ETV Bharat / state

Bus Accident in Annamayya District అన్నమయ్య జిల్లాలో బస్సు బోల్తా.. 50 మందికి గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమం

author img

By

Published : May 25, 2023, 3:56 PM IST

Bus Accident in Annamayya District అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 50మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..

annamayya district bus accident
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం

Annamayya District Bus Accident: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. కర్ణాటక రాష్ట్రం చిక్కుబుల్లాపూర్ నుంచి తిరుపతికి వస్తున్న ప్రైవేటు బస్సు బెంగళూరు రోడ్డు బార్లపల్లి సమీపంలో బోల్తా పడింది. బార్లపల్లి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక కారు యూటర్న్ తీసుకుంటుండగా అటువైపు నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు ఆ వాహనాన్ని వెనుక భాగం నుంచి ఢీకొంది. దీంతో అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న పెద్ద లోయలో పడిపోయింది.

దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. బస్సులో పిల్లలు, మహిళలు, పెద్దలు, వృద్ధులు ఒకరిపై ఒకరు కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికుల్లో చాలామందికి కాళ్లు, చేతులు విరిగిపోగా.. మరి కొంతమంది తలకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు లోపల ఉన్న క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. కొంతమందికి కాళ్లు పూర్తిగా విరిగిపోవడంతో వారిని చేతుల మీదుగా బయటకు తీసుకొచ్చి.. 108కు సమాచారం ఇచ్చారు. అయితే సమయానికి 108 వాహనం రాకపోవడంతో స్థానికులే.. కొంతమంది క్షతగాత్రులను ఆటోలో ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన క్షతగాత్రులను.. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే రమేష్, జనసేన పార్టీ నేత గంగారపు రాందాస్ సోదరులు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులను కోరారు.

మరోవైపు.. పల్నాడు జిల్లాలోని వినుకొండలో రైల్వేట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన కురిచేడు-గుండ్లకమ్మ స్టేషన్​ల మధ్య నూజెండ్ల మండలం చింతలచెరువు సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతూ ఓ వ్యక్తి హుబ్లీ టు విజయవాడ వెళ్తున్న ట్రైన్​ ఢీకొని మరణించినట్లు లోకోపైలట్ సమాచారం అందించినట్లు.. రైల్వే ఎస్సై(జీఆర్​పీ) సుబ్బారావు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు ట్రాక్​ వద్దకు చేరుకుని.. వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వ్యక్తిని పాతనాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన చింతలచెరువు పీర్​ సాహెబ్​ కుమారుడు మీరావలి(24)గా పోలీసులు గుర్తించారు. కాగా మృతి చెందిన వ్యక్తి సచివాలయానికి పని నిమిత్తం వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లినట్లు తండ్రి పీర్​ సాహెబ్ తెలిపాడు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బురుజు పల్లి గ్రామ సమీపంలో ఉపాధి కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఒకరికి కాళ్లు విరుగగా.. మరొకరికి వెన్ను వద్ద గాయాలైనట్లుగా వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.