ETV Bharat / bharat

కొవిడ్​ దెబ్బ.. కిలో రూ.45 చొప్పున బస్సులు అమ్మేసిన యజమాని

author img

By

Published : Feb 13, 2022, 12:48 PM IST

Covid Restrictions: బస్సులను కిలో రూ.45 చొప్పున తుక్కు కింద విక్రయించారు కేరళలోని ఓ పర్యటక బస్సుల యజమాని. కరోనా ఆంక్షల కారణంగా తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడినట్లు చెప్పారాయన. ఇదే పరిస్థితి ఇతర బస్సు యజమానులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

covid restrictions
tourist bus operators in kerala

Covid Restrictions: కరోనా మహమ్మారి దేశంలోని అనేక రంగాలను కోలుకోలేని దెబ్బకొట్టింది. పలురకాల వ్యాపారస్తులు తీవ్ర నష్టాలను చవిచూశారు. కేరళలోని పర్యాటక బస్సు యజమానులు సైతం ఈ జాబితాలోకే చేరుతారు. కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక బస్సులు నడవక భారీగా నష్టపోయి రోడ్డున పడ్డారు. దీంతో చేసేదేంలేక ఓ యజమాని తన బస్సులను తుక్కు కింద జమచేస్తూ.. కిలోల చొప్పున విక్రయించడం వారి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

కోచి కేంద్రంగా 'రాయ్‌' టూరిజం పేరుతో పర్యాటక బస్సులను నడిపే రాయ్‌సన్‌ జోసెఫ్‌ తనకున్న 20 బస్సుల్లో ఇప్పటికే పదింటిని విక్రయించాడు. వాటిని తుక్కుగా పరిగణిస్తూ కిలో రూ.45కే విక్రయించినట్లు జోసెఫ్‌ ఆవేదనకు గురయ్యాడు. కొవిడ్‌ కారణంగా ప్రయాణ ఆంక్షలతో తీవ్రంగా నష్టపోయానని, దిక్కుతోచని స్థితిలో తన బస్సులను అమ్మేస్తున్నట్లు వాపోయాడు. పలు నిబంధనలతో బస్సులు నడుస్తున్నప్పటికీ.. అంతంతమాత్రమేనని పేర్కొన్నాడు. గడిచిన వారంలో కేవలం మూడు బస్సులు మాత్రమే మున్నార్‌ ట్రిప్‌నకు వెళ్లినట్లు తెలిపాడు.

అయితే ఈ పరిస్థితి రాయ్‌సన్‌ జోసెఫ్‌ ఒక్కడిది మాత్రమే కాదని.. అనేకమంది యజమానులు ఇలాంటి గడ్డుకాలాన్నే ఎదుర్కొంటున్నట్లు కేరళలోని బస్సు యజమానుల సంఘం కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీసీఓకే) పేర్కొంది. మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మొత్తం టూరిస్ట్ బస్సుల సంఖ్య 14వేల నుంచి 12వేలకి తగ్గినట్లు తెలిపింది. గత రెండు నెలల్లోనే వెయ్యికి పైగా టూరిస్ట్ బస్సులను బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు జప్తు చేసుకున్నారని సీసీఓకే రాష్ట్ర అధ్యక్షుడు బిను జాన్ వెల్లడించారు. వచ్చే నెలలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: అద్దె విమానాలపై కొవిడ్​ దెబ్బ.. ఎన్నికలున్నా గిరాకీ అంతంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.