ETV Bharat / business

వేతన జీవులకు మళ్లీ నిరాశ- ఐటీ స్లాబులు యథాతథం!

author img

By

Published : Feb 1, 2022, 1:28 PM IST

Updated : Feb 1, 2022, 4:07 PM IST

Union Budget IT slabs: కేంద్ర బడ్జెట్​లో ఆదాయ పన్ను రాయితీపై ప్రకటన ఉంటుందని ఆశగా ఎదురుచూసిన వేతనజీవులకు నిరాశే మిగిలింది. పన్ను స్లాబుల్లో మార్పుపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇకపై ఎన్​పీఎస్​ డిడక్షన్​ ఉంటుందని తెలిపారు. దీన్ని 14శాతం వరకు పెంచుకోవచ్చని పేర్కొన్నారు.

Union Budget 2022
Union Budget 2022

Union Budget 2022: వేతనజీవులకు ఆదాయ పన్ను మినహాయింపులపై మరోసారి నిరాశ తప్పలేదు. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు, శ్లాబుల విషయంలో ఈసారి బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి మార్పు చేయలేదు. కరోనా కారణంగా ద్రవ్యోల్బణం పెరిగిన వేళ స్టాండర్డ్‌ డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.50 వేల నుంచి పెంచుతారని ఆశించినా నిరాశే ఎదురైంది. అయితే.. ఐటీ రిటర్న్‌ల దాఖలులో కాస్త వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్థికమంత్రి తెలిపారు. ఐటీ రిటర్న్‌ల దాఖలులో తప్పిదాలు సరిదిద్దుకుని సవరణలు చేయడానికి రెండేళ్ల కాల సమయం ఇచ్చారు. అంటే రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.

అలాగే కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ మినహాయింపునిచ్చారు. వారికి ఎన్‌పీఎస్‌ మినహాయింపును 10 నుంచి 14 శాతం పెంచుకునే అవకాశం కల్పించారు.

Nirmala sitharaman budget speech

పన్నులకు సంబంధించి బడ్జెట్​ ప్రసంగంలో నిర్మల చేసిన ప్రకటనలు

  • ఆదాయపన్ను శాఖ తనిఖీలు, జప్తు ఆపరేషన్ల సందర్భంగా గుర్తించిన అప్రకటిత ఆదాయంపై ఎలాంటి నష్టానికి తావులేదు.
  • కార్పొరేట్‌ పన్ను రేటులో ఎలాంటి మార్పు లేదు.
  • క్రిప్టో కరెన్సీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30శాతం పన్ను విధింపు.
  • నూతనంగా ఏర్పాటయ్యే తయారీ సంస్థలకు 15 శాతం కార్పొరేట్ పన్ను రాయితీ మరో ఏడాది కొనసాగింపు. మార్చి 2024వరకు ఇది వర్తింపు.
  • దీర్ఘకాలిక మూలధన లాభాలపై సర్‌ఛార్జ్ 15 శాతానికి పరిమితం.
  • డిజిటల్ కరెన్సీ బదిలీ నిర్దేశిత పరిమితి దాటితే ఒక్క శాతం టీడీఎస్​ వసూలు. గిఫ్ట్​లకు కూడా పన్ను వర్తింపు.
  • ఆదాయంపై సెస్​ లేదా సర్‌ఛార్జ్​ను వ్యాపార వ్యయంగా అనుమతించబోమని స్పష్టీకరణ.
  • కో-ఆపరేటివ్ సర్‌ఛార్జ్ 12శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు.
  • కార్పొరేట్‌తో సమానంగా సహకార సంఘాలకు కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి తగ్గించాలని ప్రభుత్వ పతిపాదన.

జీఎస్టీ విధానంలో అద్భుత ప్రగతి సాధించామని.. ఇంకా మరికొన్ని సవాళ్లు ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ జీఎస్టీ ఆదాయం రికార్డుస్థాయిలో పెరిగిందని వెల్లడించారు. జనవరిలో జీఎస్టీ వసూళ్లు లక్షా 40 వేల 986 రూపాయలకు చేరినట్లు వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి: Budget 2022-23: ఈ వస్తువులు మరింత చౌక.. అవి మాత్రం ప్రియం!

జువెలరీ రంగానికి బూస్ట్​.. దిగుమతి సుంకం తగ్గింపు

Last Updated : Feb 1, 2022, 4:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.