ETV Bharat / bharat

'కేంద్రం నిరంతర ప్రయత్నాల వల్లే అభివృద్ధి పథంలో భారత్​'

author img

By

Published : Jan 31, 2022, 4:52 PM IST

Budget session 2022: ప్రజల సమష్టి కృషితో అభివృద్ధి మార్గంలో భారత్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భారత్‌ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్ధగా మరోసారి నిలిచిందని తెలిపారు. రక్షణ రంగంలో స్వయం సాధికారత సాధించేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్రపతి వెల్లడించారు. మహమ్మారిపై దేశం స్ఫూర్తిదాయకమైన పోరాటం చేస్తోందని ప్రశంసించారు.

president-ram-nath-kovind-speech
రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ స్పీచ్​

President Ramnath Kovind speech: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్‌ హాల్‌లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించారు. 50 నిమిషాల పాటు మాట్లాడిన రాష్ట్రపతి ఇటీవల కాలంలో భారత్‌ వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల వల్ల భారత్‌ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్ధల్లో ఒకటిగా మరోసారి నిలిచిందని కొనియాడారు. మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి దిశగా భారత్‌ ముందుకు సాగుతోందని తెలిపారు. గత ఏడేళ్ల కాలంలో 24 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరణ చేసినట్లు వివరించారు. దిల్లీ, ముంబయిని అనుసంధానిస్తూ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌ వే త్వరలోనే పూర్తి కానుందని రాష్ట్రపతి తెలిపారు. 2014 మార్చిలో దేశంలో 90వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, వాటి నెట్‌వర్క్‌ ఇప్పుడు లక్షా 40వేల కిలోమీటర్ల కంటే ఎక్కువకు చేరిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం 21 గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. 8 రాష్ట్రాల్లో నిర్మించిన 11 మెట్రో రైల్వే లైన్లు లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం కల్పిస్తున్నాయని రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. కేంద్రం రూ.4,500 కోట్లతో ఏడు మెగా సమీకృత జౌళి ప్రాంతాలు, అపారెల్‌ పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్షణ రంగంలో సాధికారత సాధించేందుకు భారత్‌ అనేక చర్యలను చేపడుతున్నట్లు రాష్ట్రపతి వివరించారు. దేశంలో జీఎస్టీ ఆదాయం సహా విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరుగుతున్నాయని రాష్ట్రపతి వెల్లడించారు.

"కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల వల్ల భారత్‌ మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్ధల్లో ఒకటిగా మారింది. దేశంలో గత కొంత కాలంగా జీఎస్టీ నెలవారీ వసూళ్లు క్రమంగా లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంటున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో 48 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం.. భారతదేశ అభివృద్ధి పట్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులు భరోసాగా ఉన్నారనేందుకు నిదర్శనం. భారత దేశ విదేశీ మారక నిల్వలు కూడా ఇప్పుడు 630 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ ఉన్నాయి. భారతదేశ ఎగుమతులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఎగుమతులు గత రికార్డులను బద్దలుకొడుతున్నాయి. 2021లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ వరకు భారతదేశ వస్తువుల ఎగుమతులు 22లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్నాయి. 2020 ఏప్రిల్‌-డిసెంబర్‌ కాలంతో పోలిస్తే దేశ ఎగుమతులు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నాయి."

-రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

కరోనా విసిరిన సవాళ్లను అధిగమిస్తూ భారత్‌ వ్యవసాయ రంగంలోనూ అద్భుత ప్రగతి సాధిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. రైతుల పంట కొనుగోళ్ల విధానం సహా ఉత్పత్తులు మార్కెట్‌కు చేరేలా సౌకర్యాలను మెరుగుపర్చినట్లు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజన కింద కేంద్రం లక్షా 80వేల కోట్ల రూపాయలను అందించిందన్నరాష్ట్రపతి దీని వల్ల 11కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారని తెలిపారు. కేంద్రం చర్యలతో వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు కనిపిస్తున్నాయని అన్నారు.

"దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్ధను, రైతులను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోంది. ప్రపంచ మహమ్మారి కరోనా వెంటాడుతున్నా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మన రైతులు 30కోట్ల టన్నుల కంటే ఎక్కువ ఆహార ధాన్యాన్ని, 33కోట్ల టన్నుల కంటే ఎక్కువగా ఉద్యానవన పంట ఉత్పత్తులను పండించారు. రికార్డు పంట ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రికార్డు స్ధాయిలో పంట కొనుగోళ్లు జరిపింది. రబీ సీజన్‌లో 433లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసింది. దీని వల్ల సుమారు 50లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం కలిగింది. ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 900 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. దీని వల్ల ఒక కోటి 30లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు."

-రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

కరోనాపై భారత్‌ స్ఫూర్తిదాయక పోరాటం చేస్తోందని రామ్‌నాథ్‌ కోవింద్‌ కితాబిచ్చారు. కరోనాపై పోరులో భారత్ అధిరోహించిన లక్ష్యాలను రాష్ట్రపతి పార్లమెంటు సాక్షిగా గుర్తుచేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య సిబ్బంది జట్టుగా పనిచేశారని ప్రశంసించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదల వైద్య చికిత్సకు సహాయపడుతున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

"కొవిడ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన కేంద్రం, రాష్ట్రాలు, వైద్యులు, నర్సులు, శాస్త్రవేత్తలు, మన ఆరోగ్య కార్యకర్తలు ఒక జట్టుగా పనిచేశారు. ఆరోగ్య సంరక్షణకు ముందు వరుసలో ఉన్న ఆరోగ్య సిబ్బందికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు. కరోనాపై భారత్‌ చేసిన గొప్ప పోరాటానికి టీకా కార్యక్రమం ప్రతీకగా నిలిచింది. ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో 150 కోట్ల డోస్‌ల టీకాలు అందించి రికార్డు సృష్టించాము. ఇవాళ పెద్ద మొత్తంలో టీకాలు అందిస్తున్న ప్రపంచంలోని దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది."

-రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం దళితులు, వెనకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. లింగ సమానత్వాన్ని సాధించేందుకు మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచినట్లు వివరించారు. ముస్లిం మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు ముమ్మారు తలాక్‌ రద్దు చేసే చట్టాన్ని తీసుకువచ్చినట్లు రాష్ట్రపతి తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 'కరోనా నిబంధనలు గాలికి.. సభలో మాస్క్ లేకుండానే ఎంపీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.