ETV Bharat / bharat

'సిద్ధూకు ప్రత్యేక ఆహారం ఇవ్వలేదు.. 24 గంటలుగా ఆకలితోనే..'

author img

By

Published : May 21, 2022, 10:36 PM IST

Navjot singh sidhu in jail
నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ

Navjot singh sidhu in jail: పాటియాలా సెంట్రల్​ జైలులో ఉన్న పంజాబ్​ కాంగ్రెస్​ మాజీ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూకు సరైన ఆహారం అందించలేదని ఆయన న్యాయవాది ఆరోపించారు. 24 గంటలు గడుస్తున్నా భోజనమే చేయలేదని తెలిపారు. సిద్ధూ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ఆహారం అందించాలని పాటియాలా కోర్టులో అప్పీల్​ చేశారు.

Navjot singh sidhu in jail: మూడు దశాబ్దాల క్రితం నాటి కేసులో జైలు శిక్ష పడటంతో.. పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ప్రస్తుతం పాటియాలా సెంట్రల్‌ జైలులో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన్ను ఇక్కడికి తరలించారు. జైల్లో తొలి రోజు సిద్ధూకు కాస్త కష్టంగానే గడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, దాదాపు 24 గంటలు కావస్తున్నా.. జైలు అధికారులు ఆయనకు అనువైన ఆహారాన్ని సమకూర్చలేదని సిద్ధూ తరఫు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ ఆరోపించారు. శుక్రవారం రాత్రి రోటీ, పప్పు వడ్డించగా.. గోధుమల అలర్జీ, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా సిద్ధూ వాటిని తిరస్కరించినట్లు తెలిపారు. అప్పటినుంచి ఆయనకు భోజనమే లేదన్నారు.

ఈ క్రమంలోనే సిద్ధూ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక ఆహారం అందించాలని సదరు న్యాయవాది శనివారం పాటియాలా కోర్టులో అప్పీల్‌ చేశారు. అయినా.. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 'ఉదయం నుంచి కోర్టులో కూర్చుని.. జైలు అధికారులు వస్తారని వేచి ఉన్నా. కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు' అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. సిద్ధూకు జైలులో ఖైదీ నంబరు 241383 కేటాయించారు. 10 నంబరు గదిలో ఉంచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయనతోపాటు అదే సెల్‌లో మరో 8 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది.

34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు గత గురువారం సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 డిసెంబరు 27న.. సిద్ధూ, ఆయన స్నేహితుడైన రూపిందర్‌సింగ్‌ సంధూ పాటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్‌ (65) వాహనాన్ని పక్కకు తీయమని పదే పదే కోరారు. ఆవేశంతో మిత్రులు ఇద్దరూ వృద్ధుడిని కారు నుంచి బయటకు లాగి చితకబాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నాంసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. తొలుత పాటియాలా జిల్లా సెషన్స్‌ కోర్టు, ఆపై పంజాబ్, హరియాణా హైకోర్టు.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరిన ఈ కేసులో సిద్ధూకు తాజాగా ఈ మేరకు శిక్ష పడింది.

ఇదీ చూడండి: కోర్టులో లొంగిపోయిన సిద్ధూ.. పాటియాలా జైలుకు తరలింపు!

ఆ ట్వీట్​తో మరోసారి కాంగ్రెస్​ పరువు తీసేసిన సిద్ధూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.