ETV Bharat / bharat

TDP Released Statement on CID Allegations in Skill Development Case: సీఐడీ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన టీడీపీ

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2023, 9:01 AM IST

Updated : Sep 12, 2023, 1:11 PM IST

TDP Released Statement on CID Allegations in Skill Development Case: సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ మదింపు చేయకుండా నిధుల దుర్వినియోగమని ఎలా అంటారంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసుపై వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రశ్నించింది. నైపుణ్య కేంద్రాలను సందర్శించలేదని సీఐడీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సంస్థే నివేదికలో తెలిపిందని గుర్తు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థను నెలకొల్పినా ప్రత్యేకశాఖ ఏర్పాటుచేసినా, అధికారుల పర్యవేక్షణలోనే జరుగుతాయని తేల్చి చెప్పింది. విధాన నిర్ణయాలు మాత్రమే మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తారన్నా తెలుగుదేశం, కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి.. ఒప్పందాన్ని ఆమోదించిన అజేయ కల్లం పేర్లు FIRలో ఎందుకు లేవని నిలదీసింది. 42 శిక్షణ కేంద్రాలు పెట్టి 2.13లక్షల మందికి శిక్షణ ఇస్తే ఇందులో కుంభకోణం ఎక్కడిదంది. క్లస్టర్‌కు 550 కోట్లు ఖర్చవుతుందని.. కేంద్ర ప్రభుత్వ సంస్థ నిర్ధారించిందంటూ సీఐడీ ఆరోపణలకు తెలుగుదేశం ఒక ప్రకటన విడుదల చేసింది.

cid_charges_in_skill_development_case
cid_charges_in_skill_development_case

TDP Released Statement on CID Allegations in Skill Development Case: సీఐడీ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన టీడీపీ

TDP Released Statement on CID Allegations in Skill Development Case: రాష్ట్రంలో 42 నైపుణ్య శిక్షణ కేంద్రాలను(Skill Development Case) ఏర్పాటు చేసి 2లక్షల 13వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. 75వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే ఇందులో కుంభకోణం ఎక్కడ ఉందని తెలుగుదేశం ప్రశ్నించింది. సీఐడీ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇచ్చింది. 3,281 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో.. 90శాతం విలువకు సాఫ్ట్‌వేర్‌ను సీమెన్స్‌ సంస్థ అందిస్తుంది. 10శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసి, శిక్షణ కార్యక్రమాలకు సహాయ పడుతుంది. ఒక క్లస్టర్‌ విలువ 550 కోట్లు.

6 క్లస్టర్లు కలిపి 3,300 కోట్లు. ఇందులో రాష్ట్రవాటా 330కోట్లు. జీఎస్టీ 40 కోట్లతో కలిపి 370 కోట్లు. అప్పటి నైపుణ్యావృద్ధి శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి.. సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ సంస్థకి 30 లక్షల కన్సల్టెన్సీ ఫీజు ఇచ్చి, ఒక క్లస్టర్‌ నెలకొల్పడానికి అయ్యే ఖర్చు 550 కోట్లని నిర్ధరించుకుని నిధులు విడుదల చేశారు. 330 కోట్లలో 95-97శాతం రాయితీతో సీమెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను డిజైన్‌టెక్‌ కొనుగోలు చేసింది. దీనికి 70కోట్లు చెల్లించారని సీమెన్స్‌ అంగీకరించింది. 46 శిక్షణ కేంద్రాలను నెలకొల్పి, వాటిలో కంప్యూటర్లు, పరికరాలు, శిక్షకులు, శిక్షణ ఖర్చును ఐచ్చి నాలుగేళ్లపాటు నిర్వహించి, 2.13లక్షల మందికి శిక్షణ, 75వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంత ప్రయోజనం జరిగాక ఇందులో రూ.వందల కోట్ల కుంభకోణం అనడమంటే రాజకీయం కాక మరేంటని టీడీపీ నిలదీసింది.

ఇచ్చిన జీవోలకు, కుదుర్చుకున్న ఒప్పందాలకు పొంతన లేకుండా ప్రజాధనం దోచేశారన్న సీఐడీ(CID) ఆరోపణలకు తెలుగుదేశం సమాధానం ఇచ్చింది. ఏ రాష్ట్రంలోనైనా ప్రాజెక్టు వ్యయంలో 90శాతం విలువకు సమానమైన సాఫ్ట్‌వేర్‌ను లాభాపేక్ష లేని సంస్థలకు సీమెన్స్‌ సరఫరా చేస్తుంది. తన సాఫ్ట్‌వేర్‌ అమ్మకాలను పెంచుకోవడానికి అనేక దేశాలు, రాష్ట్రాలలో ఈ కార్యక్రమం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లోలాగే ఏపీలోనూ ఇదే జరిగింది. ఏమీ లేకుండానే ఏదో జరిగిందంటూ విపరీత భాష్యాలు చెప్పి, కొందరు అధికారులతో బలవంతంగా స్టేట్‌మెంట్లను ఇప్పించి, దీనిపై వ్యాఖ్యానాలు చేయడం హాస్యాస్పదమని తెలుగుదేశం పేర్కొంది.

