ETV Bharat / business

తగ్గనున్న అమెజాన్ ప్రైమ్ వీడియో క్వాలిటీ!

author img

By

Published : Mar 24, 2020, 12:57 PM IST

కరోనా నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్​ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్​లపై భారం తగ్గించేందుకు సిద్ధమైంది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్. ఇందులో భాగంగా వీడియో క్వాలిటీని తగ్గించాలని నిర్ణయించింది.

Amazon reducing Prime Video streaming bit rates
వీడియో క్వాలిటీకి కరోనా దెబ్బ

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా వినియోగదారులకు వినోదం పంచుతున్న ఈ సంస్థ వీడియోల నాణ్యతను తగ్గించాలని యోచిస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావంతో దేశంలో మొత్తం ఎక్కడికక్కడ నిర్బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండే ప్రజలు ఇంటర్నెట్‌ ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని వల్ల ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌లో ఏర్పడే ఇబ్బందులను, స్ట్రీమింగ్‌ బిట్‌రేట్‌ను తగ్గించేందుకు అమెజాన్‌ పరిశీలిస్తోంది.

నెట్‌వర్క్‌ ప్రొవైడర్లపై ఏర్పడే ఒత్తిడిని తగ్గించేందుకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తమ వీడియోలను హెచ్‌డీ క్వాలిటీ నుంచి ఎస్‌డీ క్వాలిటీకి తగ్గించాలని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాయ్‌) ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

అయితే, అసోసియేషన్‌ అభ్యర్థనపై అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తాజాగా స్పందించింది. 'భారత్‌లో వినియోగదారులకు నాణ్యమైన స్ట్రీమింగ్‌తో వీడియోలు అందిస్తున్న మేము ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోగలం. అందుకే స్ట్రీమింగ్‌ బిట్‌ రేట్‌ను తగ్గించే చర్యలు ఇప్పటికే ప్రారంభించాం' అని పేర్కొంది. మరో ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం ఇంకా తన స్పందన తెలపలేదు.

ఇదీ చూడండి:ఉచితంగా జియో బ్రాడ్​బ్యాండ్ సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.