ETV Bharat / bharat

యూపీ తొలి విడత ఎన్నికలు పూర్తి- 5గంటల వరకు 57.79% పోలింగ్​

author img

By

Published : Feb 10, 2022, 6:46 AM IST

Updated : Feb 10, 2022, 6:06 PM IST

UP Election 2022 Live Updates
UP Election 2022 Live Updates

18:03 February 10

ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఈసీ అధికారులు ప్రకటించారు.

సార్వత్రిక సమరానికి సెమీ ఫైనల్​గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తర్​ప్రదేశ్​లోని 58 స్థానాలకు జరిగిన ఈ విడత పోలింగ్​లో ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.

ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. చాలా చోట్ల ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగింది. మధ్యాహ్నం 5 గంటల వరకు 57.79 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చినట్లు తెలిపారు. ఖైరానా అసెంబ్లీ నియోజకవర్గంలోని దుందుఖేడాలో పేద ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించలేదన్న సమాజ్​వాదీ పార్టీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరపాలని సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్​ను ఆదేశించినట్లు తెలిపారు.

'కావాలనే నెమ్మదిగా పోలింగ్'

మరోవైపు, ఏ నియోజకవర్గాల్లో ఈవీఎంలు పనిచేయలేదో గుర్తించి చర్యలు తీసుకోవాలన్ని ఎన్నికల సంఘాన్ని కోరారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. పోలింగ్​ను కావాలని నెమ్మదిగా సాగేలా చేశారని ఆరోపించారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. పారదర్శక ఓటింగ్ జరిగేలా చూడటం ఈసీ అతిపెద్ద బాధ్యత అని ట్వీట్ చేశారు.

ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చార్ ఖంబా పోలింగ్ స్టేషన్​లో బలరాం అనే వ్యక్తి వివాహ దుస్తుల్లో వచ్చి ఓటేశారు. పెళ్లి వేడుకలో భాగంగా జాట్ వర్గం ప్రజలు నిర్వహించుకునే 'గూడ్​చాది కార్యక్రమం' పూర్తి చేసుకున్న బలరాం.. ద్విచక్ర వాహనంపై వచ్చి ఓటు వేశారు.

బరిలో ఉన్న కీలక నేతలు

మొత్తంగా 623 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గార్గ్, చౌధురి లక్ష్మీ నరైన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్ జరిగింది.

గత ఎన్నికల్లో ఎవరిది పైచేయి?

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 58 సీట్లలో 53 భాజపా గెలుచుకుంది. సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు రెండేసి స్థానాలు కైవసం చేసుకున్నాయి. రాష్ట్రీయ లోక్​ దళ్ ఒక సీటుతో సరిపెట్టుకుంది.

15:56 February 10

3గంటల వరకు 48.24 శాతం పోలింగ్

యూపీలో మొదటి దఫా పోలింగ్​ ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 48.24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

13:45 February 10

ఒంటిగంట వరకు 35 శాతం పోలింగ్​..

యూపీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 35.03 శాతం ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

11:46 February 10

20 శాతం పోలింగ్​..

ఉదయం 11 గంటల వరకు ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 20.03 శాతం పోలింగ్​ జరిగింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

11:43 February 10

పెళ్లికి ముందు ఓటేసిన వరుడు..

మరికాసేపట్లో పెళ్లి అనగా ముజఫర్​నగర్​లోని ఓ పోలింగ్​ కేంద్రానికి.. ఓటేసేందుకు వచ్చాడు వరుడు. అందరూ అతడిని ఆశ్చర్యంగా చూశారు. ముందు ఓటు.. తర్వాతే పెళ్లి అని అతడు మీడియాతో చెప్పడం విశేషం.

11:06 February 10

ఆర్​ఎల్​డీ చీఫ్​ ఓటుకు దూరం..

ఆర్​ఎల్​డీ చీఫ్​ జయంత్​ ఛౌదరీ నేడు యూపీ ఎన్నికల్లో ఓటు వేయట్లేదని ఆయన కార్యాలయం వెల్లడించింది. మథురా ఓటరు అయిన ఆయన.. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండటమే కారణమని తెలిపింది.

10:07 February 10

8 శాతం పోలింగ్​..

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 7.95 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో పోలింగ్​ జరగనుండగా.. గురువారం తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో పశ్చిమ యూపీ 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఓటింగ్​ నిర్వహిస్తోంది ఈసీ.

07:58 February 10

యూపీ మంత్రి పూజలు..

ఉత్తర్​ప్రదేశ్​ మంత్రి, మథురా భాజపా అభ్యర్థి శ్రీకాంత్​ శర్మ.. స్థానిక గోవర్ధన్​ ఆలయంలో పూజలు నిర్వహించారు.

07:57 February 10

చలిలోనూ..

అసెంబ్లీ ఎన్నికల వేళ.. తెల్లవారుజామున చలిని లెక్కచేయకుండా పోలింగ్​ కేంద్రాల ముందు ఓటర్లు బారులుతీరారు.

07:35 February 10

ఓటేసిన మంత్రి..

ఉత్తర్​ప్రదేశ్​ మంత్రి అతుల్​ గార్గ్​.. గాజియాబాద్​ కావీ నగర్​లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

07:13 February 10

UP polling begins: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. అన్ని చోట్లా ప్రశాంతంగా పోలింగ్​ ప్రారంభమైంది.

07:05 February 10

మోదీ ట్వీట్​..

యూపీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ఓటర్లు ఉత్సాహంగా ఎన్నికల పండగలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థించారు.

07:01 February 10

పోలింగ్​ ప్రారంభం..

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్​ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాల ముందు బారులుతీరారు.

06:23 February 10

UP Election 2022: యూపీ మహాసంగ్రామం- తొలి దశ పోలింగ్​ ప్రారంభం

UP Election 2022 Live Updates: ఉత్తర్​ప్రదేశ్​లో తొలి విడత పోలింగ్​కు రంగం సిద్ధమైంది. యూపీ మహాసంగ్రామంలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి.

2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

ప్రత్యేక జాగ్రత్తల నడుమ..

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం​ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. పోలింగ్ కేంద్రాల వద్ద 50 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని మోహరించింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని మొత్తం 403 అసెంబ్లీస్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

జాట్​లే అధికం..

తొలిదశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో జాట్​ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. తొలి దశ ఎన్నికలు జరిగే ఈ జిల్లాల్లోనే రైతులు ఉద్యమాన్ని చేపట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. దీంతో ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

ఇవీ చూడండి: 'ఐదు రాష్ట్రాల్లో మాదే విజయం.. ఎక్కడ చూసినా ప్రభుత్వ సానుకూలతే!"

'యువతకు 50వేల ఉద్యోగాలు .. రైతులకు కనీస మద్దతు ధర'

యూపీ తొలి దశ పోలింగ్​లో వారి ఓట్లే కీలకం

Last Updated : Feb 10, 2022, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.