ETV Bharat / bharat

కోర్టులో లొంగిపోయిన సిద్ధూ.. పాటియాలా జైలుకు తరలింపు!

author img

By

Published : May 20, 2022, 6:18 PM IST

Navjot Sidhu
కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధూ..

Navjot Sidhu surrender: 34 ఏళ్ల క్రితం నాటి కేసులో సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన క్రమంలో.. కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, మాజీ క్రికెటర్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ శుక్రవారం.. పాటియాలో కోర్టులో లొంగిపోయారు. అక్కడి నుంచి ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం పాటియాలా జైలుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

Navjot Sidhu surrender: మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన క్రమంలో.. శుక్రవారం(మే 20) ఆయన కోర్టులో లొంగిపోయారు. పాటియాలాలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన ఆయన న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పాటియాలా జైలుకు తరలించనున్నారు.

అంతకుముందు సిద్ధూ ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని సిద్ధూ న్యాయస్థానాన్ని కోరారు. సిద్ధూ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలాలతో కూడిన ధర్మాసనం ముందుంచారు. అయితే ఈ కేసులో ప్రత్యేక బెంచ్‌ తీర్పు ఇచ్చినందున.. తాజా అభ్యర్థనపై తాము నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ ఫైల్‌ చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సిద్ధూ కోర్టులో లొంగిపోయారు.

34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. 1988 డిసెంబరు 27న.. సిద్ధూ, ఆయన స్నేహితుడైన రూపిందర్‌సింగ్‌ సంధూ పాటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్‌ (65) వాహనాన్ని పక్కకు తీయమని పదే పదే కోరారు. ఆవేశంతో మిత్రులు ఇద్దరూ వృద్ధుణ్ని కారు నుంచి బయటకు లాగి చితకబాదారన్నది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నాంసింగ్‌ను ఆసుపత్రికి తరలించగా, మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సరైన సాక్ష్యాధారాలు లేవంటూ 1999లో పాటియాలా జిల్లా సెషన్స్‌ కోర్టు ఈ కేసులోని నిందితులు ఇద్దరికీ హత్య ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది.

ఆ తర్వాత పంజాబ్, హరియాణా హైకోర్టుకు చేరిన ఈ కేసులో 2006 నాటి తీర్పు బాధితుడి పక్షాన వచ్చింది. సిద్ధూకు మూడేళ్ల జైలుశిక్ష పడింది. ఈ తీర్పును 2018 మే 15న తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఓ సీనియర్‌ సిటిజన్‌ను గాయపరిచినందుకు సిద్ధూకు రూ.వెయ్యి జరిమానా విధించింది. ఆ సమయంలో సిద్ధూ వెంట తను ఉన్నట్లు నమ్మదగ్గ సాక్ష్యాలు లేవంటూ రూపిందర్‌సింగ్‌ సంధూను కేసు నుంచి విముక్తుణ్ని చేసింది. దీనిపై అదే ఏడాది సెప్టెంబరులో గుర్నాంసింగ్‌ కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ పరిశీలనకు అంగీకరించిన సుప్రీంకోర్టు.. సిద్ధూకు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఈ జైలు శిక్షపై సిద్ధూ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. తీర్పును శిరసావహిస్తానని చెప్పారు.

ఇదీ చూడండి: నవజ్యోత్​ సింగ్​ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష.. కారణమిదే?

ఆ ట్వీట్​తో మరోసారి కాంగ్రెస్​ పరువు తీసేసిన సిద్ధూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.