన మొబైల్‌ క్లౌడ్‌ గేమింగ్‌ వంటివి అందుబాటులోకి వస్తాయి.

నేడూ కొనసాగుతుంది..
బుధవారమూ వేలం కొనసాగనుంది. 600, 700, 800, 900, 1800, 2100, 2300, 3300 మెగాహెర్ట్జ్‌తో పాటు 26 గిగాహెర్ట్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కోసం వేలం జరుగుతోంది. ఈ స్పెక్ట్రమ్‌ కనీస విలువ రూ.4.3 లక్షల కోట్లు.

ఇ-బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ కేటాయింపునకు డాట్‌ అనుమతి
ఇ-బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను టెలికాం కంపెనీలకు తాత్కాలికంగా కేటాయించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్‌) ఆమోదముద్ర వేసింది. 5జీ వైర్‌లెస్‌ సేవలను మెరుగ్గా అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ నోటిఫికేషన్‌ వెల్లడించింది. దేశంలో టవర్లు భారీ సంఖ్యలో లేని నేపథ్యంలో, 5జీ స్పెక్ట్రమ్‌తో పాటు ఇ-బ్యాండ్‌ను సైతం కేటాయించాలని టెలికాం కంపెనీలు కోరాయి. దీని వల్ల అధిక వేగం, నాణ్యమైన 5జీ నెట్‌వర్క్‌ను అందించేందుకు ఆస్కారం ఉంటుంది. ఇ-బ్యాండ్‌ అనేది ఫైబరైజేషన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. 71-86 గిగాహెర్ట్జ్‌ మధ్య లభిస్తుంది. అధిక నెట్‌వర్క్‌ వేగంతో, భారీ స్థాయి బ్రాడ్‌బ్యాండ్‌ రద్దీకి ఇది మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుతం 35 శాతం టెలికాం టవర్లు మాత్రమే టెలికాం ప్రధాన నెట్‌వర్క్‌లకు ఫైబర్‌ లింక్‌ల ద్వారా అనుసంధానం అయ్యాయి. మిగతావన్నీ పాయింట్‌-టు-పాయింట్‌ వైర్‌లెస్‌ లింకింగ్‌ ద్వారా అనుసంధానం అయి ఉన్నాయి. ప్రస్తుత పాయింట్‌-టు-పాయింట్‌ వైర్‌లెస్‌ లింక్‌లను అత్యధిక వేగానికి(5జీ) వినియోగించలేరు కనుక, టెల్కోల విజ్ఞప్తికి డాట్‌ ఆమోదం తెలిపింది.

ఇవీ చదవండి: యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోలీసుల దౌర్జన్యం.. జుట్టు పట్టుకొని లాగి...

శబరిమల ఆలయంలో అనూహ్య సమస్య- యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్న అధికారులు!

Last Updated :Jul 27, 2022, 4:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.