Chandrababu Case Arguments in ACB Court: పోలీసులు నన్ను మానసికంగా వేధించారు.. వాహనంలో తిప్పుతూనే ఉన్నారు

TDP Questioned YCP Govt on Skill Development Case: ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు 241కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయన్న సీఐడీ ఆరోపణలనూ తెలుగుదేశం తిప్పికొట్టింది. పన్నుల వసూళ్లు, పన్ను ఎగవేతలే జీఎస్టీ(GST) ఇంటెలిజెన్స్‌ పరిధిలోకి వస్తాయి. నిధుల దుర్వినియోగం, స్వాహాలపై వారు దర్యాప్తు చేయరు. జరిగిందేమిటంటే డిజైన్‌టెక్‌ సంస్థ శిక్షణ కేంద్రాలను నెలకొల్పడానికి కావాల్సిన కంప్యూటర్లు, టీచింగ్‌ మెటీరియల్‌ కొనుగోలు చేసింది. అందులో కొన్ని సంస్థలు జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డాయని ఆ సంస్థలకు నోటీసులు ఇచ్చి, విచారణ జరిపారు. ఆ విచారణకు, ప్రాజెక్టుకు సంబంధం లేదు. ఒప్పందం ప్రకారం 42 కేంద్రాలకు రావాల్సిన సాఫ్ట్‌వేర్, హార్ట్‌వేర్, ఇతర పరికరాలు అందాయని 2020 ఫిబ్రవరిలో ప్రతి శిక్షణ సంస్థ సర్టిఫికెట్‌ను డిజైన్‌టెక్‌కు ఇచ్చాయి. దీని ఆధారంగా అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ ఆర్జా శ్రీకాంత్‌ వారికి అభినందన పత్రం కూడా ఇచ్చారు. ఇంతకంటే నిర్ధారణ ఏం కావాలని తెలుగుదేశం ప్రశ్నించింది.

ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ సంస్థ అనేక మందిని అరెస్టుచేసి, కస్టడీలో విచారించిందని భాస్కర్‌ ప్రసాద్‌ ముందస్తు బెయిల్‌ దరఖాస్తును హైకోర్టు తిరస్కరించిందని.. దీని ఆధారంగా సీఐడీ విచారణ గొప్పగా ఉందని చెప్పవచ్చన్న ప్రశ్నకు తెలుగుదేశం సమాధానం ఇచ్చింది. 2021 డిసెంబరు తర్వాత 28మందిని అరెస్టు చేసిన సీఐడీ(CID) చంద్రబాబు నేరం చేశారని రాసిస్తే ఏం కావాలన్నా ఇస్తామని, లేదంటే జైళ్లలోనే మగ్గాలని బెదిరించారని టీడీపీ ఆరోపించింది. అయితే అరెస్టు చేసిన అందరికీ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. భాస్కర్‌ ప్రసాద్‌ విషయంలో మేజిస్ట్రేట్‌ కోర్టు రిమాండ్‌ ఉత్తర్వులను తిరస్కరించింది. ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసినప్పుడు అలాంటి భయాలు అక్కర్లేదని కొట్టేసింది. దీన్ని సీఐడీ వక్రీకరిస్తోందని టీడీపీ స్పష్టం చేసింది.

Deaths in State Due to TDP Chief Chandrababu Remand: చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ తట్టుకోలేక.. గుండెపోటుతో పలువురు మృతి

TDP Denied CID Allegations: ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికలో 241 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని, బోగస్‌ ఇన్వాయిస్‌ల ద్వారా నిధులను దోచేసినట్లు బయటపడిందన్న సీఐడీ ఆరోపణలను తెలుగుదేశం ఖండించింది. పనికిరాని సంస్థకు డబ్బులిచ్చి నివేదిక తీసుకుని దానికి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ అని పేరుపెట్టడం హాస్యాస్పదమని టీడీపీ వివరించింది. ఈ రిపోర్టు మొదటి పేజీలో ప్రాజెక్టు కింద నెలకొల్పిన 42 కేంద్రాలను సందర్శించలేదని అక్కడ నెలకొల్పిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ పరికరాల విలువను వెలకట్టడానికి అనుమతి ఇవ్వలేదని పేర్కొన్న విషయాన్ని టీడీపీ గుర్తు చేసింది. ఆస్తుల మదింపు చేయకుండా నిధుల దుర్వినియోగం అని మాట్లాడడం ఆ సంస్థ పనికిరానితనానికి అద్దం పడుతుందని సమాధానం ఇచ్చింది.

