ETV Bharat / business

రుణ దరఖాస్తు తరచూ తిరస్కరణకు గురవుతోందా?

author img

By

Published : Apr 28, 2021, 3:05 PM IST

personal Loan
వ్యక్తిగత రుణాలు

కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని చాలా మంది వ్యక్తిగత రుణాలను తీసుకున్నారు. అయితే కొందరి రుణ దరఖాస్తులకు వెంటనే ఆమోదం దొరుకుతుంది. మరికొందరికి ఆలస్యం అవుతుంది. మరికొందరికి దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. వేతన జీవులకు రుణం అందించే విషయంలో బ్యాంకులు పరిగణనలోకి తీసుకునే అంశాలను తెలుసుకుందాం..

అవసరానికి ఆదుకునేందుకు ఉపయోగపడే రుణాల్లో వ్యక్తిగత రుణాలది ప్రధాన పాత్ర. అత్యవసర సమయాల్లో అవసరాలను కూడా తీరుస్తాయి ఈ తరహా రుణాలు. వ్యక్తిగత రుణాలను బ్యాంకు ఇవ్వాలంటే కస్టమర్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి. దీని ప్రకారమే దరఖాస్తును అనుమతించాలా లేదా అనేది నిర్ణయం అవుతుంది. తనఖా రుణాలు, వాహన రుణాల్లాగా కాకుండా వ్యక్తిగత రుణాలకు ఎలాంటి తనఖా ఉండదు. ఈ కారణంగా అర్హతకు సంబంధించిన నియమాలను బ్యాంకులు కఠినంగా అనుసరిస్తాయి. క్రెడిట్ స్కోరు, ఆదాయం, ఇప్పటికే ఉన్న ఈఎమ్ఐలు, వృత్తి, రిపేమెంట్ చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం..

క్రెడిట్ స్కోరు..

వ్యక్తిగత రుణం విషయంలో బ్యాంకులు మొదటగా పరిగణనలోకి తీసుకునేది క్రెడిట్ స్కోరు. 700 కంటే ఎక్కువున్నట్లయితే రుణం సులభంగా పొందవచ్చు. అంతేకాకుండా తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు. ఆర్థిక చరిత్ర, రుణాన్ని చెల్లించే సామర్థ్యం తదితర అంశాలను క్రెడిట్ స్కోరు తెలుపుతుంది. ఈ స్కోరు పూర్వం తీసుకున్న రుణాలు, వాటిని తిరిగి చెల్లిస్తున్న తీరు తదితర అంశాల ఆధారంగా నిర్ణయం అవుతుంది. తీసుకున్న రుణం, తిరిగి చెల్లిస్తున్న తీరు, తరచూ చెల్లిస్తున్నారా? లేదా?, ఎన్ని ఈఎమ్ఐలు కట్టలేదు? తదితరాలన్ని క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తాయి.

ప్రస్తుత ఆదాయం

నెలవారీ ఖర్చులు, ప్రస్తుత ఆదాయం వనరు తదితర అంశాలను కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. హోమ్ లోన్, వాహన రుణం, నెల వారీ ఖర్చులు తదితర అంశాలను బ్యాంకులు పరిశీలిస్తాయి. 'డెట్ టూ ఇన్​కం' నిష్పత్తిని బ్యాంకులు చూస్తాయి. నెలవారీ రుణం సంబంధ పేమెంట్లను నెలవారీ స్థూల ఆదాయంతో భాగిస్తే వచ్చేదే ఈ నిష్పత్తి. రుణ సంబంధిత చెల్లింపులు ఆదాయంలో 50 శాతం కంటే తక్కువగా ఉండాలి.

ఉద్యోగ చరిత్ర

ఉద్యోగ చరిత్ర ఆదాయం సహా.. అందులో స్థిరత్వాన్ని చూపిస్తుంది. దరఖాస్తుదారులు తరచూ ఉద్యోగాలు మారుతున్నట్లయితే లేదా స్థిర ఆదాయం లేనట్లయితే వారి విషయంలో రిస్కు ఎక్కువగా ఉంటుంది. ఒకే తరహా ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగినట్లయితే కంపెనీని ఎక్కువ స్థిరత్వంగా పరిగణిస్తాయి. అంటే ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేయాలని కూడా అనుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

వృత్తి

ఈ అంశం కూడా రుణ మంజూరులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు లాంటి వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత పెద్ద కంపెనీలతో పాటు డాక్టర్లు, లాయర్లు, చార్టర్ అకౌంటెంట్ల తదితర స్థిర ఆదాయం ఉన్న వారికి మొగ్గు చూపవచ్చు. చిన్న తరహా కంపెనీలు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి బ్యాంకులు రుణం ఇచ్చేందుకు తక్కువ ప్రాధాన్యతను ఇస్తాయి. తరచూ ఉద్యోగాలు మారే వారి విషయంలోనూ ప్రతికూలత ఉంటుంది.

