ETV Bharat / business

క్రెడిట్ కార్డును పొందలేకపోతున్నారా? ఇది మీ కోసమే..

author img

By

Published : Apr 11, 2021, 11:15 AM IST

Updated : Apr 11, 2021, 11:53 AM IST

tip to get Credit card
క్రెడిట్​ కార్డ్​ పొందేందుకు చిట్కాలు

చాలా మంది అవసరానికి డబ్బు లేనప్పుడు ఉపయోగపడుతుందని.. క్రెడిట్​ కార్డు తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. అయితే అందరికీ అనుకున్నంత సులభంగా క్రెడిట్​ కార్డు లభించదు. ముఖ్యంగా విద్యార్థులు, సెల్ఫ్ ఎంప్లాయిస్​, గృహిణులు.. క్రెడిట్​ కార్డు పొందాలంటే అంత సులువు కాదు. మరి ఈ జాబితాలో ఉన్న వారు క్రెడిట్​ కార్డు పొందేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలతో ఓ ప్రత్యేక కథనం.

ఒకవేళ మీరు తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వారు, విద్యార్థి, గృహిణి, సెల్ఫ్ ఎంప్లాయ్ అయినట్లయితే మీకు క్రెడిట్​ కార్డు లభించడం కష్టంతో కూడుకున్న విషయం. క్రెడిట్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా.. అది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ జాబితాలో ఉన్నట్లయితే.. క్రెడిట్​ కార్డు లభించేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలు, వ్యూహాలను మీ కోసం. అయితే చిట్కాలు, వ్యూహాలను తెలుసుకునే ముందు, క్రెడిట్ కార్డులు అందించే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం.

క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు :

వడ్డీ రహిత సమయం :

క్రెడిట్ కార్డులు అందించే మొదటి ప్రయోజనం ఏమిటంటే, వడ్డీ రహిత సమయం. సాధారణంగా అన్ని క్రెడిట్ కార్డు సంస్థలు 20 నుంచి 50 రోజుల వరకు ఉచిత వడ్డీ రహిత సమయాన్ని అందిస్తాయి. ఈ సమయంలో క్రెడిట్ కార్డు సంస్థలు వినియోగదారుడి నుంచి ఎటువంటి వడ్డీని వసూలు చేయవు. దీని అర్ధం మీరు అదనపు వడ్డీని చెల్లించకుండా డబ్బుని ఉపయోగించుకోవచ్చు.

క్రెడిట్ కార్డు రివార్డ్స్:

క్రెడిట్ కార్డులు అందించే మరో ముఖ్యమైన ప్రయోజనం 'రివార్డ్ పాయింట్లు'. ప్రతి క్రెడిట్ కార్డు సంస్థ ఆన్​లైన్, ఆఫ్ లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను ఉపయోగించి షాపింగ్ చేసినట్లయితే, రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. మీరు సంపాదించిన రివార్డ్ పాయింట్లను ఉపయోగించి.. గిఫ్ట్ కార్డ్స్, షాపింగ్ ఓచర్స్ మొదలైన వాటిని పొందవచ్చు.

క్యాష్ బ్యాక్ ప్రయోజనం:

డబ్బును ఆదా చేసుకోవడానికి ఉన్న ఉత్తమ మార్గాలలో క్యాష్ బ్యాక్ ఒకటి. క్యాష్ బ్యాక్ అంటే డబ్బును తిరిగి పొందడం. కొన్ని క్రెడిట్ కార్డులు నిర్దిష్ట ఉత్పత్తులు, కేటగిరీలపై క్యాష్​బ్యాక్ ప్రయోజనాన్ని అందిస్తాయి. సాధారణంగా క్యాష్ బ్యాక్ ప్రయోజనం అనేది స్థిరంగా ఉంటుంది. అయితే, కొత్త క్యాష్ బ్యాక్ ఆఫర్లను క్రెడిట్ కార్డు సంస్థలు ఏప్పటికప్పుడు ప్రకటిస్తుంటాయి.

