ETV Bharat / bharat

భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఆభరణాలు, చీరలు కేవలం గిఫ్ట్​లే!: హైకోర్టు

author img

By

Published : Jun 25, 2023, 11:32 AM IST

Wife Rights In Husband Property : భర్త సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విషయంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆ కేసు ఏంటి? ఏం జరిగింది?

Wife Rights In Husband Property
Wife Rights In Husband Property

Wife Rights In Husband Property : సాధారణంగా చాలా ఇళ్లల్లో గృహిణులే.. కుటుంబంతో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటారు. భర్త సంపాదించిన డబ్బుతో.. పిల్లలను చూసుకుంటూ ఇంటిని చక్కగా నడిపిస్తుంటారు. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు సమాన హక్కు ఉంటుందని తెలిపింది. ఓ కేసు విషయంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఆ కేసు ఏంటంటే?
నైవేలి బొగ్గు గనిలో కన్నయన్​ నాయుడు అనే వ్యక్తి అనేక ఏళ్ల పాటు పనిచేశాడు. ఆ సమయంలో అక్కడ నుంచి తన భార్యకు కుటుంబ పోషణ కోసం డబ్బులు పంపించాడు. కన్నయన్​ భార్య.. ఆ డబ్బులతో కొంత విలువైన ఆస్తి కొనుగోలు చేసింది. అయితే ఆ ఆస్తిపై తనకు మాత్రమే హక్కు ఉందని.. భార్యకు లేదని అతడు కొన్ని రోజుల క్రితం.. దిగువ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్​ స్వీకరించిన దిగువ కోర్టు విచారణ జరిపింది. కన్నయన్​ నాయుడి ఆస్తిలో అతడితోపాటు భార్యకు కూడా సమాన హక్కు ఉందని తీర్పునిచ్చింది. దీనిపై కన్నయన్.. మద్రాస్​ హైకోర్టులో అప్పీలు చేశాడు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరాడు.

అయితే ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ రామసామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భర్త సంపాదించడం.. ఆ డబ్బుతో భార్య.. పిల్లలు, కుటుంబాన్ని పోషించడం సర్వసాధారణమని అన్నారు. భార్య కుటుంబాన్ని చూసుకోవడం వల్లనే భర్త తన పనిని పూర్తి సంతృప్తితో చేయగలుగుతున్నాడని తెలిపారు. అందుకే భర్త డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తిలో భార్యకు సమాన వాటా హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.

సంపాదన కోసం భర్త చేసే ఎనిమిది గంటల పనితో.. కుటుంబాన్ని పోషించేందుకు 24 గంటల గృహిణుల కష్టాన్ని పోల్చలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్​ రామసామి అభిప్రాయపడ్డారు. భార్యకు భర్త ఇచ్చే ఆభరణాలు, చీరలు, ఇతర వస్తువులను కానుకలగానే పరిగణించాలని ఆయన అన్నారు. కుటుంబ వాహనానికి భార్యాభర్తలే జంట చక్రాలని పేర్కొన్నారు. గృహిణులు కుటుంబానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేసిన సహకారాన్ని గుర్తించే చట్టం ఏదీ చేయలేదని.. ఆ సహకారాన్ని కోర్టు గుర్తించకుండా ఏ చట్టం నిషేధించలేదని వ్యాఖ్యానించారు జస్టిస్ కృష్ణన్ రామస్వామి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.