ETV Bharat / bharat

Boy missing in Visakha railway station: విశాఖ రైల్వేస్టేషన్​లో చిన్నారి అదృశ్యం.. వారి పనేనా..!

author img

By

Published : Jun 9, 2023, 1:01 PM IST

విశాఖ రైల్వే స్టేషన్​లో బాలుడి అదృశ్యం
విశాఖ రైల్వే స్టేషన్​లో బాలుడి అదృశ్యం

Boy missing from Visakha railway station : విశాఖ రైల్వే స్టేషన్​లో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గర్భిణి కుటుంబ కలహాల కారణంగా ఏడాదిన్నర వయసున్న తన కుమారుడితో ఇల్లు విడిచి ఇక్కడకు చేరుకుంది. ప్లాట్ ఫాంపై పడుకుని కొద్ది సేపటికి నిద్ర లేచి చూడగా కుమారుడు కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరై పోలీసులను ఆశ్రయించింది.

Boy missing from Visakha railway station : కుటుంబ కలహాలు, భర్త వేధింపుల నేపథ్యంలో ఒంటరిగా ఇల్లు విడిచి వచ్చిన గర్భిణికి ఊహించని కష్టం ఎదురైంది. ఏడాదిన్నర వయస్సున్న కొడుకును వెంటబెట్టుకుని విశాఖ రైల్వేస్టేషన్​కు చేరుకున్న ఆమె.. బాలుడు అదృశ్యం కావడంతో కన్నీరుమున్నీరైంది. గురువారం ఉదయం ఈ ఘటన జరగ్గా... సాయంత్రం వరకూ పోలీసులు ఏమీ చేయలేకపోయారు. దీంతో ఆ గర్భిణి.. బిడ్డ ఆచూకీ కోసం తల్లడిల్లిపోతోంది. ‘కుమారుని ముద్దు ముద్దు మాటలు గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి రోదిస్తోంది.

భర్త ఏమైనా హాని తలపెడతాడేమోనని... బాధిత మహిళ.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయపల్లికి చెందిన కొంగరి భవాని కాగా, ఆమె భర్త లారీ డ్రైవర్‌. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల నేపథ్యంలో కుమారుడు విజయ్‌కుమార్‌(18 నెలలు)ను ఏమైనా ఆపద తలపెడతాడేమో అని ఆందోళనకు గురైంది. తన కష్టాలను పుట్టింటి వారు కూడా పట్టించుకోకపోవడంతో ఇల్లు విడిచి దూరంగా వెళ్లిపోవాలని భావించి బిడ్డతో సహా సికింద్రాబాద్ చేరుకుని అక్కడ రైలెక్కింది. బుధవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుని తెల్లవారే వరకూ ప్లాట్‌ ఫామ్‌పై ఉండిపోయింది. తెల్లవారుజామున ఒడిశాకు చెందిన ఓ జంట భవానీతో పరిచయం చేసుకొని మాటలు కలిపింది. ఈ క్రమంలో బిడ్డను తన పక్కనే పడుకోపెట్టుకున్న భవానీ.. మెల్లగా నిద్రలోకి జారుకుంది. రాత్రంతా నిద్రలేకపోవడంతో గాఢనిద్రలోకి జారుకున్న ఆమె... కొంత సమయం తరువాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. తనతో మాట్లాడిన ఒడిశా జంట కూడా దగ్గర్లో కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరైంది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. వెంటనే తేరుకున్న భవానీ స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసుల్ని ఆశ్రయించగా.. హుటాహుటిన తనిఖీలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో జీఆర్పీ సీఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారణ ముమ్మరం చేశారు. భవానీతో మాటలు కలిపిన జంటే బాలుడ్ని కిడ్నాప్‌ చేసిందా? అనే అనుమానంతో వారి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఏదైనా ముఠా కిడ్నాప్​నకు పాల్పడి ఉంటుందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవానీ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. బిడ్డ కనిపించడం లేదన్న బాధలో ఆమె ఆహారం కూడా తీసుకోకపోవడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆమెను ఆస్పత్రికి తరలించారు.

సీసీ కెమెరాలున్నా... మారు మూల ప్రాంతాల్లో జరిగిన నేరాలను తక్షణం కనిపెడుతున్న పోలీస్‌ విభాగం.. సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్న విశాఖ స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్‌పై ఎటువంటి సమాచారం తెలుసుకోలేకపోవడం విచారకరం. బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వెంటనే రైల్వే స్టేషన్ ఆవరణలోని సీసీ పుటేజీ పరిశీలిస్తే కొంతైనా ఫలితం దక్కేదని పలువురు పేర్కొంటున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో నాణ్యత లేకపోవడం పైగా, సంఘటన జరిగిన ప్రాంతంలో కెమెరాలు లేకపోవడం దర్యాప్తులో ఆటంకంగా మారింది.

విశాఖ రైల్వే స్టేషన్‌ విస్తీర్ణం, ప్రయాణికుల సామర్థ్యం ఆధారంగా 200పైగా కెమెరాలు ఇక్కడ అవసరం కాగా, ప్రస్తుతం 40 మాత్రమే ఉన్నాయి. వాటిలో సగం కూడా సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.