ETV Bharat / bharat

భాజపా-ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ.. యూపీ తొలి దశలో హోరాహోరీ!

author img

By

Published : Feb 12, 2022, 9:57 AM IST

UP Elections
యూపీలో భాజపా-ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ.. తొలి దశలో హోరాహోరీ!

UP Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​లో అయిదేళ్ల క్రితం సాధించిన అపూర్వ విజయాన్ని కమలదళం పునరావృతం చేయడం కష్టసాధ్యంగా కనపడుతోంది. ఆ విషయాన్ని గమనించే కాబోలు- మిగిలిన ఆరు దశల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు, లఖింపుర్‌ ఖేరీలో రైతులపై వాహనాన్ని ఉరికించిన కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌కు బెయిల్‌ మంజూరైంది. భాజపాపై గుర్రుగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి ఆ పార్టీకి ఇది ఉపయోగపడవచ్చు.

UP Assembly polls: ఉత్తర్‌ ప్రదేశ్‌ తొలిదశ ఎన్నికల సరళిని పరిశీలిస్తే- భాజపా, సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొందని అర్థమవుతోంది. అయిదేళ్ల క్రితం సాధించిన అపూర్వ విజయాన్ని కమలదళం పునరావృతం చేయడం కష్టసాధ్యంగా కనపడుతోంది. ఆ విషయాన్ని గమనించే కాబోలు- మిగిలిన ఆరు దశల ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు, లఖింపుర్‌ ఖేరీలో రైతులపై వాహనాన్ని ఉరికించిన కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌కు బెయిల్‌ మంజూరైంది. భాజపాపై గుర్రుగా ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి ఆ పార్టీకి ఇది ఉపయోగపడవచ్చు. తొలిదశ ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర మంత్రి దినేష్‌ ఖటిక్‌ తాజాగా ఆరోపించడం అందరినీ విస్మయపరుస్తోంది. అధికారులు ఎస్‌పీతో చేతులు కలిపారని ఆయన విమర్శించారు.

క్రితం ఎన్నికల తొలిదశతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం తక్కువగా 60.17కు పరిమితం కావడం అధికారపక్షానికి ఆనందం కలిగించవచ్చు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంటే మార్పు కోరుతూ పోలింగ్‌ కేంద్రాలకు ప్రజలు ఎక్కువగా పోటెత్తుతారన్నది సాధారణ విశ్వాసం. ఎన్నికల రోజు (పదో తేదీన) ఆ వాతావరణం కనిపించలేదు. అలా అని క్షేత్రస్థాయిలో పరిస్థితులు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని భావించడానికీ లేదు. గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం చాలా ఎక్కువ. పట్టణ ఓటర్లలో తక్కువ మంది గురువారం తమ ఓటుహక్కును వినియోగించుకొన్నారు. నిరాసక్తతో ఏమోకానీ, పట్టణాల్లోని భాజపా మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రాలకు దూరంగా ఉన్నట్లు అవగతమవుతోంది. గత ఎన్నికల తొలిదశలో 58 స్థానాలకుగాను యాభైమూడింటిని భాజపా గెలుచుకొంది. ఎస్‌పీ, బీఎస్‌పీలతో పోలిస్తే కమలదళం ఆనాడు రెట్టింపు స్థాయిలో ఓట్లు సాధించింది. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తమకు పెట్టనికోటలవంటి మేరఠ్‌ కంటోన్మెంట్‌, ఆగ్రా తదితర స్థానాల్లో సైతం భాజపా అభ్యర్థులకు విజయం నల్లేరుపై బండినడక కాబోదని క్షేత్రస్థాయి నివేదికలు చాటుతున్నాయి. 2017 స్థాయిలో ఈసారి శాసనసభ స్థానాలను ఒడిసిపట్టడంపై భాజపా నాయకుల్లోనే అపనమ్మకం నెలకొంది. తొలిదశలో ఆ మేరకు నష్టం జరిగినట్లు కనపడుతున్న దృష్ట్యా, రెండో దశ ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.

UP Assembly Elections 20212

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అన్నదాతల ఆందోళనలు వంటి వివిధ కారణాల రీత్యా- గడచిన అయిదేళ్లలో రాష్ట్ర ఆర్థిక సామాజిక సమీకరణాల్లో చాలా మార్పులు వచ్చాయి. అధికార పీఠాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి ఎస్‌పీ అధినేత అఖిలేశ్‌ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముస్లిములకు ఆయన పెద్దగా టికెట్లు ఇవ్వలేదు. ముజఫర్‌నగర్‌, మేరఠ్‌ జిల్లాల్లోని నియోజవర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థినీ ఎస్‌పీ నిలబెట్టలేదు. స్థానికంగా శక్తిమంతులైన ఖదీర్‌ రాణా కుటుంబం (ముజఫర్‌నగర్‌), ఇమ్రాన్‌ మసూద్‌ (సహారన్‌పుర్‌) వంటి వివాదాస్పద నాయకవర్గానికి ఆ పార్టీ మొండిచెయ్యే చూపింది. హంగూ ఆర్భాటాలతో కూడిన రాజకీయాలకు పేరుపడ్డ యాదవ నేతలకూ ఆయన అంతగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. తత్ఫలితంగా ఎస్పీ అధికారంలోకి వస్తే గూండా, మాఫియా మూకలు మళ్ళీ పెత్తనం చలాయిస్తాయనే భాజపా విమర్శలు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపడంలేదనే వాదనలు ఉన్నాయి. తొమ్మిది జిల్లాల పరిధిలో 55 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఓటర్లలో ముస్లిముల సంఖ్య దాదాపు 27శాతం. రామ్‌పుర్‌, సహారన్‌పుర్‌ వంటి ప్రాంతాల్లోనైతే వారు 40శాతానికి పైగా ఉంటారు. దళితులు సైతం గణనీయంగా ఉన్నారు. పశ్చిమ యూపీలో బీఎస్‌పీకి మంచి పట్టుంది. 2017 భాజపా ప్రభంజనంలో సైతం ఆ పార్టీ ఇక్కడ ఇరవై స్థానాలు చేజిక్కించుకొంది. ప్రస్తుతం ముస్లిం-జాట్‌ కలయికపై ఎస్‌పీ ఆశలుపెట్టుకొంది. వాటిని వమ్ము చేయగల సామర్థ్యం మాయావతికి ఉంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే- అక్కడి పదహారు నియోజకవర్గాల్లో బీఎస్‌పీ ముస్లిం అభ్యర్థులను పోటీలో నిలిపింది. కొన్ని నియోజకవర్గాల్లో కమలదళం మినహా మిగిలిన పక్షాలన్నీ ఆ వర్గీయులకే టికెట్లు కేటాయించాయి. పరిస్థితులు ప్రతికూలంగా కనిపిస్తున్నా- పోరులో భాజపా బలంగానే ఉంది. ఎస్‌పీ కూటమి దాన్ని గట్టిగానే ఢీకొడుతున్నా- విజయం సాధించడానికి దాని ప్రయత్నాలు సరిపోతాయా అన్నదే ప్రశ్న! ప్రతిపక్షాల మధ్య చీలే ‘లౌకిక ఓట్లే’ రెండో దశ ఫలితాలను నిర్దేశిస్తాయని భాజపా భావిస్తోంది.

- శ్రీనంద్‌ ఝా

ఇదీ చూడండి: 'ఆయనకు పిల్లలు లేరు.. ఈయనకు ఉన్నా...'.. మోదీపై లాలూ సెటైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.