ETV Bharat / bharat

Hyderabad Psycho Killer Case : రూ.500 అవసరం పడిందా.. ఓ ప్రాణం పోయినట్టే..!

author img

By

Published : Jun 23, 2023, 9:35 AM IST

Updated : Jun 23, 2023, 10:00 AM IST

Hyderabad Psycho Killer Case
Hyderabad Psycho Killer Case

Psycho Serial Killer In Hyderabad : చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి నేరాల బాట పట్టాడు. దొంగతనాలతో మొదలైన అతడి నేర ప్రయాణం.. కిరాతకంగా హత్యలు చేసే వరకూ చేరుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పటి వరకు ఏకంగా 8 హత్యలకు పాల్పడ్డాడు. మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో జంట హత్యల కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. ఒళ్లు గగురుపొడిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నాలుగైదు వందల రూపాయల కోసం నిందితుడు.. దారుణ హత్యలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం విస్తుగొలుపుతోంది.

రూ.500 అవసరం పడిందా.. ఓ ప్రాణం పోయినట్టే..!

Psycho Serial Killer Arrested In Hyderabad : మద్యం, గంజాయికి అలవాటు పడ్డాడతను. అవి కొనేందుకు డబ్బు అవసరమైతే చాలు రోడ్లపై అన్వేషిస్తాడు. పగలంతా పనిచేసుకుని అలసిసొలసి రోడ్ల పక్కన నిద్రించే వారి తలపై బండరాయితో మోది హతమారుస్తాడు. వారి వద్ద ఉన్న డబ్బుతో అక్కడనుంచి పరారవుతాడు. ఇలా 14 రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేసిన సీరియల్‌ కిల్లర్‌ను హైదరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై మొత్తం ఎనిమిది హత్యలు, ఐదు దోపిడీ కేసులు, ఒక అత్యాచారం కేసు ఉన్నట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.

Hyderabad Serial Killer Case News : రాజేంద్రనగర్‌ మాణిక్యమ్మ కాలనీకి చెందిన బ్యాగరి ప్రవీణ్‌ (34) చిన్నతనంలోనే దొంగతనాలకు అలవాటు అయ్యాడు. రాజేంద్రనగర్‌కు చెందిన షేక్‌ ఫయాజ్‌, దర్గా నరేశ్‌తో కలిసి ముఠా కట్టిన ప్రవీణ్‌.. 2011లో రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్​ పరిధిలో ఓ ఇంట్లో దోపిడీకి పథకం వేశాడు. అర్ధరాత్రి సమయంలో ముగ్గురూ ఆ ఇంటి వద్దకు వెళ్లారు. అదే సమయంలో కుటుంబ యజమాని యాదయ్య నిద్రలేచి మూత్ర విసర్జనకు బయటకు రావడంతో అతనిని రాయితో కొట్టి చంపారు. యాదయ్య భార్యపై అత్యాచారం చేసి గొంతునులిమి హతమార్చారు. అలికిడితో నిద్రలేచిన పదేళ్ల ఆమె కుమారుడిని కూడా చంపారు. ఇంట్లో ఉన్న ఆభరణాలు, డబ్బు ఎత్తుకెళ్లారు. ఈ మూడు హత్యలు చేసిన తర్వాత ప్రవీణ్‌ స్నానం చేసి స్థానిక గుడిలో పూజలు చేసినట్టుగా పోలీసులు అప్పట్లో గుర్తించారు.

యాచకులే లక్ష్యం.. : అదే ఏడాది నెల వ్యవధిలోనే ప్రవీణ్‌ మరో రెండు హత్యలు చేశాడు. రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌ నంబరు 127 దగ్గర రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ యాచకుడిని, ఫుట్‌పాత్‌పై నివాసముండే బద్వేల్‌ వాసి పి ప్రకాశ్​ను బండరాయితో తలపై మోది సొమ్ముతో పరారయ్యాడు. అలాగే మరికొన్ని దొంగతనాలు, దోపిడీలు చేశాడు. అన్ని కేసుల్లో కలిపి 2014 జూన్‌లో నిందితుడు ప్రవీణ్​కి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

బెయిలుపై బయటికొచ్చి.. మళ్లీ హత్యలు: గత ఏడాది నవంబరులో బెయిలుపై బయటకొచ్చిన ప్రవీణ్‌.. అప్పటినుంచి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధి రాజీవ్‌ గృహకల్ప దగ్గర నివాసం ఉంటున్నాడు. మద్యం, గంజాయికి డబ్బులు అవసరమై మళ్లీ హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఈ నెల 7వ తేదీన మైలార్‌దేవ్‌పల్లి పరిధి నేతాజీనగర్‌లోని రైల్వే ట్రాక్‌ పక్కన నిద్రిస్తున్న ఓ యాచకుడిని బండరాయితో తలపై కొట్టి హతమార్చాడు. ఈ నెల 21న (బుధవారం) అర్ధరాత్రి మైలార్‌దేవ్‌పల్లి స్వప్న థియేటర్‌ దగ్గర నిద్రిస్తున్న దుప్పట్లు అమ్ముకునే వ్యక్తి (40)ని బండరాయితో మోదీ చంపి డబ్బు ఎత్తుకెళ్లాడు. అక్కడి నుంచి దుర్గానగర్‌ క్రాస్‌రోడ్డు వరకు వెళ్లి అక్కడ తాత్కాలిక షెడ్డు వేసుకుని నివసిస్తున్న వ్యక్తిని బండరాయితో కొట్టి చంపేశాడు. అతని దగ్గరున్న సొమ్ము లాక్కొని పరారయ్యాడు.

Police Arrested Psycho Serial Killer In Hyderabad : నిందితుడు తనకు రూ.500 అవసరమైనప్పుడల్లా హత్యలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి వివరించారు. నిందితుడు మద్యం, గంజాయి తాగాక రోడ్లపై తిరుగుతూ ఫుట్‌పాత్‌లు, దారి పక్కన నిద్రించేవారినే లక్ష్యంగా చేసుకుని చంపుతాడు. వారి పక్కన కొద్దిసేపు నిద్రిస్తున్నట్లు నటించి ఆ తర్వాత హతమారుస్తాడు. వారి వద్దనున్న డబ్బుతో అక్కడినుంచి పరారవుతాడు. ఈ నెల 21న ఒకేరోజు రెండు హత్యలు జరగడంతో నిందితుడి కోసం గాలించామని.. హత్య జరిగిన ప్రాంతంలోని వంద సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడపట్టి నిందితుడి ఆచూకీ కనుగొన్నామని డీసీపీ వెల్లడించారు.

చంపేశాను.. ఏం చేద్దాం.. : నిందితుడు ప్రవీణ్ ప్రవర్తన తమను విస్తుగొలిపిందని పోలీసులు తెలిపారు. ఎందుకీ హత్యలు చేశావని నిందితుడిని ప్రశ్నించినప్పుడు "చంపేశాను.. అయిపోయింది. ఏం చేద్దాం..!" అంటూ బదులిచ్చాడు. నిద్రిస్తున్న వ్యక్తుల్ని చంపడానికి కారణమేమిటని అడగ్గా.. "ఒకవేళ నిద్రలేస్తే నన్ను చంపేస్తారేమోననే భయంతో ముందే చంపేశానంటూ బదులిచ్చాడు" అని పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 23, 2023, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.