ETV Bharat / business

యూజర్లకు నెట్​ఫ్లిక్స్​​ షాక్​.. ఇకపై అకౌంట్​ షేర్​ చేస్తే బాదుడే!

author img

By

Published : Mar 18, 2022, 4:18 AM IST

Netflix Account Sharing: యూజర్లకు నెట్​ఫ్లిక్​ షాక్​ ఇచ్చింది. ఇక నుంచి యూజర్లు తమ అకౌంట్​ను షేర్​ చేస్తే ఛార్జ్​ చేయాలని సంస్థ భావిస్తోంది. అకౌంట్​ షేరింగ్​ వల్ల నష్టపోతున్నామని భావించి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

netflix
నెట్​ఫ్లిక్స్​

Netflix Account Sharing: కరోనా పుణ్యమా అని ఓటీటీలకు విపరీతంగా ఆదరణ పెరిగింది. థియేటర్లు మూతపడడం వల్ల చాలా మంది వినోదం కోసం రకరకాల ఓటీటీలను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. అయితే, ఒక ఖాతాతో వివిధ డివైజుల్లో లాగిన్‌ అయ్యే వీలుండటం వల్ల ఒక అకౌంట్‌ తీసుకుని.. తమ స్నేహితులు, బంధువులతో పాస్‌వర్డ్‌ పంచుకుంటున్నారు. దీంతో ఒక సబ్‌స్క్రిప్షన్‌పై పలువురు వినోదం పొందుతున్నారు. అయితే, ఇలాంటి అకౌంట్‌ను షేర్‌ చేసుకోవడం వల్ల నష్టపోతున్నామని భావిస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు కొంత రుసుము వసూలు చేయాలని యోచిస్తోంది.

గతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతమందితో అకౌంట్‌ పంచుకున్నా పరిమితుల మేరకు వినోదాన్ని ఆస్వాదించే వెసులుబాటు ఇచ్చింది. అయితే, ఇటీవల త్రైమాసిక ఫలితాల్లో సబ్‌స్క్రైబర్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేకపోవడం వల్ల ఆదాయం పెంచుకునేందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఖాతాను పంచుకోవడం వల్ల నాణ్యమైన కొత్త కార్యక్రమాల రూపొందించే సామర్థ్యం తమకు తగ్గుతోందని నెట్‌ఫ్లిక్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. అందుకే తొలుత చిలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో ఒక ఖాతాకు రెండు సబ్‌ అకౌంట్స్‌ను తెరిస్తే అదనంగా నెలకు 2, 3 డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

అయితే, తొలుత ఈ మోడల్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత మిగిలిన అన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నెట్‌ఫ్లిక్స్‌ అదే చేస్తే ఇకపై అకౌంట్‌ను పంచుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారనుంది. మిగిలిన కంపెనీలు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తే ఒకే ఖాతాను ఇక వేర్వేరు వ్యక్తులు వినియోగించడం ఇక కష్టమే. ఓ విధంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ భారం కానుంది. ఇప్పటికే కొన్ని ఓటీటీ కంపెనీలు డివైజ్‌ల లాగిన్‌, స్ట్రీమింగ్‌పై పరిమితి విధించాయి. ఒకేసారి ఇద్దరు/ ముగ్గురు మాత్రమే స్ట్రీమ్‌ చేయగలరు. ఇక లాగిన్‌ విషయంలో ఐదు డివైజ్‌ల పరిమితి ఉంది.

ఇదీ చూడండి : రోజుకు ఎన్ని జీబీల డేటా వాడేస్తున్నారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.