నైపుణ్యాభివృద్ధి సంస్థ నెలకొల్పినా.. ప్రత్యేక శాఖ ఏర్పాటుచేసినా అన్ని విషయాలు అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతాయని తెలుగుదేశం స్పష్టం చేసింది. విధాన నిర్ణయాలే మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తారని అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి పీవీ రమేశ్‌ సీఐడీకి ఇచ్చిన సమాధానంలో తనకంటే ముందు ఆర్థికశాఖ కార్యదర్శిగా చేసిన అజేయ కల్లం ఈ ఒప్పందాలు ఆమోదించడంలో కీలకపాత్ర వహించినట్లు చెప్పిన విషయాన్ని టీడీపీ గుర్తుచేసింది. ఒప్పందాల అమలు, పర్యవేక్షణలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడంలో అప్పటి కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని, దానికి ఆయనే బాధ్యత వహించాలని లిఖితపూర్వకంగా సీఐడీకి పీవీ రమేశ్‌ తెలిపిన విషయాన్ని తెలుగుదేశం ప్రస్తావించింది.

Protest in America Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలో కొవ్వొత్తుల ప్రదర్శన..

TDP Reaction on CID Allegations: గతంలో జీఓ-8 నోట్‌ఫైల్‌ పోయిందని ఇప్పుడు జీఓ-4 నోట్‌ఫైల్‌ పోయిందంటూ చెప్పడం బుకాయింపేనని టీడీపీ పేర్కొంది. అవి ఇచ్చిన అధికారులు అందుబాటులోనే ఉన్నారని ఏం అడిగినా చెబుతారని ఎందుకు తీసుకోవట్లేదని తెలుగుదేశం నిలదీసింది. అచ్చెన్నాయుడిని ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని.. మంత్రిగా కేబినెట్‌ ఆమోదం పొందిన ఒప్పందానికి తన సిఫార్సును జతచేస్తూ సీఎంకు ఫైలు పంపడం మినహా ఈ ప్రాజెక్టులో ఆయన ప్రమేయం ఏమీ లేదని తెలుగుదేశం వెల్లడించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకోలేదని నిధులు విడుదల చేయలేదని ఆర్థికశాఖ కార్యదర్శి సునీత చెప్పిన సలహాలు పాటించలేదని తెలిపింది. ఇవన్నీ పాటించాల్సిన బాధ్యత అప్పటి నైపుణ్యశాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, ఆయన పేరుతో ఒప్పందాన్ని ఆమోదించిన అజేయ కల్లం పేరు ఏఫ్ఐఆర్(FIR)లో లేకపోవడం ఈ శతాబ్దపు మరో వింత అని తెలుగుదేశం వ్యాఖ్యానించింది.

అప్పటికే గుజరాత్‌లో ఆరు క్లస్టర్లను విజయవంతంగా అమలు చేశారని, దాన్ని వెంటనే అమలుచేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి సునీత, ప్రేమచంద్రారెడ్డి గుజరాత్‌లో పర్యటించి.. 2015 నవంబరు 9న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం నిజం కాదా అని తెలుగుదేశం నిలదీసింది. ఆరోపించిన సొమ్ము ఎవరికి, ఎలా చేరిందో ఒక్క ముక్క కూడా లేదు. అడిగితే ఇప్పుడు దాన్ని విచారిస్తామని సీఐడీ చెప్పడం హాస్యాస్పదమని తెలుగుదేశం తెలిపింది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రైవేటు సైన్యంగా వాడుకుంటారని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన ఆధారం అక్కర్లేదని తెలుగుదేశం వ్యాఖ్యానించింది.

చంద్రబాబుది నేరపూరిత స్వభావమన్న సీఐడీ ఆరోపణలపై తెలుగుదేశం ఘాటుగా సమాధానం ఇచ్చింది. సొంత బాబాయిని గొడ్డలితో తెగనరికి, ఆ నిందితుల కోసం కేంద్రప్రభుత్వ పెద్దలతో బేరసారాలకు దిగి రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టిన పార్టీకి లొంగిన సీఐడీ నుంచి ఇంతకంటే చౌకబారు ఆరోపణలు ఆశించలేమని తెలుగుదేశం సమాధానం ఇచ్చింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లు, రాజధాని మాస్టర్‌ప్లాన్‌ వీటన్నింటిలోనూ చంద్రబాబు పాత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం స్పష్టం చేసింది. 43వేల కోట్ల కుంభకోణంలో 17 ఛార్జిషీట్లు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఒత్తిడితో చేస్తున్న పసలేని ఆరోపణలు ప్రజలు అర్థం చేసుకుంటారని తెలుగుదేశం సమాధానం ఇచ్చింది.

Last Updated : Sep 12, 2023, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.