ట్రావెల్ మైల్స్:

ట్రావెల్ క్రెడిట్ కార్డు ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నట్లైతే, మీరు ట్రావెల్ మైళ్ళను సంపాదించుకోవచ్చు. మీరు సంపాదించిన ట్రావెల్ మైళ్ళను ఉపయోగించి.. విమాన టికెట్లపై కొనుగోలులో తగ్గింపును పొందవచ్చు. తగినన్ని ట్రావెల్​ మైళ్లతోనే తగ్గింపు సాధ్యమవుతుంది.

ఆన్​లైన్ షాపింగ్​పై తగ్గింపు:

సాధారణంగా ఈ-కామర్స్ వెబ్​సైట్లు ఆన్​లైన్ షాపింగ్​పై పెద్ద మొత్తంలో తగ్గింపులను అందిస్తున్నాయి. కిరాణా, సినిమా, ఆహారం, ప్రయాణం మొదలైన కేటగిరిలపై ఎక్కువగా తగ్గింపులను అందిస్తున్నాయి. కొన్ని ఆఫర్లు దీర్ఘకాలం పాటు అందుబాటులో ఉండగా, మరి కొన్ని ఆఫర్లను పండుగ సమయాలలో అందుబాటులోకి తెస్తున్నాయి.

క్రెడిట్ కార్డు ఆమోదం పొందేందుకు కీలక అంశాలు

మీ జీతం / ఆదాయం

క్రెడిట్​ హిస్టరీ/ క్రెడిట్ స్కోర్

బ్యాంక్​తో మీకు ఉన్న సంబంధం

క్రెడిట్ కార్డు రకం (సురక్షిత క్రెడిట్ కార్డ్)

మీ బ్యాంకు పొదుపు ఖాతా & లావాదేవీ చరిత్ర

క్రెడిట్ కార్డు ఆమోదానికి ఆదాయం ముఖ్యమైనది :

మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, మీ ఆదాయ వివరాలను కూడా అప్లికేషన్ ఫారంలో అందించాలి. ఆదాయ వివరాలతో పాటు, మీ వయస్సు, నగరం, చేతికి వచ్చే జీతం, ఉపాధి రకం వంటి వివరాలను కూడా దరఖాస్తులో తెలపాలి. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్లయితే, మీరు క్రెడిట్ కార్డు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వీటన్నిటిలో ఆదాయం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. మీరు పొందే ఆదాయం అనేది సకాలంలో బకాయిలను చెల్లించడంలో మీ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది.

క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి ఎటువంటి ఆదాయ పరిమితి లేదు. అయితే, సాధారణంగా నెలకు కనీసం రూ. 20,000 కంటే ఎక్కువ జీతం ఉంటే బ్యాంకులు క్రెడిట్​ కార్డు జారీ చేసేందుకు మొగ్గు చూపుతుంటాయి. అధిక ఆదాయం ఉన్నట్లయితే, క్రెడిట్ కార్డు ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ముందు కనీస ఆదాయ అర్హత ప్రమాణాన్ని నిర్ధారించుకోండి. అలాగే మీరు ఆదాయ రుజువు, తాజా ఐటీఆర్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

మీ గత క్రెడిట్ చరిత్ర / క్రెడిట్ స్కోరు:

క్రెడిట్ కార్డు ఆమోదం పొందడంలో మరో ముఖ్యమైన అంశం క్రెడిట్ స్కోర్ / క్రెడిట్ చరిత్ర. సిబిల్ క్రెడిట్ నివేదిక అనేది మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ చరిత్రను కలిగి ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు దీనిలో ఉంటాయి. క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు మీ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసుకోండి. ప్రస్తుతం ఆన్​లైన్ ద్వారా క్రెడిట్ స్కోర్​ను తనిఖీ చేయడం చాలా సులభం.. ఉచితం కూడా.

