ETV Bharat / bharat

'డెల్టా కంటే జోరుగా ఒమిక్రాన్ వ్యాప్తి- జర్నీలు వాయిదా వేయడం మేలు'

author img

By

Published : Dec 17, 2021, 4:48 PM IST

Updated : Dec 17, 2021, 10:45 PM IST

omicron
ఒమిక్రాన్‌

Omicron Cases India: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 100 దాటిందని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మంచిదని అభిప్రాయపడింది. కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని సూచించింది.

Omicron Cases India: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్‌ 11 రాష్ట్రాలకు పాకగా మొత్తంగా 111 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా వైరస్​ కట్టడి కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పింది.

"గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 91 దేశాలకు ఈ వేరియంట్‌ పాకింది. ఐరోపా సహా ఇతర ప్రాంతాల్లో ఈ వేరియంట్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం ఈ వేరియంట్‌ కేసులే. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మంచిది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడొద్దు. పండగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి."

-లవ్​ అగర్వాల్​, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి

కొత్త కేసులు..

శుక్రవారం మొత్తం 24 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 8, దిల్లీలో 12 కేసులు వెలుగు చూశాయని చెప్పింది. తెలంగాణ, కేరళలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయని పేర్కొంది.

  • మహారాష్ట్ర- 40
  • దిల్లీ- 22
  • రాజస్థాన్​- 17
  • కర్ణాటక- 8
  • తెలంగాణ- 8
  • గుజరాత్​- 5
  • కేరళ- 7
  • ఆంధ్రప్రదేశ్​- 1
  • చంఢీగఢ్​- 1
  • తమిళనాడు- 1
  • బంగాల్​- 1

87.6శాతం మందికి తొలి డోసు పూర్తి..

Vaccination India: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 136 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 87.6శాతం మందికి తొలి డోసు పూర్తయినట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్‌ రేటు భారత్‌లోనే ఉందని పేర్కొంది. అమెరికాతో పోలిస్తే 2.8రెట్లు, యూకేతో పోలిస్తే 12.5 రెట్లు అధిక వ్యాక్సినేషన్‌ రేటు భారత్‌లో ఉందని లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 3లక్షలకు పైగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉండగా.. ఇందులో 74శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.

కేరళలోనే 40శాతం యాక్టివ్ కేసులు

India Corona Cases: దేశంలో గత 20 రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల కంటే దిగువనే ఉందని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. 4 వారాలుగా పాజిటివిటీ రేటు 1శాతం కంటే తక్కువే ఉందన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్‌ తీవ్రత ఎక్కువగానే ఉందన్నారు. 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉండగా.. 5 జిల్లాల్లో 10శాతానికి పైనే ఉందని తెలిపారు. ఇక యాక్టివ్‌ కేసుల్లో 40శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

Last Updated :Dec 17, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.