ETV Bharat / business

Zycov-d Vaccine News: పిల్లల టీకా.. తొలుత ఆ రాష్ట్రాల్లోనే..!

author img

By

Published : Dec 3, 2021, 7:20 AM IST

Zycov-d Vaccine
జైకొవ్​-డి

Zycov-d Vaccine News: పిల్లలకోసం జైడస్​ క్యాడిలా అభివృద్ధి చేసిన కొవిడ్​-19 టీకా.. జైకొవ్​-డిను తొలుత 7 రాష్ట్రాల్లో అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. సూది అవసరం లేకుండానే ఈ వ్యాక్సిన్​ను అందిస్తారు.

Zycov-d Vaccine News: దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులకు టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులోభాగంగా జైడస్‌ క్యాడిలా రూపొందించిన జైకొవ్​-డి టీకాను తొలుత 7 రాష్ట్రాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దీంతో త్వరలోనే బిహార్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో అందించనున్నారు. సూది అవసరం లేకుండానే ఇచ్చే ఈ టీకా పంపిణీకి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కూడా పూర్తిచేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Zycov-d Vaccine Price: సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే జైకొవ్​-డి టీకాను 12ఏళ్లు పైబడిన వారి వినియోగానికి ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జైడస్‌ క్యాడిలా రూపొందించిన ఈ టీకా ప్రపంచంలో తొలి డీఎన్‌ఏ ఆధారిత కొవిడ్‌ టీకాగా నిలిచింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా అందించేందుకు గానూ కోటి డోసుల కోసం ఇప్పటికే కేంద్రం ఆర్డరు చేసింది. పత్రిడోసుకు రూ.265 చొప్పున కోటి డోసులను కొనుగోలు చేసింది.

అయితే, సూది అవసరం లేకుండా ఇచ్చే ఈ టీకా పంపిణీకి ప్రత్యేకంగా 'జెట్‌ అప్లికేటర్‌' అనే పరికరాన్ని వినియోగించనున్నారు ఆ పరికరానికి మరో రూ.93 ఖర్చు అదనం కావడంతో మొత్తంగా ఒక డోసుకు దాదాపు రూ.358 కానుంది.

84శాతం మందికి తొలిడోసు..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 125కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను అందజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వాటిలో 79.13కోట్ల (84శాతం) మంది అర్హులకు తొలిడోసు అందించగా.. 45.8కోట్ల (49శాతం) మందికి పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ అందించామని తెలిపింది. ఇంటింటికి టీకా కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వ్యాక్సిన్‌ పంపిణీలో మరింత వేగం పెరిగినట్లు పేర్కొన్న కేంద్రం బిహార్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, బంగాల్ రాష్ట్రాల్లో చాలా మంది ఇంకా తొలిడోసే తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో సూది అవసరం లేకుండా ఇచ్చే జైకొవ్​-డి వ్యాక్సిన్‌ను ఆయా రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తొలుత పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి: జైకొవ్​-డి టీకా ఒక డోసు ధర రూ. 265

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.