ETV Bharat / business

క్రెడిట్​ స్కోరు లేకున్నా లోన్​ గ్యారెంటీ- ఎలాగంటే...

author img

By

Published : Aug 19, 2021, 5:21 PM IST

Can we get loan without Credit history
క్రెడిట్​ స్కోరు లేకున్నా రుణం పొందొచ్చా

అప్పు తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు చాలా కీలకం. అయితే గతంలో రుణం తీసుకోనివారు, క్రెడిట్ కార్డు వాడని వారికి క్రెడిట్ స్కోరు ఉండదు. మరి అలాంటి వారు రుణం తీసుకోవటం అసాధ్యమా? తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికి రుణాలు రావా?

క్రెడిట్ స్కోరు అనేది లోన్​ల మంజూరులో కీలక పాత్ర పోషిస్తుంది. అప్పులు, క్రెడిట్​ కార్డు లావాదేవీలను రికార్డు చేసి.. వాటి ద్వారా ఇచ్చేదే ఈ క్రెడిట్ స్కోరు. క్రెడిట్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇందులో 900 అంటే.. క్రెడిట్ హిస్టరీ 100 శాతం బాగుందన్నట్లు. అదే సమయంలో 300 ఉంటే క్రెడిట్ హిస్టరీ అస్సలు బాలేదన్నట్లు. ఈ క్రెడిట్ రిపోర్టును క్రెడిట్ బ్యూరోలు ఇస్తుంటాయి.

క్రెడిట్ రిపోర్టులో క్రెడిట్ స్కోరు ఒక భాగం. క్రెడిట్ స్కోరును నిర్ణయించేందుకు ఆయా బ్యూరోలు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. రుణాల చెల్లింపు సమయం, క్రెడిట్ కార్డు యుటిలైజేషన్, క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ ఎంక్వైరీ, క్రెడిట్ ఖాతాల సంఖ్య ఇందులో ప్రధానమైనవి.

అప్పు కోసం దరఖాస్తు చేసుకుంటే..

ఒక వ్యక్తిని అప్పు అడిగితే.. గతంలో తీసుకున్న అప్పులు సమయానికి చెల్లించారా? లేదా? అన్న విషయంపై ఎంక్వైరీ చేస్తారు. అదే విధంగా బ్యాంకులు, ఫినాన్స్ సంస్థలు ఈ విషయాన్ని తెలుసుకునేందుకు క్రెడిట్ రిపోర్టు చూస్తాయి.

క్రెడిట్ స్కోరు 750 కంటే ఎక్కువున్న వారికి రుణాలిచ్చేందుకు మొగ్గు చూపుతుంటాయి. తగిన సమయంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తాడనే నమ్మకం ఉన్న వారికి బ్యాంకులు రుణాలను ఇస్తుంటాయి.

క్రెడిట్ స్కోరు లేని వ్యక్తి హోం లోన్​ పొందగలరా?

కోడి ముందా? గుడ్డు ముందా? అనే ప్రశ్న లాంటిదే ఇది. క్రెడిట్ కార్డు, రుణం లేని వారికి క్రెడిట్ స్కోరు ఉండదు. క్రెడిట్ స్కోరు లేని వారికి బ్యాంకులు రుణం ఇచ్చేందుకు మొగ్గు చూపవు.

రుణం మంజూరుకు క్రెడిట్ స్కోరు ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ.. ఇది మాత్రమే ప్రామాణికం కాదు. క్రెడిట్ స్కోరు లేకపోయినప్పటికీ అప్పు తీసుకోవచ్చు. అయితే క్రెడిట్ స్కోరు ఉన్న వారితో పోల్చితే ఇలాంటి వారు కొన్ని అదనపు పత్రాలను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు అప్పు తిరిగి చెల్లిస్తారనే నమ్మకాన్ని రుణ సంస్థకు కలిగించాలి.

క్రెడిట్​ స్కోరు లేకుంటే ప్రాసెస్​ ఇది..

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు 2005 తర్వాత నుంచి మార్కెట్లో ఉన్నాయి. కానీ బ్యాంకులు అంతకంటే ముందు నుంచే రుణాలను ఇస్తున్నాయి. కాబట్టి, రుణగ్రహీతకు ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేకున్నా.. అప్పు తీసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులకు రుణాన్ని ఇచ్చేందుకు బ్యాంకులు యార్డ్ స్టిక్‌ పద్ధతిని ఉపయోగిస్తాయి.

విద్యార్హతలు, ఉద్యోగం వంటి అంశాలను క్రెడిట్ స్కోరు లేనివారికి రుణం ఇచ్చే విషయంలో ప్రధానంగా పరిశీలిస్తాయి రుణ సంస్థలు. డాక్టర్​, ఛార్టర్డ్​ అకౌంటెంట్ తదితర వృత్తుల్లో ఉన్న వారికి ఆదాయంపై భరోసా ఉంటుంది. అందుకే వీరికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు మొగ్గు చూపుతుంటాయి.

ఒక వేళ మంచి వృత్తి, ఉద్యోగంలో లేనట్లయితే దరఖాస్తుదారు బ్యాంకు స్టేట్​మెంట్​ను అడుగుతుంటాయి రుణ సంస్థలు. దీనిని పరిశీలించిన అనంతరం లోన్​ మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి. స్టేట్​మెంట్​లో పెట్టుబడులను తెలిపే సిప్, ఇతర డెబిట్​లు ఉన్నట్లయితే పొదుపు గురించి ఒక అవగాహనకు వస్తాయి. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు, ఇంటర్నెట్ తదితర బిల్లులను పరిశీలిస్తాయి. అద్దె గురించి కూడా బ్యాంకులు తెలుసుకునే అవకాశముంది. ఖర్చులు, పొదుపు అలవాట్ల గురించి బ్యాంక్ స్టేట్​మెంట్ ద్వారా తెలుసుకుంటాయి. క్రెడిట్ స్కోరు లేని వారికి బ్యాంకులు గ్యారంటీ సంతకాన్ని అడిగే అవకాశం కూడా ఉంటుంది.

బ్యాంకుల వారీగా ఈ ప్రత్యామ్నాయాలు వేరువేరుగా ఉండొచ్చు. అయితే క్రెడిట్ స్కోరు లేని వారికి రుణాల విషయంలో వడ్డీ ఎక్కువగా వసూలు చేస్తుంటాయి బ్యాంకులు.

ఇదీ చదవండి: రిటైర్​ అయ్యాక నెలకు రూ.10వేలు పింఛను- ఇలా చేస్తేనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.