ETV Bharat / bharat

రిషి సునాక్​ను అభినందించిన ప్రధాని మోదీ.. ఆనంద్​ మహీంద్రా ఆసక్తికర ట్వీట్​

author img

By

Published : Oct 24, 2022, 10:42 PM IST

PM Modi on Sunak's elevation
రిషి సునాక్ నరేంద్ర మోదీ

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్​కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సునాక్​తో కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్‌ 2030ని అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా కూడా రిషి సునాక్ అభినందనలు తెలుపుతూ అసక్తికర ట్వీట్ చేశారు.

బ్రిటన్‌ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రిషి బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయనతో కలిసి ప్రపంచ సమస్యలపై సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్‌మ్యాప్‌ 2030ని అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా యూకేలో ఉన్న భారతీయులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల చారిత్రక బంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మారుస్తామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా హిందువులు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా ఐదు రోజుల పాటు చేసుకొనే దీపావళి వేడుకల వేళ రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా విజయం సాధించారు. గతంలో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌పై పోటీచేసి ఓటమిపాలైన కొద్ది వారాల్లోనే యూకేలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏకగ్రీవంగా ప్రధాని పదవికి ఎన్నికై బ్రిటన్‌ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు.

రిషి సునాక్‌ ఎన్నికపై ఆనంద్‌ మహీంద్రా ఆసక్తికర ట్వీట్‌
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్​ ఎన్నకైన నేపథ్యంలోనే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా స్పందిస్తూ.. ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. నేడు భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో చెప్పకనే చెప్పారు.

'1947లో స్వాతంత్ర్యం వేళ భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది' అంటూ ట్వీట్‌ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటికే దీనిని 27వేల మందికి పైగా లైక్‌ చేశారు. అనేకమంది కామెంట్లు చేస్తూ.. భారత్‌కు చెందిన అనేక మంది విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న విషయాలను గుర్తుచేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.