ETV Bharat / bharat

Same Sex Marriage Supreme Court Verdict : స్వలింగ వివాహాల చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నిరాకరణ

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 11:44 AM IST

Updated : Oct 17, 2023, 1:53 PM IST

Same Sex Marriage Supreme Court Verdict
Same Sex Marriage Supreme Court Verdict

Same Sex Marriage Supreme Court Verdict : స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వీరు సహ జీవనంలో ఉండొచ్చని స్పష్టం చేసింది.

Same Sex Marriage Supreme Court Verdict : స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్దత కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కుల హక్కుల కల్పనకు, వాటిని పరిరక్షించేందుకు.. ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. స్వలింగ వివాహాలను గుర్తించని ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టాన్ని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజార్టీతో తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని.. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేదు. స్వలింగ వివాహానికి చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై నాలుగు వేర్వేరు తీర్పులను వెలువరించింది అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. CJIతో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్ నరసింహ వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. జస్టిస్ జస్టిస్‌ రవీంద్ర భట్‌ వెలువరించిన తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ హిమ కోహ్లీ చెప్పారు.

  • VIDEO | Chief Justice of India DY Chandrachud-led five-judge Supreme Court bench delivers verdict on a clutch of petitions seeking legal validation of same-sex marriage. (n/1)

    (Source: Third Party) pic.twitter.com/KYZWhbrCCy

    — Press Trust of India (@PTI_News) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముగ్గురు నో.. ఇద్దరు ఓకే
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​ తీర్పు ఇవ్వగా.. జస్టిస్​ ఎస్​కే కౌల్​ సమర్థించారు. అయితే, సీజేఐ ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలను సమర్థించిన జస్టిస్ రవీంద్ర భట్.. ఆ తీర్పుతో విభేదించారు. జస్టిస్​ భట్ ఇచ్చిన తీర్పుతో ఏకీభవించారు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్​ పీఎస్​ నరసింహా. ఫలితంగా 3:2 మెజార్టీతో పిటిషన్లను కొట్టివేసింది.

'వారికి చట్టాన్ని తీసుకురాకపోతే మనం మళ్లీ స్వాతంత్ర్యానికి పూర్వపు స్థితికి'
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పనపై తీర్పు వెలువరించే సందర్భంగా CJI జస్టిస్‌ చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్ర్యానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని జస్టిస్‌ డి. వై. చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేక వివాహ చట్టం మార్చడం పార్లమెంట్‌ విధి అని.. కోర్టు ఆ చట్టాన్ని రూపొందించదని స్పష్టం చేశారు. న్యాయస్థానం చట్టాన్ని రూపొందించదని.. కానీ దాన్ని అర్థం చేసుకోగలదని, అమలును పర్యవేక్షించగలదని అన్నారు. వివాహ వ్యవస్థ అనేది స్థిరమైనదని.. దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బెంచ్‌లోని నలుగురు న్యాయమూర్తులు సమర్థించారు.

  • "There is no unqualified right to marriage except as it recognised under the law. Conferring legal status to civil union can only be through enacted law. Transsexual persons in homosexual relationships have the right to marry" says the Supreme Court on same-sex marriage pic.twitter.com/o1M9AqHrSF

    — ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Same Sex Marriage Judgment : ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని CJI తెలిపారు. స్వలింగ సంపర్కులపై వివక్ష చూపరాదని.. అందరినీ సమానంగా చూడాలని జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా ఆ వ్యక్తికే ఉంటుందని స్పష్టం చేశారు. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. స్వలింగ సంపర్కుల సమూహంలోని వ్యక్తుల హక్కులు నిర్ణయించడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటనను కోర్టు రికార్డ్ చేసిందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. స్వలింగ సంపర్క హక్కులపై ప్రజలను చైతన్యవంతులను చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను ఆదేశించారు. అర్థం చేసుకోలేని వయస్సులో లింగమార్పిడి కార్యకలాపాలను అనుమతించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

  • Marriage equality case | "Conferring legal status to civil union to queer people can only be through enacted law but these findings will not preclude the right of queer persons to enter into relationships," says Justice Bhat. pic.twitter.com/vwTztDpHWG

    — ANI (@ANI) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Same Sex Marriage Verdict : అయితే, సీజేఐ జస్టిస్‌ డి. వై. చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పుతో కొన్ని అంశాలను సమర్థిస్తున్నట్లు.. మరికొన్నింటితో విభేదిస్తున్నట్లు జస్టిస్‌ రవీంద్ర భట్‌ తెలిపారు. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకునే అంశంపై CJI జస్టిస్‌ చంద్రచూడ్‌ ఇచ్చిన తీర్పుతో జస్టిస్‌ రవీంద్ర భట్ విభేదించారు. స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకునే హక్కుపై జస్టిస్ చంద్రచూడ్‌ చేసిన వ్యాఖ్యలపై జస్టిస్‌ రవీంద్ర భట్ కొన్ని అభ్యంతరాలు తెలిపారు. దీంతో స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడంపై ఎలాంటి స్పష్టత రాలేదు. స్వలింగ జంటలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కలిసి జీవించే హక్కు ఉందని జస్టిస్‌ భట్‌ తన తీర్పులో పేర్కొన్నారు. స్వలింగ సంపర్కులకు కొన్ని హక్కులు కల్పించాలన్న CJI తీర్పును జస్టిస్‌ భట్‌ సమర్థించారు.

ఇష్టమైన వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకునే హక్కు ఉంటుందని.. కానీ వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కాదన్నారు జస్టిస్​ రవీంద్ర భట్​. ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవడం ఆర్టికల్​ 21 పరిధిలోకి వస్తుందని.. వారికి లైంగిక సంబంధం, గోప్యత, స్వయంప్రతిపత్తి లాంటి హక్కులు ఉన్నాయన్నారు. అయితే, ఈ హక్కులకు భంగం కలగకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. స్వలింగ సంపర్కుల కోసం చట్టమే లేనప్పుడు వీరి వివాహానికి హక్కులు లేవని స్పష్టం చేశారు.

Last Updated :Oct 17, 2023, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.