ETV Bharat / business

క్రెడిట్​ కార్డు.. విదేశీ ప్రయాణాల్లో మనకు తోడుగా

author img

By

Published : Mar 18, 2022, 7:47 AM IST

credit card benifits
క్రెడిట్ కార్డు ఉపయోగాలు

Credit card multiple offers: కొన్నాళ్లుగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయాయి. దీంతో ప్రజలు విదేశీ విహార యాత్రలు, ఇతర అవసరాల కోసం ప్రయాణాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో అవసరమైన కరెన్సీని తీసుకెళ్లేందుకు ప్రణాళికలూ అవసరం. నగదు, ఫారెక్స్‌ కార్డు, ట్రావెలర్‌ చెక్కులు ఉన్నప్పటికీ.. క్రెడిట్‌ కార్డులూ కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. అవేమిటో చూద్దామా..

Credit card multiple offers: విదేశీ ప్రయాణాల్లో నగదు, ఫారెక్స్​ కార్డు, ట్రావెలర్ చెక్కులు ఉన్నప్పటికీ.. క్రెడిట్ కార్డులూ కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. క్రెడిట్​ కార్డు ప్రయోజనాలను బ్యాంక్ బజార్ సీఈఓ అధిల్ శెట్టి వివరించారు. విదేశీ ప్రయాణాల్లో క్రెడిట్‌ కార్డును ఉపయోగించడం ఎంతో తేలిక. అవసరమైనప్పుడు నగదు తీసుకునే వీలుతో పాటు, కొనుగోళ్ల సమయంలో రివార్డులు, నగదు వెనక్కి, డిస్కౌంట్‌లు తదితరాలూ అందుతాయి.

సరైన కార్డుతో..

మార్కెట్లో అనేక రకాలైన క్రెడిట్‌ కార్డులు అందుబాటులో ఉన్నాయి. కార్డును బట్టి ప్రయోజనాలు ఉంటాయి. క్రెడిట్‌ కార్డును తీసుకునే ముందు, వాటిని పరిశీలించాలి. మీ అవసరాలకు ఏది నప్పుతుందో చూసుకోవాలి. లావాదేవీ రుసుము, ఆలస్యంగా బిల్లు చెల్లిస్తే ఫీజు, రివార్డులు, రాయితీలు, మీరు వెళ్తున్న దేశంలో ఆ కార్డును ఎంత మేరకు అంగీకరిస్తారు అనే అన్ని వివరాలూ ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకోవాలి.

వివరాలు చెప్పండి..

మీరు ప్రయాణం చేసేముందు.. మీ కార్డు సంస్థకు ఆ వివరాలు తెలియజేయండి. నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యాప్‌ ద్వారా అంతర్జాతీయ లావాదేవీలను అంగీకరించేలా చేయడం, లేదా నిరోధించడం మీరే సొంతంగా చేసుకోవచ్చు. ఈ వెసులుబాటును మీరు అంగీకరించకుంటే కార్డు పనిచేయదు. లావాదేవీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే.. కార్డు సంస్థ అది మోసపూరితం అని భావించి, కార్డును తాత్కాలికంగా నిలిపి వేసే అవకాశం ఉంది. ఇలాంటి అనుభవం ఎదురైతే వెంటనే కార్డు సంస్థ వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్‌ చేసి అన్‌బ్లాక్‌ చేసుకోవాలి.

బీమా రక్షణ..

మీరు ఉపయోగిస్తున్న క్రెడిట్‌ కార్డు రకాన్ని బట్టి, దానికి అనుబంధంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ప్రయాణ బీమా ఒకటి. దీనివల్ల వస్తువులు, పాస్‌పోర్టు పోయినప్పుడు, ప్రయాణం ఆలస్యం అయినా, ప్రమాదాలు, విమానాల రద్దు తదితర సందర్భాల్లో పరిహారం లభిస్తుంది. కార్డులను బట్టి, బీమా అందించే తీరు మారుతుంది. ప్రయాణానికి ముందే మీరు ఎంచుకుంటున్న కార్డు అందించే బీమా ప్రయోజనాలు తెలుసుకోవాలి. కొన్ని కార్డు సంస్థలు దేశీయ ప్రయాణాలకు ఈ బీమాను వర్తింపచేయవు.

వీటితోపాటు విమానాశ్రయాల్లోని విశ్రాంతి గదుల్లోకి ఉచిత ప్రవేశం, ఆహారంలాంటి వెసులుబాట్లు కల్పిస్తుందా చూసుకోండి. ఏటీఎం నుంచి డబ్బు తీసుకున్నప్పుడు విధించే రుసుములు, విదేశీ లావాదేవీల ఫీజుల్లాంటివీ చూసుకోవాలి.

ఒకటికి మించి..

విదేశాలకు వెళ్లేటప్పుడు ఒకటికి మించి క్రెడిట్‌ కార్డులను తీసుకెళ్లడం ఉత్తమం. ఒక కార్డును అంగీకరించకపోయినా మరోటి ఉపయోగపడుతుంది. వీసా, మాస్టర్‌కార్డు, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇలా వివిధ నెట్‌వర్క్‌ల కార్డులు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. కార్డులన్నీ ఒకేచోట పెట్టుకోవద్దు. వేర్వేరు చోట జాగ్రత్త చేసుకోవాలి. ఒకటి పోయినా. రెండోది మిగులుతుంది. కార్డు జారీ చేసిన సంస్థ వివరాలు రాసి పెట్టుకోండి. కార్డు కనిపించకుండా పోతే వెంటనే ఆ వివరాలు సంస్థకు తెలియజేయండి.

ఇదీ చదవండి: యూజర్లకు నెట్​ఫ్లిక్స్​​ షాక్​.. ఇకపై అకౌంట్​ షేర్​ చేస్తే బాదుడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.