బ్యాంక్​తో మీకు ఉన్న సంబంధం:

క్రెడిట్ కార్డు ఆమోదం పొందే విషయంలో బ్యాంక్​తో మీకున్న సంబంధం చాలా ముఖ్యమైనది. మీరు బ్యాంకులో జీతం ఖాతా లేదా ఫిక్సెడ్​ డిపాజిట్ కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మీరు క్రెడిట్ కార్డును పొందడం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే మీ గురించి పూర్తి సమాచారం బ్యాంకు వద్ద ఉంటుంది. బ్యాంకుతో మీకు ఉన్న దీర్ఘకాల అనుబంధం, క్రెడిట్ కార్డు పొందే అవకాశాన్ని పెంచుతుంది.

క్రెడిట్ కార్డు రకం (సురక్షిత క్రెడిట్ కార్డు):

చాలా బ్యాంకులు ఫిక్సెడ్​ డిపాజిట్ల ఆధారంగా క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. బ్యాంకులో మీరు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తానికి సమానమైన క్రెడిట్ పరిమితితో సురక్షిత క్రెడిట్ కార్డులను అందిస్తాయి. దీని వలన మీకు రెండు రకాల లాభాలు కలుగుతాయి. ఒకటి మీరు క్రెడిట్ కార్డును పొందుతారు, అలాగే రెండవది క్రెడిట్ కార్డు బకాయిలను సకాలంలో చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది. క్రెడిట్ కార్డు ఆమోదం పొందడానికి ఇది ఉత్తమమైన మార్గం.

సురక్షిత క్రెడిట్ కార్డుకు పొందాలంటే, కనీసం రూ. 20,000 ఫిక్సెడ్ డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిక్సెడ్ డిపాజిట్ ఆధారంగా క్రెడిట్ కార్డును పొందటానికి ఎలాంటి ఆదాయ రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు.

మీ బ్యాంకు పొదుపు ఖాతా & లావాదేవీ చరిత్ర:

మీ బ్యాంకు పొదుపు ఖాతా & లావాదేవీ చరిత్ర కూడా క్రెడిట్ కార్డును పొందడంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఒకవేళ మీరు కనీస సగటు బ్యాలెన్స్​ను నిర్వహించి, తరచూ లావాదేవీలు చేస్తున్నట్లయితే, క్రెడిట్ కార్డు ఆమోదం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్ కార్డు ఆమోదం పొందేందుకు చిట్కాలు:

  • క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ముందు మీ కనీస ఆదాయ అర్హతను తనిఖీ చేసుకోండి.
  • ఒకవేళ మీ చెల్లింపు చరిత్ర సరిగ్గా లేకపోతే, సురక్షిత క్రెడిట్ కార్డు ఆప్షన్​ను ఎంచుకోవడం మంచిది.
  • మీరు జీతం ఖాతాను కలిగిన బ్యాంకులోనే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.
  • ఒకవేళ మీరు జర్నలిస్ట్​గా, పోలీసుగా, న్యాయవాదిగా ఉద్యోగం చేస్తున్నట్లైతే, మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భంలో, మీరు సురక్షిత క్రెడిట్ కార్డు ఆప్షన్​ను ఎంచుకోవడం మంచిది.
  • మీ ఆదాయం విషయంలో అబద్ధం చెప్పకూడదు.
  • ఒకసారి మీ క్రెడిట్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైనట్లైతే, కనీసం 6 నుంచి 12 నెలల వరకు సమయం తీసుకుని అనంతరం దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం.

చివరగా:

ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు మంచిగా ఉండి, మీ వద్ద అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నట్లయితే, క్రెడిట్ కార్డు ఆమోదం పొందడం అంత కష్టమైన విషయం కాదు. క్రెడిట్ కార్డు ఆమోదం పొందడానికి పైన తెలిపిన చిట్కాలు, వ్యూహాలను అనుసరించండి.

ఇవీ చదవండి:

2-3 క్రెడిట్ కార్డులు అవ‌స‌ర‌మా?

క్రెడిట్​ స్కోరు తక్కువున్నా రుణాలు పొందండిలా..

Last Updated :Apr 11, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.