ETV Bharat / bharat

'2022' భారత్​కు స్ఫూర్తిగా నిలిచిందన్న మోదీ.. కరోనాపై కీలక సూచనలు

author img

By

Published : Dec 25, 2022, 7:13 PM IST

PM MANN KI BAAT
PM MANN KI BAAT

ప్రపంచంలోని అనేక దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ ఏడాది చివరి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. పొరుగున ఉన్న చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక కట్టడి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. మరికొన్నిరోజుల్లో ముగియనున్న ఈ ఏడాది అనేక రంగాల్లో దేశానికి స్ఫూర్తిగా నిలిచినట్లు తెలిపారు.

కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా జాగ్రత్తలన్నీ పాటించాలని కోరారు. చాలా దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోందన్న మోదీ.. పండగ సమయాల్లో ప్రజలంతా మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. పండగ సంతోషాన్ని వైరస్ ప్రభావితం చేయకుండా చూసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి మన్​కీబాత్​లో మాట్లాడిన ప్రధాని.. 2022 ఏడాది అనేక విధాలుగా భారత్​కు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పారు.

ఈ ఏడాది భారత్‌ ప్రపంచంలోనే ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటమే కాకుండా 220కోట్ల టీకా డోసులు పంపిణీ, ఎగుమతులు 400బిలియన్‌ డాలర్లు దాటడం వంటి ఎన్నో ఘనతలు సాధించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశం ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా సాగుతోందన్నారు. మొదటి స్వదేశీ తయారీ యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ నౌకాదళంలో చేరినట్లు ప్రధాని చెప్పారు. అంతరిక్ష, డ్రోన్‌, రక్షణ రంగాల్లో అనేక విజయాలు సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది దేశం కొత్త గతిని సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

"2022లో దేశ ప్రజల సామర్థ్యం, వారి సహకారం, వారి సంకల్పం, వారి విజయాల పరంపర చాలా ఎక్కువగా ఉంది. మన్‌ కీ బాత్‌లో అవన్నీ చెప్పటం కష్టమవుతుంది. 2022 సంవత్సరం చాలా ప్రేరణగా, అద్భుతంగా నిలిచింది. ఈ ఏడాది భారత్‌ స్వాతంత్ర్యం సాధించి 75ఏళ్లు పూర్తి చేసుకుంది. అలాగే అమృతోత్సవాల్లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది దేశం కొత్తగతిని అందుకుంది. దేశప్రజలు ఒకర్ని మించి ఒకరు శ్రమించారు. ఈ ఏడాది వివిధ రంగాల్లో సాధించిన విజయాల ద్వారా భారత్‌ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం పొందింది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

చైనా సహా అనేక దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మహమ్మారి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి.. ముందు జాగ్రత్తగా ఇప్పటికే అనేక చర్యలు ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

"దేశ ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే ఏడాది కూడా దేశానికి ప్రత్యేకత తేవాలి. దేశం కొత్త ఎత్తులను అందుకుంటూ ఉండాలి. ఇందుకోసం అందరం కలిసి సంకల్పం తీసుకోవటంతోపాటు సాకారం చేసుకోవాలి. ఈ సమయంలో చాలామంది సెలవుల మూడ్‌లో ఉంటారు. పండుగలు, అవసరాలను పూర్తిగా ఆనందించండి. అంతేకాదు అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా వ్యాపిస్తోంది. అందువల్ల మాస్క్‌ ధరించటం, చేతులు శుభ్రం చేసుకోవటం వంటి నిబంధనలపై దృష్టి సారించాలి. అప్రమత్తంగా ఉంటే భద్రంగా కూడా ఉంటాం. సంతోషాలకు ఎలాంటి అంతరాయం కూడా కలగదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇప్పటికే దేశంలో మసూచి, పోలియో తదితర రోగాలను నిర్మూలించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కాలేయంవాపు వ్యాధి నిర్మూలనకు చేరువైనట్లు చెప్పారు. ఇదివరకు నాలుగు రాష్ట్రాల్లోని 50 జిల్లాల్లో ప్రభావం చూపిన ఈ వ్యాధి.. ఇప్పుడు బిహార్‌, ఝార్ఖండ్‌లోని 4 జిల్లాలకే పరిమితమైనట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.