ETV Bharat / bharat

'ప్రజా సమస్యలు గాలికి... ఉగ్రవాదం నెత్తికి'

author img

By

Published : Feb 23, 2022, 5:27 PM IST

Priyanka Gandhi
ప్రియాంక గాంధీ

Congress in up elections: ఉత్తర్​ప్రదేశ్​లో ప్రజా సమస్యలపై ఎస్​పీ, భాజపా చర్చించడం లేదని కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేలా.. తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.

Congress in up elections: భాజపా, సమాజ్​వాదీ పార్టీ సామాన్యులకు అవసరమైన వాటిపై మాట్లాడకుండా.. ఉగ్రవాదం గురించి ప్రసంగాలు ఇస్తున్నాయని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మహిళా సాధికారత, చిన్న వ్యాపారులకు, రైతులకు ఆర్థికసాయం లాంటి అంశాలపై చర్చించడం లేదని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు దృష్టి మళ్లించేందుకు తీవ్రవాదం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖిలో తెలిపారు. మహిళా సమస్యలను కాంగ్రెస్​ పార్టీ ప్రస్తావించిన తరువాతే ఇతర పార్టీలు వారి ఇబ్బందులుపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు.

"ఈ ఎన్నికల్లో ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం తగ్గింపు, ఉపాధి, మహిళా సాధికారత, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు మద్దతుగా నిలవడం, రైతులకు కనీస మద్దతు ధర లాంటి వాటిపై ఎస్​పీ, భాజపా చర్చించడం లేదు. వాటిని పక్కదారి పట్టించి.. ఉగ్రవాదంపై చర్చిస్తున్నారు."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి

పశువులను విచ్చలవిడిగా వదిలేయడంపై ప్రధాని రాజకీయం చేస్తున్నారని ప్రియాంక ఆరోపించారు. గత ఎన్నికల అప్పుడే తాము ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు.

"మేము 2019 నుంచి విచ్చలవిడిగా వదిలేసిన పశువుల సమస్యను లేవనెత్తుతున్నాము. దానికి సంబంధించిన మా మేనిఫెస్టోలో నష్టపరిహారం కూడా ప్రకటించాము. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి ఇదో పెద్ద సమస్యగా మాట్లాడుతున్నారు. ఉత్తరభారత దేశంలోని చాలా ప్రాంతాల్లో దీని వల్ల చాలా నష్టం జరిగింది. అయితే ప్రధానికి ఇప్పుడే ఇది కనిపించిందా?"

- ప్రియాంక గాంధీ

ఉగ్రవాదంపై లెక్చర్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బిజీగా ఉన్నారని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఆయనకు పర్సంటేజీల్లో మాట్లాడటం ఇష్టం అని విమర్శించారు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత శాతం ఉన్నారనే దానిపైనా మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రికి కూడా నాలుగోదశ ఎన్నికల సమయంలోనే పశువుల సమస్య గుర్తుకు వచ్చిందా అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో 80-20 శాతం అంటూ యోగి ఆదిత్యనాథ్​ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆమె.. ఇది హిందూ, ముస్లిం జనాభాను సూచించేదిలా ఉందని అన్నారు.

"ఎన్నికల ప్రకటన వరకు ఎస్​పీ, బీఎస్​పీ ఏ అంశాలపై కూడా మాట్లాడలేదు. మేము మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నాం. విద్యా, ఆరోగ్యం, అభివృద్ధి, నిరుద్యోగంపై పోరాడుతూనే ఉన్నాం. రాష్ట్ర రాజకీయాలకు మార్పు అవసరం. దానికి నాయకత్వం వహించేందుకు కాంగ్రెస్‌ తన స్థానానికి కట్టుబడి ఉంది."

- ప్రియాంక గాంధీ

మహిళల నుంచి మద్దతు..

తమ ఎన్నికల ప్రచారానికి మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. క్షేత్ర స్థాయిలో వారి నుంచి తగినంత మద్దతు ఉందన్నారు. రాజకీయాల్లో మహిళలకు పూర్తి ప్రాతినిధ్యం కల్పించాలని వారు భావిస్తున్నారని తెలిపారు. అందుకే మహిళా సాధికారతకు మద్దతు ఇచ్చే పార్టీలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఎస్​పీ, బీఎస్​పీలు మహిళల విషయంలో తమ పార్టీ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేసినట్లు విమర్శించారు.

ఇదీ చూడండి:

'దావూద్​' కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.