తిరిగే చెల్లించే తీరు

క్రెడిట్ కార్డు, రుణం తిరిగే చెల్లించే తీరును బ్యాంకులు దగ్గరగా పరిశీలిస్తాయి. సరిగ్గా తిరిగి చెల్లించనట్లయితే క్రెడిట్ స్కోరు తగ్గిపోతుంది. రిపేమెంట్ చరిత్ర సరిగ్గా లేనట్లయితే వ్యక్తిగత రుణ దరఖాస్తును తిరస్కరిస్తుంటాయి.

రుణ మొత్తం

మనం తీసుకోవాలనుకుంటున్న రుణ మొత్తాన్ని బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఎక్కువ మొత్తం కావాలంటే ఎక్కువ తనిఖీలు, చెకింగ్స్ బ్యాంకులు చేయాల్సి ఉంటుంది. రిస్కును తగ్గించుకునేందుకు తనఖానూ అడగవచ్చు. తక్కువ మొత్తం రుణం కావాలనుకుంటే బ్యాంకుతో సంబంధాలు బాగున్నట్లయితే.. త్వరగా మంజూరవుతుంది.

రుణ ఉద్దేశం

రుణం ఎందుకు తీసుకుంటున్నారు? అనే దానినీ బ్యాంకులు అడుగుతాయి. రిస్కు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఎక్కువ వడ్డీని ఛార్జ్​ చేస్తాయి. తక్కువ రిస్కు ఉన్నట్లయితే త్వరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది.

ఆదాయంలో మిగులు

వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసినట్లయితే.. ప్రస్తుతం ఉన్న ఈఎమ్ఐలు, రుణం మొత్తాన్ని అంచనా వేస్తుంటాయి. వీటి చెల్లింపు అనంతరం కూడా ఆదాయంలో మిగులు ఉన్నట్లయితే వ్యక్తిగత రుణం పొందటం చాలా సులభం అవుతుంది. ఆదాయంలో మిగులు తక్కువ ఉన్నట్లయితే బ్యాంకులకు రిస్కు ఎక్కువగా ఉంటుంది.

వ్యక్తిగత రుణ అర్హత చాలా అంశాల ఆధారంగా నిర్ణయమౌతోన్న దృష్ట్యా.. వాటిని మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించాలి. ఈ అంశాలన్నీ మంచి స్థాయిలో ఉన్నట్లయితే తక్కువ వడ్డీకే రుణం పొందవచ్చు.

వివిధ బ్యాంకులు-వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు

  • యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా 8.90 % నుంచి ప్రారంభం
  • ఐసీఐసీఐ బ్యాంకు 10.5 % నుంచి ప్రారంభం
  • హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 10.5% నుంచి ప్రారంభం
  • కోటక్ మహీంద్ర బ్యాంకు 10.25% నుంచి ప్రారంభం
  • యాక్సిస్ బ్యాంకు 11% నుంచి ప్రారంభం
  • ఎస్బీఐ 9.60% నుంచి ప్రారంభం
  • పంజాబ్ నేషనల్ బ్యాంకు 8.95 % నుంచి ప్రారంభం
  • సిటీ బ్యాంకు 9.99 % నుంచి ప్రారంభం
  • ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు 11 % నుంచి ప్రారంభం
  • బజాజ్ ఫిన్సర్వ్ 11.49 శాతం నుంచి

ఇదీ చదవండి: పర్సనల్‌ లోన్‌ కావాలా? ఇవి తెలుసుకోండి..

క్రెడిట్​ స్కోరు తక్కువున్నా రుణాలు పొందండిలా..

సిరి: 2-3 క్రెడిట్ కార్డులు అవ‌స‌ర‌మా?

క్రెడిట్ స్కోర్ తెలిపే బ్యూరోలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.