ETV Bharat / business

ఎల్‌ఐసీ వద్ద భారీగా క్లెయిం చేయని నిధులు- 20 వేల కోట్లకుపైనే..

author img

By

Published : Feb 16, 2022, 6:21 PM IST

LIC sits on over Rs 21,500 cr unclaimed funds
LIC sits on over Rs 21,500 cr unclaimed funds

LIC IPO Unclaimed Funds: ఎల్​ఐసీ త్వరలోనే పబ్లిక్​ ఇష్యూకు రానుంది. ఇటీవలే.. సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం వద్ద ఎవరూ క్లెయిం చేయని నిధులు రూ. 21 వేల కోట్లకుపైనే ఉన్నట్లు తెలిపింది.

LIC IPO Unclaimed Funds: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) వద్ద ఎవరూ క్లెయిం చేయని రూ.21,539 కోట్ల నిధులు ఉన్నాయి. ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న ఎల్‌ఐసీ.. సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో ఈ విషయం వెల్లడించింది. వడ్డీతో కలిపి తమ వద్ద ఇన్ని నిధులు పోగయ్యాయని పేర్కొంది. మార్చి 2021 నాటికి అన్‌క్లెయిమ్డ్‌ నిధులు రూ.18,495 కోట్లు, మార్చి 2020 నాటికి రూ.16,052.65 కోట్లు ఉన్నట్లు తెలిపింది.

రూ.1000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ క్లెయిమ్‌ చేయని నిధులు ఏదైనా బీమా సంస్థ వద్ద పోగైతే.. వాటి వివరాలు ఆయా సంస్థలు తమ వెబ్‌సైట్లలో పొందుపరచాల్సి ఉంటుంది. పదేళ్లు దాటినా ఆ వివరాలను అలాగే ఉంచాలి. వీటికి సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకునేందుకు పాలసీదారులు లేదా లబ్ధిదారులకు వీలు కూడా కల్పించాలి. అలాగే సీనియర్‌ సిటిజెన్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ (SCWF) చట్టం ప్రకారం.. పదేళ్లు దాటిన క్లెయిం చేయని నిధులను ఎస్‌సీడబ్ల్యూఎఫ్‌కు బదిలీ చేయాలి. ఈ నిధుల గణన, బదిలీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖలోని బడ్జెట్‌ డివిజన్ నిర్దేశించిన విధివిధానాలను పాటించాలి.

LIC IPO: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) పబ్లిక్ ఇష్యూకు రానున్న క్రమంలో కొద్దిరోజుల కింద సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూను మార్చిలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.

దీని ప్రకారం, రూ.63,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో 5 శాతం వాటా లేదా 31.6 కోట్ల షేర్లను ప్రభుత్వం ఎల్‌ఐసీలో విక్రయించబోతోంది. వచ్చే నెలలో ఈ ఐపీఓ వచ్చేందుకు అవకాశం ఉంది. ఎల్‌ఐసీ ఉద్యోగులు, పాలసీదార్లకు ఈ ఐపీఓలో రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీని కోసం పాలసీదారు తమ పాన్‌ వివరాలను ఫిబ్రవరి 28లోపు (డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన రెండు వారాల్లోగా) ఎల్‌ఐసీ వద్ద నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. నేరుగా తమ వెబ్‌సైట్‌ లేదా ఏజెంట్ల ద్వారా పాన్‌ను వివరాలు సమర్పించవచ్చని ఎల్‌ఐసీ పేర్కొంది.

  • ఐపీఓ తరవాత ఎల్‌ఐసీ మార్కెట్‌ విలువ 293 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.22.1 లక్షల కోట్లు) అవుతుందనే అంచనాలున్నాయి. తద్వారా ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన నమోదిత జీవితబీమా సంస్థగా ఎల్‌ఐసీ నిలుస్తుందని చెబుతున్నారు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల ఉపసంహరణ ద్వారా సమీకరించాలనుకున్న మొత్తం అంచనాలను రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.78,000 కోట్లకు ప్రభుత్వం తగ్గించిన సంగతి విదితమే. ఈ మొత్తం సమీకరణకు ఎల్‌ఐసీ ఐపీఓ కీలకం కానుంది.

ఇవీ చూడండి: ఎల్‌ఐసీ ఐపీఓ.. సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు

మార్చిలో ఎల్​ఐసీ ఐపీఓ.. చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం

LIC IPO: డిస్కౌంట్​ కోసం ఎల్‌ఐసీ పాలసీదారులకు 28వరకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.