ETV Bharat / bharat

టార్గెట్ దిల్లీ.. ముగ్గురు ముఖ్యమంత్రుల సరికొత్త రాజకీయం!

author img

By

Published : Feb 2, 2022, 9:47 PM IST

Updated : Feb 2, 2022, 9:55 PM IST

third front in india
ముగ్గురు సీఎంల సరికొత్త రాజకీయం

Third Front in India: మూడు రాష్ట్రాలు... ముగ్గురు ముఖ్యమంత్రులు.. పార్టీలు వేర్వేరు.. కానీ నినాదం ఒక్కటే.. 'ప్రత్యామ్నాయం!'. అంతర్లీనంగా దాగి ఉన్న సందేశం 'టార్గెట్ దిల్లీ'. బంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్​.. ప్రస్తుతానికి విడివిడిగానే సాగిస్తున్న రాజకీయం ఇది. మున్ముందు ఇది ఎలాంటి మలుపు తిరగనుంది? 2024 నాటికి జాతీయస్థాయిలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా? మోదీ-షా ద్వయానికి ప్రాంతీయ నేతల కూటమి దీటుగా నిలుస్తుందా? 2019 సార్వత్రిక ఎన్నికల నాటి లోపాల్ని అధిగమిస్తూ.. ఈసారి గేరు మార్చి గమ్యస్థానం చేరగలుగుతుందా?

Third Front in India: కాంగ్రెస్​ పార్టీ అంతకంతకూ ప్రాబల్యం కోల్పోతున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. దేశంలో బంగాల్​, తమిళనాడు, తెలంగాణలో తాజాగా జరిగిన పరిణామాలు అందుకు ఊతమిస్తున్నాయి.

'పార్టీని జాగ్రత్తగా చూసుకుంటామని నాకు హామీ ఇవ్వండి. మీరు హామీ ఇస్తే.. నేను రాష్ట్రం వెలుపల నా పనిపై ఎక్కువ దృష్టి సారించగలను. దేశవ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్​ను విస్తరించగలను.'

తృణమూల్​ కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా మమతా బెనర్జీ అన్న మాటలివి.

మరోవైపు భావసారూప్యత గల వ్యక్తులందరినీ ఒక ఉమ్మడి వేదికపైకి రావాలని.. అందుకోసం 'ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌'లో చేరాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్​ దాదాపు 37 పార్టీలకు లేఖ రాశారు.

ఇంకోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్​ సైతం కాంగ్రెస్​, భాజపాయేతర కూటమి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో దిల్లీకి కూడా వెల్లనున్నారని సమాచారం.

2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఈ ముగ్గురు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

జాతీయ రాజకీయాలపై దృష్టి: మమత

బుధవారం తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు నిర్వహించగా.. మమతా బెనర్జీని పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, సీనియర్ నేత సుబ్రతా బక్షి జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలు, జాతీయ రాజకీయాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలపై మరింత దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మమత స్పష్టం చేశారు.

అఖిలేష్ యాదవ్‌కు సంఘీభావంగా రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ యూపీ బరిలో నిలుస్తుందన్నారు. కలిసివచ్చే పార్టీలతో ముందుకెళ్లనున్నట్లు చెప్పుకొచ్చారు మమత.

ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తగాదాలు పెట్టుకోవద్దని పిలుపునిచ్చారు. బంగాల్​లో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు మమత. అలా చేస్తేనే తాను బంగాల్​ వెలుపల పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో భాజపాను గద్దె దింపడానికి బంగాల్​ని 42 ఎంపీ స్థానాలను టీఎంసీ కైవసం చేసుకొవాల్సి ఉంటుందని గుర్తుచేశారు.

బంగాల్​లోని భాజపా తిరుగుబాటు దారులు టీఎంసీలో చేరాలని మమత పరోక్షంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు ఎనిమిది మంది భాజపా శాసనసభ్యులు తృణమూల్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారున్నారు.

37 రాజకీయ పార్టీలకు స్టాలిన్​ లేఖ

MK Stalin Letter: 'ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌' కూటమిలో చేరాలని దేశవ్యాప్తంగా 37 రాజకీయ పార్టీల నేతలకు లేఖ రాశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.

కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, వామపక్షాలు, తెదేపా, తెరాస, వైఎస్‌ఆర్‌సీపీతో పాటు ఆ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే కూడా స్టాలిన్​ లేఖరాసిన పార్టీల జాబితాలో ఉన్నాయి. పీడిత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడమే తమ సమాఖ్య ధ్యేయమని లేఖలో పేర్కొన్నారు స్టాలిన్.

''వణక్కం! 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను 'ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్‌'ను ప్రారంభించాను. జాతీయ స్థాయిలో ఫెడరలిజం, సామాజిక న్యాయం సూత్రాలను సాధించేందుకు నాయకులు, పౌర సమాజంలోని సభ్యులు,భావసారూప్యత గల వ్యక్తులు, సంస్థలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు దీన్ని ప్రకటించాను.

సమాన ఆర్థిక, రాజకీయ సామాజిక హక్కులు పొందడం.. సమానత్వ సమాజాన్ని నిర్మించడం ద్వారానే సామాజిక న్యాయాన్ని పొందగలం"

-లేఖలో స్టాలిన్​ మాటలు

ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం కోసం పోరాడేందుకు సమాఖ్య కోసం ఆయా పార్టీల నుంచి తగిన వ్యక్తిని ప్రతినిధిగా నామినేట్ చేయాలని స్టాలిన్​ విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం పోరాడేందుకు సమాఖ్య అని స్టాలిన్​ చెబుతున్నా.. ఇది భవిష్యత్​లో రాజకీయ వేదికగా రూపాంతరం చెందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్

Third Front KCR: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్​ కాంగ్రెస్​, భాజపాయేతర కూటమి కోసం 2019 సాధారాణ ఎన్నికల నుంచే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది సాధ్యం కాలేదు. ఇటీవల జరిగిన పలు ప్రెస్​మీట్లలో ప్రత్యామ్నాయ కూటమి ఆవశ్యకతను చెబుతూ.. వస్తున్నారు. ఇటీవల తమిళనాడు వెళ్లినప్పుడు స్టాలిన్​తో సమావేశమైన సమయంలో కూడా కూటమిపై చర్చినట్లు సమాచారం. అలాగే ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్​ హైదరాబాద్​ వచ్చినప్పుడు ఆయనతో కూడా కూటమి ఆవశ్యకతను వివరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

మంగళవారం.. బడ్జెట్​ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని సూచాయగా ప్రస్తావించారు. దిల్లీతో తేల్చుకుంటాం అంటూ.. బాహటంగానే సవాళ్లు విసిరారు.
కూటమిపై చర్చించేందుకు త్వరలో సీఎం కేసీఆర్​ దిల్లీకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చూడండి : పంజాబ్​ ఎన్నికల్లో 'బంగారు' కొండలు- నేతల వద్ద కిలోలకొద్దీ పసిడి!

Last Updated :Feb 2, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.