ETV Bharat / business

రిటైర్​ అయ్యాక నెలకు రూ.10వేలు పింఛను- ఇలా చేస్తేనే...

author img

By

Published : Aug 19, 2021, 3:40 PM IST

ఉద్యోగం చేస్తున్నప్పుడు నెలనెలా ఆదాయం వస్తుంది కాబట్టి ఆర్థికంగా పెద్దగా సమస్య ఉండదు. అయితే రిటైర్మెంట్​ తర్వాత కూడా అలాంటి జీవితమే కావాలంటే.. పింఛను సదుపాయం ఉండాలి. మరి పదవీ విరమణ అనంతరం నెలనెలా స్థిరమైన ఆదాయాన్నిచ్చేందుకు అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Regular income after retire
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం

ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్​తో మరో దశ ప్రారంభం అవుతుంది. ఉద్యోగ బాధ్యతలు లేకపోవటం వల్ల ప్రశాంతమైన జీవితం గడపొచ్చు. అయితే పదవీ విరమణ అనంతరం రాజీ పడకుండా జీవితం యథాతథంగా కొనసాగాలంటే.. అందుకు ఆర్థికంగా బలంగా ఉండాలి.

సరైన ఆదాయం లేనట్లయితే.. పొదుపు, పెట్టుబడుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా సాధారణంగా ఉద్యోగం చేస్తున్నప్పటితో పోల్చితే జీవన శైలి ఖర్చులు తగ్గిపోతాయి. వైద్యారోగ్య ఖర్చులు పెరిగిపోతుంటాయి. వృద్ధాప్యంలో ఖర్చులకు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు ఉద్యోగంలో ఉన్నప్పుడే సరైన ప్రణాళికను అనుసరించాలి.

పెన్షన్​తో ఆదాయ లోటును భర్తీ చేసుకోవచ్చు. ఆర్థిక స్వేచ్ఛతో శేష జీవితం గడపవచ్చు. అలా నెలనెలా ఆదాయాన్ని ఇచ్చేందుకు పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రైవేటు రంగ ఉద్యోగులకు చాలా ఉపయోగపడతాయి.

ఎన్​పీఎస్

ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఇందులో 60 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1000. గరిష్ఠ పరిమితి లేదు.

ఖాతాదారుడి ప్రాధాన్యాలకు తగ్గట్లు డెట్, ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఎంపిక చేసుకున్న ఫండ్ ప్రదర్శన ఆధారంగా రాబడి ఉంటుంది. పదవీ విరమణ సమయంలో 60 శాతం పెట్టుబడిని ఒకేసారి తీసుకోవచ్చు. మరో 40 శాతం స్థిరమైన ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ప్లాన్​లో మదుపు చేయాలి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్​)

ఇది 15 సంవత్సరాల దీర్ఘకాల పెట్టుబడి పథకం. కాబట్టి కాంపౌండింగ్ (వడ్డీని తిరిగి అందులోనే మదుపు చేయటం) ద్వారా ఎక్కువ రాబడిని పొందవచ్చు. కనీస పెట్టుబడి రూ.500. గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు.

ఇందులో నెలవారీగా కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలి. లేదా వార్షికంగా కూడా పెట్టుబడి పెచ్చొచ్చు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీలపై రాబడికి అనుగుణంగా ప్రభుత్వం దీనిపై వడ్డీ రేటు త్రైమాసికాల వారీగా నిర్ణయిస్తుంది. ఇవి మార్కెట్ ఆధారిత ఫండ్​ కాదు.

ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్)

వేతన జీవులకు సంబంధించి ప్రభుత్వం అందిస్తోన్న రిటైర్మెంట్ పథకం ఇది. ఉద్యోగం చేస్తున్న సంస్థతో పాటు ఉద్యోగి వేతనంలో కొంత భాగం ఇందులో మదుపు చేయాల్సి ఉంటుంది. వేతనం నుంచి ఈ వాటా చెల్లింపు జరుగుతుంది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఏడాదికి ఓ సారి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఈపీఎఫ్​లో ఈపీఎస్ అనేది ఉంటుంది. దీని ద్వారా పింఛను పొందవచ్చు.

యాన్యుటీ ప్లాన్లు

వీటి ద్వారా జీవిత బీమా పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఖాతాదారుడు మరణించినట్లయితే కుటుంబ సభ్యులు లేదా నామినీ బీమా మొత్తాన్ని పొందుతారు.

ఇందులో కొంత మొత్తాన్ని ఒకే సారి పెట్టుబడిగా పెట్టొచ్చు. నెలనెలా కొంత మొత్తం మదుపు చేసేందుకూ అవకాశం ఉంది. నిర్ణీత సమయంలో పాలసీ గడువు ముగిసిన అనంతరం పింఛను పొందవచ్చు. రిటైర్మెంట్​కు ఎక్కువ సమయం ఉన్న ఉద్యోగులకు ఇది సరిపోతుంది.

ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా.. రిటైర్మెంట్ తర్వాత నెలవారీగా స్థిరమైన ఆదాయం పొందే వీలుంటుంది.

ప్రభుత్వం అందిస్తోన్న ప్రధాన మంత్రి వయ వందన యోజన యాన్యూటీ స్కీమ్ ద్వారా నెలనెలా ఆదాయం పొందొచ్చు. ఇందులో రూ. 1.5 లక్ష మదుపు చేయటం ద్వారా నెలకు రూ.1000 పింఛను పొందవచ్చు. గరిష్ఠంగా 15 లక్షల పెట్టుబడి పెట్టొచ్చు. దీని ద్వారా నెలకు రూ. 10,000 పింఛను తీసుకోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.