ETV Bharat / bharat

అదానీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

author img

By

Published : Feb 10, 2023, 5:00 PM IST

Updated : Feb 10, 2023, 7:22 PM IST

supreme court hearing on adani case
అదానీ గ్రూప్​పై హిండెన్​బర్గ్ నివేదిక

అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై కేంద్రం, సెబీ అభిప్రాయాలను సుప్రీంకోర్టు కోరింది. స్టాక్​ మార్కెట్‌లో భారత మదుపర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా పటిష్ఠమైన యంత్రాంగం ఉండాలని అభిప్రాయపడింది. అదానీ-హిండెన్​బర్గ్ వ్యవహరంపై దాఖలైన పిటిషన్​లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

దేశవ్యాప్తంగా దుమారం రేపిన అదానీ-హిండెన్​బర్గ్ వ్యవహారంలో కేంద్రం, సెబీ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టాక్​ మార్కెట్​లో భారత మదుపర్ల పెట్టుబడులను పరిరక్షించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఫిబ్రవరి 13 నాటికి సెబీ ప్రతిస్పందనను కోరింది. ప్రస్తుతం అవలంబిస్తున్న పద్ధతులు, భవిష్యత్తులో మదుపర్లకు ఎలాంటి రక్షణ ఉంటుందో తెలియజేయాలని ధర్మాసనం సెబీని ఆదేశించింది.

అదానీ-హిండెన్​బర్గ్ వివాదంపై దాఖలైన రెండు పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నాయమూర్తులు జస్టిస్ పీఎన్​ నరసింహ, జస్టిస్ జేబి పార్ధివాలాతో కూడిన సీజేఐ ధర్మాసనం.. నిపుణులు, ఇతరులతో కూడిన ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. పెట్టుబడిదారులను రక్షించడానికి పటిష్ఠమైన పద్ధతులను అవలంబించాలని నిర్దేశించింది. సెబీ తరపున కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్.. మార్కెట్ రెగ్యులేటర్, ఇతర చట్టబద్ధమైన సంస్థలు అవసరమైన చర్యలన్నీ చేపడుతున్నారని నివేదించారు.

అదానీ గ్రూప్​పై హిండెన్​బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని కోరుతూ న్యాయవాది విశాల్ తివారీ ఓ పిటిషన్​ దాఖలు చేశారు. న్యాయవాది ఎంఎల్​ శర్మ ఇదే తరహాలో మరో పిల్ వేశారు. అదానీ షేర్లు కృత్రిమంగా పతనమయ్యేందుకు హిండెన్​బర్గ్​ కుట్ర పన్నిందని, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ రెండు పిల్​లపై సెబీ, కేంద్రానికి కొన్ని ఆదేశాలను జారీ చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.

అదానీ కంపెనీల రేటింగ్ తగ్గించిన మూడీస్​..
అమెరికాకు చెందిన షార్ట్​ సెల్లర్​ హిండెన్​బర్గ్​ రీసెర్చ్ అదానీ గ్రూప్​పై తన నివేదిక విడుదల చేసిన తర్వాత.. ఆ సంస్థ​ మార్కెట్​ విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంతో ప్రముఖ రేటింగ్​ సంస్థ మూడీస్​​ శుక్రవారం అదానీకి చెందిన నాలుగు కంపెనీల రేటింగ్​ అవుట్​లుక్​లను తగ్గించింది. అదానీ గ్రీన్​ ఎనర్జీ లిమిటెడ్​, అదానీ గ్రీన్​ ఎనర్జీ రిస్ట్రిక్టెడ్​ గ్రూప్​, అదానీ ట్రాన్స్​మిషన్​ స్టెప్-​వన్​ లిమిటెడ్​, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్​ కంపెనీల రేటింగ్​ను స్టేబుల్​ నుంచి నెగెటివ్​కు మార్చింది.

Last Updated :Feb 10, 2023, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.