ETV Bharat / bharat

Vaccination: 'అందరికీ టీకా వేస్తే ఉద్ధృతులకు బ్రేక్​'

author img

By

Published : Jun 12, 2021, 7:29 AM IST

Updated : Jun 12, 2021, 8:06 AM IST

ఎక్కువ మందికి టీకా పంపిణీ చేస్తే... భవిష్యత్తులో కరోనా ఉద్ధృతులను అడ్డుకట్ట వేయొచ్చని వెల్లూరు సీఎంసీ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్​ ద్వారా తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణ పొందడమే కాకుండా, సంక్రమణ గొలును కూడా సమర్థంగా నిరోధించవచ్చని తేలింది. కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్న 8,991 మందిపై ఈ అధ్యయనం చేశారు.

covid vaccination
కరోనా వ్యాక్సిన్​

విస్తృత టీకా కార్యక్రమం(Vaccination)తో భవిష్యత్తులో కరోనా ఉద్ధృతులను అడ్డుకోవచ్చని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ) వైద్య నిపుణులు పేర్కొన్నారు. టీకా ద్వారా ఇన్‌ఫెక్షన్‌తోపాటు తీవ్రమైన రోగం నుంచి రక్షణ పొందడమే కాకుండా, సంక్రమణ శృంఖలాన్ని (ట్రాన్స్‌మిషన్‌ చైన్‌) సైతం సమర్థంగా నిరోధించవచ్చన్నారు. తమ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ తీసుకున్న 8,991 మంది ఆరోగ్య స్థితిపై అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ వివరాలను వెల్లడించారు.

వారితో పోలిస్తే ముప్పు తక్కువే..

ఈ ఆసుపత్రిలో 10,600 మంది ఉద్యోగులుండగా, 8,991 (84.8%) మందికి జనవరి 2 నుంచి ఏప్రిల్‌ 30 మధ్య వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఇందులో 93.4% మంది కొవిషీల్డ్‌, మిగిలిన వారు కొవాగ్జిన్‌ తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న 7,080 మందిలో 679 మంది (9.6%)కి రెండో డోసు తర్వాత సగటున 47 రోజుల్లో కరోనా సోకింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకోని సిబ్బందితో పోలిస్తే వీరిలో ప్రమాద ముప్పు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఒకే డోసు తీసుకున్నా మంచి రక్షణే లభిస్తున్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. 1,878 మంది ఒక్క డోసే తీసుకోగా వారిలో 200 (10.6%) మందే వైరస్‌ బారినపడ్డారు. అందులో 22(1.2%) మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

0.9శాతం మందే ఆసుపత్రిలో..

రెండు డోసులు తీసుకున్నాక ఇన్‌ఫెక్షన్‌కు గురైన 679 మందిలో 64 (0.9%) మందే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సీఎంసీ వైద్యనిపుణుల అధ్యయనంలో తేలింది. కేవలం నలుగురికి (0.58%) ఆక్సిజన్‌ అవసరం కాగా, ఇద్దరికి (0.29%) మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకోని 1,609 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిలో 438 (27.2%) మంది వైరస్‌ బారినపడ్డారు. అందులో 64 (14.61%) మందిని ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 11 (2.51%)మందికి ఆక్సిజన్‌, 8 మందికి (1.82%) ఐసీయూ సేవల అవసరం వచ్చినట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ ఫలితాలపై ప్రముఖ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ ట్విటర్‌ ద్వారా సంతోషం వ్యక్తంచేశారు. "వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి. ఎక్కువ సంక్రమణ అవకాశాలున్న వైద్య సిబ్బందిలోనూ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా బాగా పని చేశాయి. రోగం తీవ్రరూపు సంతరించకుండా గొప్పగా అడ్డుకున్నాయి" అని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated :Jun 12, 2021, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.