ETV Bharat / bharat

'జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఏం చేస్తున్నట్టు? తప్పును వారే అంగీకరించి సరిదిద్దుకోవాల్సింది'

author img

By

Published : Jul 31, 2023, 4:20 PM IST

yogi-adityanath-on-gyanvapi
yogi-adityanath-on-gyanvapi

Yogi Adityanath on Gyanvapi Masjid issue : ఉత్తర్​ప్రదేశ్​ జ్ఞానవాపి మసీదు విషయంలో జరిగిన తప్పును ముస్లింలు అంగీకరించి ఉండాల్సిందని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పొరపాటును సరిదిద్దుకుంటామని ప్రతిపాదించాల్సిందని వ్యాఖ్యానించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Yogi Adityanath on Gyanvapi : ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. జ్ఞానవాపిలో ఉన్నది మసీదు కాదని పేర్కొన్నారు. ఆ నిర్మాణ శైలిని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుందని స్పష్టం చేశారు. దీన్ని ముస్లిం సమాజం అంగీకరించి, చారిత్రక తప్పిదంగా పరిగణించి సరిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన యోగి.. జ్ఞానవాపి ప్రాంగణంలో హిందూ గుర్తులు ఉన్నాయని తెలిపారు.

"దాన్ని మసీదు అని పిలిస్తే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. మసీదులో త్రిశూలం ఏం చేస్తున్నట్టు? మసీదులో త్రిశూలం ఉంది. జ్యోతిర్లింగం ఉంది. దేవుడి విగ్రహాలు ఉన్నాయి. వాటిని మేం పెట్టలేదు కదా? నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారమైతే.. ఈ పొరపాటును అంగీకరిస్తూ ముస్లిం వర్గాల నుంచే ప్రతిపాదన రావాల్సింది. చారిత్రక తప్పిదం చేశామని, తప్పును సరిదిద్దుకుంటామని వారే ముందుకు వచ్చి ఉండాల్సింది."
-యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్​ప్రదేశ్ సీఎం

'వాటిపై విపక్షాల మౌనమేల?'
Yogi Adityanath on India Alliance : విపక్ష కూటమి ఇండియాపైనా స్పందించారు యోగి. ఆ కూటమిని ఇండియా అని పిలవకూడదని అన్నారు. పేరు మార్చుకున్నంత మాత్రాన గతంలో చేసిన తప్పులు చెరిపివేసినట్లు కాదని హితవు పలికారు. బంగాల్​లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసను ఖండించారు.

"నేను ఆరేళ్లుగా ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా. 2017 నుంచి ఇక్కడ ఒక్క అల్లర్ల ఘటన కూడా జరగలేదు. యూపీలో పంచాయతీ, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలు ఎలా జరిగాయో చూడాలి. బంగాల్​లో ఏం జరిగిందో అంతా చూశాం. దేశవ్యాప్తంగా వారు (విపక్ష కూటమి) అలాగే జరగాలని అనుకుంటున్నారా? కొందరు బలవంతంగా అధికారంలోకి రావాలని అనుకుంటున్నాయి. విపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు ఎలా జరిగాయో బంగాల్​లో చూశాం. దీని గురించి ఎవరూ మాట్లాడరు. కశ్మీర్​లో 1990లో జరిగిన ఘటనల గురించి ఎందుకు మౌనంగా ఉంటారు? ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు?"
-యోగి ఆదిత్యనాథ్, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి

Gyanvapi Mosque case : జ్ఞానవాపి మసీదులో ఆర్కియలాజికల్ విభాగం ఆధ్వర్యంలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ఇటీవల వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది. వాజుఖానా మినహా మసీదు కాంప్లెక్స్​ను సర్వే చేయాలని నిర్దేశించింది. గతంలో ఆలయం ఉన్న చోట మసీదును నిర్మించారా లేదా అన్న విషయాన్ని తేల్చాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, సర్వేను అడ్డుకోవాలంటూ ముస్లిం వర్గాలు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. ఈ అంశంపై న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది. ఆగస్టు 3న ఈ నిర్ణయం వెలువడనుంది. అప్పటివరకు సర్వేపై స్టే కొనసాగనుంది.

అయితే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సమాజ్​వాదీ పార్టీ భిన్నస్వరం వినిపించింది. ప్రతి మసీదులో ఆలయాల కోసం వెతుకుతున్నట్లే.. ప్రతి మందిరంలో బౌద్ధ విహారాల ఆనవాళ్లు కోసం వెతకుతారా అని ప్రశ్నించింది. 'ఉత్తరాఖండ్​లోని బద్రీనాథ్, కేదర్​నాథ్, పూరిలోని జగన్నాథ మందిరం, కేరళలోని అయ్యప్ప దేవాలయం, మహారాష్ట్ర పండరీపుర్​లోని విఠోబా ఆలయాలన్నీ బౌద్ధ విహారాలే. ఈ విహారాలను ధ్వంసం చేసి హిందూ దేవాలయాలు నెలకొల్పారు. 18వ శతాబ్దం వరకు అక్కడ బౌద్ధ విహారాలే ఉన్నాయి. నా ఉద్దేశం ఆలయాలను తిరిగి బౌద్ధ విహారాలుగా మార్చాలని కాదు. ఆలయాల కోసం ప్రతి మసీదును వెతుకుతున్నట్లే.. ప్రతి మందిరంలో విహారాల కోసం ఎందుకు వెతకకూడదు?' అని ఎస్​పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.