ETV Bharat / bharat

'దిల్లీలో నాలుగో వేవ్‌.. లాక్‌డౌన్‌ ఆలోచన లేదు!'

author img

By

Published : Apr 3, 2021, 4:58 AM IST

Updated : Apr 3, 2021, 5:55 AM IST

దిల్లీలో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోందని సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి లాక్​డౌన్ విధించే యోచన లేదని స్పష్టం చేశారు.

no plan for lockdown in delhi says kejriwal
'దిల్లీలో నాలుగో వేవ్‌.. లాక్‌డౌన్‌ ఆలోచనలేదు!'

దేశ రాజధాని నగరంలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోందన్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అయితే మరోసారి లాక్​డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టంచేశారు. కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో నమోదవుతుండటం వల్ల అప్రమత్తమైన సీఎం.. శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌, ఇతర ఉన్నతాధికారులతో కరోనా పరిస్థితిపై సమీక్షించారు.

"దిల్లీలో ప్రస్తుతం నాలుగో వేవ్‌ కొనసాగుతోంది. అందువల్లే మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. కరోనాతో నెలకొంటున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికైతే లాక్‌డౌన్‌ అమలుచేయాలన్న ఆలోచన లేదు. భవిష్యత్తులో అవసరమైతే ప్రజలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం."

- అరవింద్‌ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ఎలాంటి ఆంక్షలూ లేకుండా టీకా పంపిణీకి అందరినీ అనుమతించాలని కేంద్రాన్ని కేజ్రీవాల్‌ కోరారు. కేంద్రం అనుమతిస్తే దిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టీకా పంపిణీ చేపడుతుందన్నారు. కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగో వేవ్ ‌నుంచి బయటపడేందుకు మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. గతంలో కరోనా విజృంభణతో పోలిస్తే నాలుగో వేవ్‌తో ముప్పు తక్కువేనన్నారు.

దిల్లీలో గడిచిన 24గంటల్లో 87505 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3594మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 2084మంది కోలుకోగా.. 14మంది మరణించారు. ఇప్పటివరకు దిల్లీలో 1,47,41,240 శాంపిల్స్‌ పరీక్షించగా.. 6,68,814మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,45,770మంది కోలుకోగా.. 11050మంది మృతిచెందారు. ప్రస్తుతం 11994 క్రియాశీల కేసులు ఉన్నాయి.

ఇదీ చూడండి: కరోనా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష

Last Updated : Apr 3, 2021, 5:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.