ETV Bharat / business

ఇకపై ఆదాయాలు దాచలేరు.. చూపించాల్సిందే

author img

By

Published : Apr 2, 2021, 10:02 AM IST

Earnings can no longer be hidden must be shown in itr
ఇకపై ఆదాయాలు దాచలేరు.. చూపించాల్సిందే

ఆదాయపు పన్ను దాఖలులో అసెసీలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఐటీ రిటర్నుల దాఖలు మరింత సులువు కానుంది. ఇందుకు గానూ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2021-22 నుంచి ఆదాయపు పన్ను శాఖ ముందుగానే పూర్తి చేసిన ఐటీఆర్‌ ఫారాలను జారీ చేయనుంది.

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల దాఖలు మరింత సులువు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2021-22 నుంచి ఆదాయపు పన్ను శాఖ ముందుగానే పూర్తి చేసిన ఐటీఆర్‌ ఫారాలను జారీ చేయనుంది. ఆదాయపు పన్ను దాఖలులో అసెసీలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఇది ఉపయోగపడనుంది. ముందస్తుగానే నింపిన ఐటీఆర్‌లో పన్ను చెల్లింపుదారుడి వేతనం, మినహాయింపులు, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) వివరాలతో ఉండనున్నాయి. ఇప్పటికే పాక్షికంగా పూర్తి చేసిన ఫారాలు అందుబాటులో ఉన్నాయి. మినహాయింపుల వరకూ అసెసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి వాటినీ ముందే నింపి అందిస్తారు.

వీటితోపాటు, లిస్టెడ్‌ సెక్యూరిటీల నుంచి లభించిన మూలధన రాబడి, డివిడెండ్‌ ఆదాయం, బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయాల వంటి వివరాలూ ముందే నింపిన ఫారంలో ఉంటాయి. కొందరు తమకు వస్తున్న ఇతర ఆదాయాలను దాచిపెట్టి, రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ముఖ్యంగా షేర్లలో లావాదేవీలను కొందరు రిటర్నులలో నమోదు చేయరు. ఇలాంటివారందరూ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేకాకుండా.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మీకు వచ్చే ప్రతి ఆదాయాన్నీ రాయడంతోపాటు, దానికి సంబంధించిన ఆధారాలు దాచిపెట్టుకోండి.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. 75 ఏళ్లు దాటిన వారు రిటర్నులను దాఖలు చేయాల్సిన అవసరం లేదని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో సీనియర్‌ సిటిజన్లకు పన్ను రిటర్నుల సమర్పణ భారం ఉండదు. అయితే, పింఛను, వడ్డీల ద్వారా ఆదాయం పొందుతున్న వారికే ఇది వర్తిస్తుంది. పింఛను, వడ్డీ చెల్లించే బ్యాంకులు అవసరమైన మేరకు టీడీఎస్‌ వసూలు చేస్తాయి. ఇతర మార్గాల నుంచి ఆదాయం పొందే వారికి ఈ నిబంధన వర్తించదు.

ఇదీ చూడండి: నేటి నుంచి 5 కొత్త ఐటీ రూల్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.