ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌ ఖాతా​ బ్లూటిక్​ తొలగింపు.. ప్రత్యక్షం!

author img

By

Published : Jun 5, 2021, 9:33 PM IST

SS chief Mohan Bhagwat
ఆర్​ఎస్​ఎస్​ చీఫ్‌

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖాతా 'బ్లూ టిక్​'ను ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్​ తొలగించి.. పునరుద్ధరించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖాతాకు సంబంధించిన వివాదం సమసిపోక ముందే.. ట్విట్టర్ చేపట్టిన ఈ చర్యతో కేంద్రం-ట్విట్టర్​ మధ్య దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశంలో ట్విట్టర్‌ బ్లూ టిక్‌ వివాదం కొనసాగుతోంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాకు బ్లూ టిక్‌ను తొలగించి కాసేపటికే పునరుద్ధరించింది ట్విట్టర్‌. అలాగే ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ట్విట్టర్‌ ఖాతాకు సైతం బ్లూ టిక్​ను తొలగించి, పునరుద్ధరించి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బ్లూటిక్‌ను పునరుద్ధరించినప్పటికీ.. ఈ వ్యవహారంతో కేంద్రం-ట్విట్టర్​ మధ్య దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భాగవత్‌తో పాటు ఆరెస్సెస్‌ నేతలు సురేష్‌ సోనీ, అరుణ్‌ కుమార్‌, సురేష్‌ జోషి, కృష్ణ కుమార్‌ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలకు బ్లూటిక్‌ తొలగించి పునరుద్ధరించింది.

'ఆ కారణంతోనే..'

ఆరు నెలల పాటు ఇనాక్టివేట్‌గా ఉన్న ఖాతాలకు బ్లూ టిక్‌ను తొలగిస్తున్నట్లు ట్విట్టర్‌ పేర్కొంటోంది. అయితే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి(ఉపరాష్ట్రపతి) ఖాతాను తొలగించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయం నుంచి అభ్యంతరం వ్యక్తమవ్వడంతో కాసేపటికే పునరుద్ధరించింది. ఈ క్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ భాగవత్‌ సహా తదితరుల ఖాతాలను ట్విట్టర్‌ తొలగించింది. దీనిపై నెటిజన్లు, ఆరెస్సెస్‌ వర్గాల నుంచి ట్విట్టర్​లో విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాన్‌ ట్విట్టర్‌ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు వచ్చాయి. ఈ క్రమంలో ట్విట్టర్‌ వారి బ్లూటిక్‌ను పునరుద్ధరించింది.

పెరగనున్న దూరం..?

భాగవత్‌కు ట్విట్టర్‌లో సుమారు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఆయన నుంచి ఒక్క ట్వీట్‌ కూడా లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 2019లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రులు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ ఖాతాలకు ఇప్పటికీ ట్విట్టర్‌ బ్లూ టిక్‌ కొనసాగిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. అయితే, సుష్మా స్వరాజ్‌ ఖాతాను ఆమె భర్త కౌశల్‌ స్వరాజ్‌ నేటికీ కొనసాగిస్తున్నారు. కొత్త ఐటీ చట్టం నిబంధనలు, టూల్‌కిట్‌ వ్యవహారంలో కేంద్రం, ట్విట్టర్‌ మధ్య ఏర్పడిన దూరం బ్లూటిక్‌ వ్యవహారంతో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి: వెంకయ్య నాయుడు ఖాతాపై ట్విట్టర్​ తికమక

Twitter: 'ఐటీ నియమాలను ట్విట్టర్​ పాటించదా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.