Vimal Aditya Temple Kashi : కాశీ క్షేత్రానికి వెళ్లాలని అనుకున్నంత మాత్రానే సమస్త పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితమంతా ఎలా గడిచినా చివరి రోజులు కాశీలో గడపాలని ఎంతో మంది ఆరాటపడుతుంటారు. కాశీలోని మట్టి, గంగా తీర్థం, విశ్వేశ్వర స్వామి లింగం, అన్నపూర్ణాదేవి ఆలయం, డుంఠి గణపతి, చింతామణి గణపతి, కాలభైరవుని ఆలయం ఇలా ఒకటేమిటి ఎన్నో విశేషాలకు నిలయం కాశీ పట్టణం.
12 సూర్య ఆలయాలు
కాశీ పట్టణంలో 12 సూర్యుని ఆలయాలు ఉంటాయి. ఒక్కో ఆలయంలో సూర్యభగవానుడిని ఒక్కో పేరుతో పిలుస్తూ పూజాదికాలు అందుకుంటున్నాడు. అలాంటి వాటిలో ఒకటే 'విమలాదిత్యుడు' కొలువైన ఆలయం.
ఆలయ స్థల పురాణం
పూర్వకాలంలో 'విమలుడు' అనే రాజు కుష్ఠు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. ఎన్ని మందులు వాడినా, పూజలు వ్రతాలు చేసినా ఆయన కుష్ఠువ్యాధి తగ్గలేదు. వ్యాధితో తీవ్ర మనోవేదన చెందిన విమలుడు విరక్తితో భార్యా బిడ్డలను విడిచి కాశీ క్షేత్రానికి చేరుకుంటాడు. కాశీ పట్టణంలో ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. ప్రతిరోజూ గంగా స్నానం చేస్తూ శివుని అభిషేకిస్తూ, ఆదిత్యుని గురించి తపస్సు చేస్తూ కాలం గడపసాగాడు.
ప్రత్యక్ష భగవానుని సాక్షాత్కారం
విమలుని తపస్సుకి మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై, అతనిని కుష్ఠు వ్యాధి నుంచి విముక్తుడిని చేస్తాడు. విమలుడు ప్రతిష్ఠించి పూజించిన మూర్తి కాబట్టి అక్కడి సూర్యుడు విమలాదిత్యుడు పేరుతో ప్రసిద్ధికెక్కాడు.
విమలాదిత్యుని పూజిస్తే ఈ బాధలుండవు
కాశీపట్టణమంతటి గొప్ప క్షేత్రంలో వెలసిన విమలాదిత్యుని పూజించినవారికి భయంకరమైన వ్యాధులు కూడా దూరమవుతాయని విశ్వాసం. అంతేకాదు మానవుని దుఃఖానికి కారణమైన దారిద్య్ర బాధలు, సంసార దుఃఖాలు ఉండవని శాస్త్రవచనం.
మహిమాన్వితం కాశీపట్నం
జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రం దర్శించుకోవాలని అందరు అనుకుంటారు. కాశీకి వెళ్లిన ప్రతివారు ఇక్కడ ఉన్న ముఖ్య దేవాలయాలను కూడా తప్పకుండా సందర్శించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు విమలాదిత్యుని దర్శించి పూజిస్తే అనారోగ్య బాధలు దూరమవుతాయి. అనాయాస మరణం ప్రాప్తిస్తుందని సాక్షాత్తూ ఆ పరమశివుడే వరమిచ్చాడు. కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా విమలాదిత్యుని దర్శించుకుని సకల ఆరోగ్యాలు పొందాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఓం సూర్యదేవాయ నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
జాతకంలో శని దోషాలున్నాయా? ఆదివారమే భైరవ జయంతి- ఇలా పూజిస్తే అంతా సెట్! - Batuk Bhairav Jayanti