ETV Bharat / bharat

Road Accident in Tripurantakam: మృత్యు రూపంలో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి.. ప్రకాశంలో ఘటన

author img

By

Published : May 29, 2023, 9:15 AM IST

Road Accident in Prakasam: రోజువారి కూలి పనులు చేసుకునే వారిపై విధి చిన్నచూపు చూసింది. పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న వారిపై ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

Road Accident in Prakasam
Road Accident in Prakasam

Road Accident in Prakasam: వారంతా రోజువారి కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. ఫంక్షన్లు, పెళ్లిల్లు, బర్త్​డే పార్టీలకు డెకరేషన్​ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలా ఆ విధులు ముగించుని ఇంటికి వస్తుండగా విధికి కన్ను కుట్టినట్లైంది. రోడ్డు ప్రమాదం రూపంలో నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపింది. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ నగరం వాంబే కాలనీకి చెందిన పిల్లి శ్రీను(35), చంద్రశేఖర్‌(33), కె.శ్రీను(22), సాయి(32) శుభకార్యాల్లో అలంకరణ పనులు చేసే కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలోని ఓ శుభకార్యానికి వెళ్లి అక్కడ అలంకరణ పనులు పూర్తి చేశారు. అనంతరం తిరిగి కారులో స్వస్థలం విజయవాడకు పయనమయ్యారు. అలా ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని పౌరసరఫరాల గోదాము వద్దకు వచ్చేసరికి విజయవాడ నుంచి సత్యసాయి జిల్లా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టింది. అంతే పనుల బడలికలో గాఢ నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు తమతో వచ్చిన వారు విగతజీవులుగా పడి ఉన్నారు.

ఈ ప్రమాదంలో శ్రీను, సాయి, చంద్రశేఖర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వినుకొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కె.శ్రీను అనే యువకుడు మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న అశోక్‌, కొయ్యని రాజు అనే మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం వినుకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం ధాటికి కారు ఫ్రంట్​ భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. మూడు మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. స్థానికుల సాయంతో పోలీసులు అతి కష్టం మీద ఆ మృతదేహాలను బయటికి తీశారు. త్రిపురాంతకం ఎస్సై వెంకట సైదులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీ డ్రైవర్​ అతి వేగమా లేకపోతే నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

బస్సు పట్టణంలో నుంచి వెళ్లాల్సి ఉండగా..: సాధారణంగా ఆర్టీసీ బస్సులు త్రిపురాంతకం లోపలి నుంచి ప్రయాణించాల్సి ఉంది. అయితే రాత్రి సమయంలో చాలా మంది డ్రైవర్లు బస్సులను పట్టణంలోకి కాకుండా.. బైపాస్‌లో నుంచి తీసుకువెళ్తున్నారు. ఇలా రాకపోకలు సాగించడమే ఈ ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.