ETV Bharat / bharat

'వారు పాకిస్థాన్​లో కంటే భారత్​లోనే బాగున్నారు'.. పాశ్చాత్య మీడియాపై నిర్మల ఫైర్​​

author img

By

Published : Apr 11, 2023, 11:07 AM IST

Updated : Apr 11, 2023, 12:22 PM IST

nirmala sitharaman
nirmala sitharaman

భారత్​లో ముస్లిం మైనార్టీలపై హింస జరుగుతోందంటూ పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. పాకిస్థాన్ కంటే భారత్​లోనే ముస్లింల జీవనం మెరుగ్గా ఉందన్నారు సీతారామన్​. మైనారిటీ సమస్యలపై భారత్​ను నిందించే వారికి అసలు వాస్తవాలపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు.

భారత్​లో ముస్లిం మైనార్టీలపై హింస జరుగుతోందంటూ పశ్చిమ దేశాల్లో వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ప్రపంచంలోనే ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్​ది రెండో స్థానమని ఆమె అన్నారు. పాకిస్థాన్ కంటే భారత్​లోనే ముస్లింల జీవనం మెరుగ్గా ఉందన్నారు నిర్మలా సీతారామన్​. మైనారిటీ సమస్యలపై భారత్​ను నిందించే వారికి అసలు వాస్తవాలపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు. అమెరికా.. వాషింగ్టన్​లో పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

'ముస్లింలపై భారత్​లో అణిచివేత జరుగుతుందనేది అవాస్తవం. వాస్తవ పరిస్థితులు ఏమాత్రం తెలుసుకోకుండా ఇలా దేశాన్ని నిందించడం సరికాదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్‌. వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. వారి జీవితాలు కష్టంగా ఉంటే.. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే 1947 నాటి కంటే వారి జనాభా ఇంత పెరగగలదా? ఆనాడు ఇస్లామిక్‌ దేశంగా ఏర్పడిన పాకిస్థాన్‌లో ప్రస్తుతం మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వారి సంఖ్య నానాటికీ పడిపోతోంది. కానీ, భారత్​లో ఆ పరిస్థితి లేదు. భారత్​లో శాంతి భద్రతలనేది దేశం మొత్తానికి సంబంధించిన అంశం. భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. భారత్​లో ముస్లిం మైనార్టీలపై హింస జరుగుతోందని వార్తలు రాసిన వారు మా దేశానికి రావాలి. దేశమంతా ఒంటరిగా తిరిగి తమ ఆరోపణలను రుజువు చేయాలి. "

--నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

పాకిస్థాన్​లో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. అక్కడ మైనార్టీలు రోజురోజుకు తగ్గిపోతున్నారని ఆరోపించారు. పాక్​లో మైనారిటీలపై చిన్న చిన్న ఆరోపణలపై కేసులు పెట్టడం, మరణిశిక్షలు కూడా వేస్తున్నారని అన్నారు. భారత్​లో ముస్లింలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీతారామన్​ చెప్పారు.

'భారత్​లో పెట్టుబడులు పెట్టండి'
భారత్​లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా వ్యాపారవేత్తలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. భారత్​ న్యాయమైన, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తీరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఆ దేశ అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. భారత్​ పెట్టుబడులకు అనుకూలంగా ఉందని సీతారామన్ తెలిపారు.

Last Updated :Apr 11, 2023, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.